ఎస్సై అభ్యర్థుల్లో ‘ఆంగ్ల’ గుబులు!
ఎస్సై అభ్యర్థుల్లో ‘ఆంగ్ల’ గుబులు!
Published Wed, Jul 19 2017 3:57 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM
ఎంపికలో ఇంగ్లిష్ మార్కుల వెయిటేజీపై ఆందోళన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు గతే డాది నిర్వహించిన సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) మెయిన్స్ పరీక్ష... అభ్యర్థుల్లో ‘ఆంగ్ల’ గుబులు రేపుతోంది. అభ్యర్థుల ఎంపికలో తెలుగు/ ఉర్దూతోపాటు ఇంగ్లిష్ సబ్జెక్ట్‌కు వెయి టేజీ ఉండటం తెలుగు మీడియం చదివిన 75% మంది అభ్యర్థుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. నోటిఫికేషన్‌లో ఉన్న ఈ నిబంధనవల్ల తమకు అన్యాయం జరుగుతుందంటూ గతంలో నా లుగుసార్లు డీజీపీ కార్యాలయం ముట్టడి, సచివాలయం వద్ద ఆందోళన చేపట్టినా వెయి టేజీ వ్యవహారంలో వెనక్కి వెళ్లడం కుద రదని న్యాయశాఖ తాజాగా తేల్చిచెప్పడంతో వేలాది మంది అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.
నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం...
ఎస్సై సివిల్, ఫైర్ విభాగాల్లోని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టుల భర్తీలో పేపర్–1, 2లతోపాటు పేపర్–3 ఇంగ్లిష్ (డిస్క్రిప్టివ్), పేపర్–4 తెలుగు (డిస్క్రిప్టివ్)ల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా రు. వాస్తవానికి పేపర్–3, 4లలో సాధించిన మార్కులను వెయిటే జీగా తీసుకొని తుది ఎంపికలో పరిగణన లోకి తీసుకుంటామని నోటిఫికేషన్‌లో బోర్డు స్పష్టం చేసింది. దీనిపై నిరుద్యోగ సంఘాలు గతంలో ఆందోళనబాట పట్టా యి. సీఎం కేసీఆర్‌ను కలసి వినతిపత్రం సమర్పించాయి. అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన సీఎం కేసీఆర్...వెయిటేజీపై పునఃపరిశీలించాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇంగ్లిష్‌ను కేవలం అర్హత పరీక్షగానే పరిగణిస్తామని అధికారులు సైతం మౌఖికంగా పేర్కొన్నారు. కానీ నోటిఫికేషన్ లో పేర్కొన్న నిబంధనల ప్రకారం సివిల్, ఫైర్ విభాగాల్లోని పోస్టులకు పేపర్–1, 2, 3, 4లలో మొత్తం 600 మార్కులకు సాధించిన మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తున్నట్లు సమాచారం.
వెయిటేజీపై కుదరదన్న న్యాయశాఖ...
సీఎం ఆదేశంతో పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు వెయిటేజీ వ్యవహారంపై న్యాయశాఖ సలహా కోరగా నాలుగు రోజుల క్రితం బోర్డు ఉన్నతాధికారులకు సలహా అందింది. ఇంగ్లిష్ వెయిటేజీని తొలగించడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని, ఒకసారి నోటిఫికేషన్‌లో వెయిటేజీ గురించి స్పష్టంగా పేర్కొని నియామక ప్రక్రియ చేపట్టాక వెనక్కి వెళ్లడం కుదరదని తేల్చిచెప్పింది. దీంతో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆందోళనలో పడింది.
కోర్టుకు చేరితే నోటిఫికేషన్ రద్దు!
నోటిఫికేషన్‌లో పేర్కొన్న వెయిటేజీ అంశాన్ని ఒకవేళ పక్కన పెట్టి ఫలితాలు ప్రకటిస్తే వివాదం కోర్టుకు చేరుతుందని, నోటిఫికేషన్ కు విరుద్ధంగా నియామకాలు చేపట్టడం వల్ల నోటిఫికేషనే రద్దయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళనలో ఉన్నారు.
ఆగస్టు మొదటి వారంలో ఫలితాలు..
ఆగస్టు మొదటి వారంలో ఎస్సై పోస్టుల ఫలితాలు వెల్లడించి, సెప్టెంబర్ నుంచి తొమ్మిది నెలల శిక్షణ మొదలు పెట్టాలన్న ఆలోచనలో పోలీసు శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం 510 పోస్టులకు బోర్డు చేపట్టిన నియామక ప్రక్రియలో 56 వేల మందికిపైగా తుది పరీక్ష రాసినట్లు అధికారులు గతంలో తెలిపారు.
అందుకే ఆలస్యమా?
2016 ఫిబ్రవరి 2న ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన పోలీసుశాఖ... మూడు దశల్లో జరిగే నియామక ప్రక్రియలో మెయి న్స్ పరీక్షను 2016 నవంబర్ చివరి వారంలో నిర్వహించింది. తుది పరీక్షలు నిర్వహించి నెలలు గడుస్తున్నా ఫలితాలు వెల్లడించకపో వడంతో అభ్యర్థులు మార్చిలో ఆందోళన చేశారు. అయితే ప్రభుత్వం నుంచి పలు జీవోలు రావాలని బోర్డు అధికారులు వెల్ల డిస్తూ వచ్చారు. కానీ అసలు కారణం ఇంగ్లి ష్ మార్కుల వెయిటేజీ వ్యవహారమేనని న్యాయశాఖ సలహాతో బయటపడింది. ఇప్పటికే కానిస్టేబుళ్ల ఎంపికలో రిజర్వేషన్లు, కటాఫ్ మార్కులు.. తదితరాల్లో బోర్డుకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఎంపికలో జరిగిన అవకతవకల వల్ల 48 మంది ఓపెన్ చాలెంజ్ ద్వారా ఉద్యోగాలు పొందారు. ఎస్సై పరీక్షల్లోనూ కోర్టు ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉందని గ్రహించి వెయిటేజీ వ్యవహారం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తపడుతున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Advertisement