State Police Recruitment Board
-
ఎస్ఐ పరీక్షకు 91.32% హాజరు
సాక్షి, హైదరాబాద్/కోదాడ అర్బన్: రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ (సివిల్), ఇతర విభాగాల్లోని ఎస్ఐ సమాన పోస్టుల ప్రాథమిక రాతపరీక్ష ప్రశాంతంగా జరిగింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 35 ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేసిన 503 పరీక్ష కేంద్రాల్లో 91.32% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరై నట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. 2,47,217 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోగా.. 2,25,759 మంది హాజరైనట్లు స్పష్టం చేశారు. ప్రతీ అభ్యర్థి హాజరును బయోమెట్రిక్ విధానంలో వేలిము ద్రలతో పాటు డిజిటల్ ఫొటో ద్వారా రికార్డు చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతా మని వెల్లడించారు. కాగా, సంగారెడ్డితో పాటు వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకున్న అభ్యర్థులను సిబ్బంది లోనికి అనుమతించలేదు. గూగుల్ తప్పుగా చూపించింది.. పరీక్షా కేంద్రానికి వచ్చేందుకు గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యానని, అందులో కోదాడలోని ఎస్ఆర్ఎం పాఠశాల కొమరబండ వద్ద చూపించిందని పాలకవీడు మండలం కోమటికుంటకు చెందిన కృష్ణ జయదేవ్ చెప్పాడు. అక్కడికి వెళ్లి మళ్లీ పట్టణంలోకి వచ్చే సరికి 10 నిమిషాలు ఆలస్యం అయ్యిందన్నాడు. గూగుల్‌లో పాఠశాల అడ్రస్‌ను అప్డేట్ చేయకపోవడంతో ఇలా జరిగిందన్నాడు. -
ఎస్ఐ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 7న
సాక్షి, హైదరాబాద్: పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా ఆగస్టు 7వ తేదీన సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ విభాగం తదితర సమానహోదా పోస్టులకు, ఆగస్టు 21న కానిస్టేబుల్ సివిల్, తదితర సమాన పోస్టులు, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ పోస్టులకు ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించనున్నట్టు రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 554 సబ్ ఇన్స్పెక్టర్ తదితర పోస్టులతోపాటు 15,644 సివిల్ తదితర సమాన కానిస్టేబుల్ పోస్టులు, 63 ట్రాన్స్‌పోర్టు, 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు మొదటిదశలో భాగంగా రాతపరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి ఆగస్టు 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 20 పట్టణాల్లో రాతపరీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఆగస్టు 21న ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 40 పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2.45 లక్షల మంది అభ్యర్థులు సబ్ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ, 6.5 లక్షల మంది కానిస్టేబుల్ అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరవుతారని శ్రీనివాసరావు వెల్లడించారు. సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ నుంచి, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. -
రాత పరీక్షపై పీఆర్బీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్పీఆర్బీ) నేతృత్వంలో జరుగుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహణపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. దరఖాస్తులకు గడువు ఈ నెల 26వ తేదీతో ముగియనుండటంతో పరీక్ష తేదీని ఖరారు చేయడం, రాత పరీక్ష కోసం ఏర్పాటు చేయాల్సిన పరీక్ష కేంద్రాలు, ఇన్విజిలేటర్ల ఎంపిక తదితర అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. జూలై రెండు లేదా మూడో వారంలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసు ఉద్యోగాలకు ఇప్పటికే దాదాపు 13 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో చాలామంది రెండు నుంచి మూడు ఉద్యోగాలకు దరఖాస్తు చేయడంతో పెద్ద సంఖ్యలో రాత పరీక్ష కేంద్రాల ఎంపిక కత్తిమీద సాములా మారినట్టు తెలుస్తోంది. ముందుగా సబ్ ఇన్స్పెక్టర్, సమాన ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. దీనితో అభ్యర్థుల సంఖ్యకు తగ్గట్టుగా కాలేజీలు, స్కూళ్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పరీక్ష ఆదివారం రోజు నిర్వహించాల్సి ఉంటుందని భావిస్తున్న అధికారులు ఈ మేరకు యాజమాన్యాలతో చర్చిస్తున్నారు. ఆయా జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, కలెక్టర్లతో సంపద్రించి ఎన్ని కాలేజీలు, స్కూళ్లు సెంటర్లుగా ఏర్పాటు చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఒకే తేదీల్లో రాకుండా.. ఒకవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మరోవైపు టీఎస్పీఆర్బీ నిర్వహించే పరీక్షల తేదీలు ఒకేరోజు రాకుండా చూడటంపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. రైల్వేతో పాటు వివిధ పోటీ పరీక్షలు సైతం జూన్, జూలైలో ఉండటంతో ఈ పరీక్షలు రాసే అభ్యర్థులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జూలై రెండో వారం లేదా మూడో వారంలో ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించాలని టీఎస్పీఆర్బీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తొలుత జూన్ ఆఖరులో లేదా జూలై మొదటి వారంలో నిర్వహించాలని భావించినా, ప్రభుత్వం ఈ ఉద్యోగాలకు మరో రెండేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు ఇవ్వడంతో.. దరఖాస్తు దాఖలుకు గడువును కూడా పొడిగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రెండు వారాలు ఆలస్యంగా రాత పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నట్టు బోర్డు అధికార వర్గాలు తెలిపాయి. -
పోలీస్ అయ్యేదెప్పుడు?
రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి. భారీ స్థాయిలో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులతో పాటు ఇతర విభాగాల్లోని పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ బోర్డు రాత పరీక్షలు నిర్వహించింది. అలాగే తర్వాతి దశకు అభ్యర్థులను సైతం ఎంపిక చేసింది. అయితే ఈ పరీక్షల్లో సిలబస్‌లో లేని అంశాల నుంచి ప్రశ్నలొచ్చాయని ఆరోపిస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఔటాఫ్ సిలబస్ వల్ల తాము నష్టపోయామని వాదిస్తూ దేహదారుఢ్య పరీక్షలకు తమను అర్హులుగా చేయడంతో పాటు సంబంధిత ప్రశ్నలకు మార్కులు జతచేసేలా ఆదేశించాలంటూ కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యవహారంలో కోర్టు తాత్కాలికంగా నియామక ప్రక్రియను నిలిపేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తర్వాతి దశకు ఎంపికైన అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీస్ శాఖలో చేరాలన్న పట్టుదలతో వేలకు వేలు ఖర్చు చేసి శిక్షణ తీసుకున్నామని.. తీరా దేహదారుఢ్య పరీక్షకు వచ్చేసరికి నియామక ప్రక్రియ ఆపేస్తే ఎలా అని అభ్యర్థులు మనోవేదనకు గురవుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ తాత్కాలికమే అయినా.. బోర్డు షెడ్యూల్ ప్రకారం దేహదారుఢ్య పరీక్షలు గతేడాది డిసెంబర్ 17 నుంచి జరగాల్సి ఉంది. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు రిక్రూట్మెంట్ బోర్డు అధికారికంగా గతేడాది డిసెంబర్ 11న ప్రకటించింది. అప్పట్నుంచి ఇప్పటివరకు కోర్టులో ఉన్న ఈ కేసు వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలియక అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇది కేవలం తాతాల్కికమే అంటూ చెప్తూ వస్తున్న బోర్డు మాత్రం అభ్యర్థులకు స్పష్టమైన హామీనివ్వడం లేదు. 18,428 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న 9 లక్షల మంది అభ్యర్థుల్లో సగం మంది అభ్యర్థులు రాత పరీక్షలో అర్హత సాధించారు. ఇటు కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు, ఇటు స్వీయ శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. గత నోటిఫికేషన్లోనూ... రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015–16 మధ్య తొలిసారిగా నిర్వహించిన 10 వేల కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీలోనూ ఇలాంటి గందరగోళమే ఏర్పడింది. రిజర్వేషన్ల వ్యవహారం, కటాఫ్ మార్కుల వ్యవహారంలో బోర్డు పనితీరుపై అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్సీసీ కేటగిరీలో రిజర్వేషన్ సరిగ్గా అమలు చేయకపోవడం, కటాఫ్ వ్యవహారంలో అభ్యర్థులకు అన్యాయం జరగడం వల్ల విషయం హైకోర్టుకు చేరి సుమారు 4 నెలల పాటు భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది. ఇప్పుడున్న పరిస్థితిపై తాజా భర్తీ ప్రక్రియ ఎన్ని నెలలు వాయిదా పడుతుందో తెలియదని బోర్డు అధికారులు అనధికారికంగా చెప్తున్నారు. అయితే వరుసగా పలు ఎన్నికలు రావడంతో రిక్రూట్మెంట్ ప్రక్రియ మే చివరి వరకు నిలిచిపోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ ఎన్నికలన్నీ అయిపోయిన తర్వాతే కోర్టు కేసు పరిష్కారం అవుతుందని కొందరు అంటున్నారు. ఏదిఏమైనా రిక్రూట్మెంట్ అధికారులు ఓ ప్రకటన చేసి లక్షలాది మంది అభ్యర్థులకున్న అనుమానాలను నివృత్తి చేయాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. -
ఎస్సై అభ్యర్థుల్లో ‘ఆంగ్ల’ గుబులు!
ఎంపికలో ఇంగ్లిష్ మార్కుల వెయిటేజీపై ఆందోళన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు గతే డాది నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) మెయిన్స్ పరీక్ష... అభ్యర్థుల్లో ‘ఆంగ్ల’ గుబులు రేపుతోంది. అభ్యర్థుల ఎంపికలో తెలుగు/ ఉర్దూతోపాటు ఇంగ్లిష్ సబ్జెక్ట్‌కు వెయి టేజీ ఉండటం తెలుగు మీడియం చదివిన 75% మంది అభ్యర్థుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. నోటిఫికేషన్లో ఉన్న ఈ నిబంధనవల్ల తమకు అన్యాయం జరుగుతుందంటూ గతంలో నా లుగుసార్లు డీజీపీ కార్యాలయం ముట్టడి, సచివాలయం వద్ద ఆందోళన చేపట్టినా వెయి టేజీ వ్యవహారంలో వెనక్కి వెళ్లడం కుద రదని న్యాయశాఖ తాజాగా తేల్చిచెప్పడంతో వేలాది మంది అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం... ఎస్సై సివిల్, ఫైర్ విభాగాల్లోని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టుల భర్తీలో పేపర్–1, 2లతోపాటు పేపర్–3 ఇంగ్లిష్ (డిస్క్రిప్టివ్), పేపర్–4 తెలుగు (డిస్క్రిప్టివ్)ల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా రు. వాస్తవానికి పేపర్–3, 4లలో సాధించిన మార్కులను వెయిటే జీగా తీసుకొని తుది ఎంపికలో పరిగణన లోకి తీసుకుంటామని నోటిఫికేషన్లో బోర్డు స్పష్టం చేసింది. దీనిపై నిరుద్యోగ సంఘాలు గతంలో ఆందోళనబాట పట్టా యి. సీఎం కేసీఆర్‌ను కలసి వినతిపత్రం సమర్పించాయి. అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన సీఎం కేసీఆర్...వెయిటేజీపై పునఃపరిశీలించాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇంగ్లిష్‌ను కేవలం అర్హత పరీక్షగానే పరిగణిస్తామని అధికారులు సైతం మౌఖికంగా పేర్కొన్నారు. కానీ నోటిఫికేషన్ లో పేర్కొన్న నిబంధనల ప్రకారం సివిల్, ఫైర్ విభాగాల్లోని పోస్టులకు పేపర్–1, 2, 3, 4లలో మొత్తం 600 మార్కులకు సాధించిన మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తున్నట్లు సమాచారం. వెయిటేజీపై కుదరదన్న న్యాయశాఖ... సీఎం ఆదేశంతో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వెయిటేజీ వ్యవహారంపై న్యాయశాఖ సలహా కోరగా నాలుగు రోజుల క్రితం బోర్డు ఉన్నతాధికారులకు సలహా అందింది. ఇంగ్లిష్ వెయిటేజీని తొలగించడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని, ఒకసారి నోటిఫికేషన్లో వెయిటేజీ గురించి స్పష్టంగా పేర్కొని నియామక ప్రక్రియ చేపట్టాక వెనక్కి వెళ్లడం కుదరదని తేల్చిచెప్పింది. దీంతో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆందోళనలో పడింది. కోర్టుకు చేరితే నోటిఫికేషన్ రద్దు! నోటిఫికేషన్లో పేర్కొన్న వెయిటేజీ అంశాన్ని ఒకవేళ పక్కన పెట్టి ఫలితాలు ప్రకటిస్తే వివాదం కోర్టుకు చేరుతుందని, నోటిఫికేషన్ కు విరుద్ధంగా నియామకాలు చేపట్టడం వల్ల నోటిఫికేషనే రద్దయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళనలో ఉన్నారు. ఆగస్టు మొదటి వారంలో ఫలితాలు.. ఆగస్టు మొదటి వారంలో ఎస్సై పోస్టుల ఫలితాలు వెల్లడించి, సెప్టెంబర్ నుంచి తొమ్మిది నెలల శిక్షణ మొదలు పెట్టాలన్న ఆలోచనలో పోలీసు శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం 510 పోస్టులకు బోర్డు చేపట్టిన నియామక ప్రక్రియలో 56 వేల మందికిపైగా తుది పరీక్ష రాసినట్లు అధికారులు గతంలో తెలిపారు. అందుకే ఆలస్యమా? 2016 ఫిబ్రవరి 2న ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన పోలీసుశాఖ... మూడు దశల్లో జరిగే నియామక ప్రక్రియలో మెయి న్స్ పరీక్షను 2016 నవంబర్ చివరి వారంలో నిర్వహించింది. తుది పరీక్షలు నిర్వహించి నెలలు గడుస్తున్నా ఫలితాలు వెల్లడించకపో వడంతో అభ్యర్థులు మార్చిలో ఆందోళన చేశారు. అయితే ప్రభుత్వం నుంచి పలు జీవోలు రావాలని బోర్డు అధికారులు వెల్ల డిస్తూ వచ్చారు. కానీ అసలు కారణం ఇంగ్లి ష్ మార్కుల వెయిటేజీ వ్యవహారమేనని న్యాయశాఖ సలహాతో బయటపడింది. ఇప్పటికే కానిస్టేబుళ్ల ఎంపికలో రిజర్వేషన్లు, కటాఫ్ మార్కులు.. తదితరాల్లో బోర్డుకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఎంపికలో జరిగిన అవకతవకల వల్ల 48 మంది ఓపెన్ చాలెంజ్ ద్వారా ఉద్యోగాలు పొందారు. ఎస్సై పరీక్షల్లోనూ కోర్టు ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉందని గ్రహించి వెయిటేజీ వ్యవహారం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తపడుతున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.