
సాక్షి, హైదరాబాద్: ప్రత్యక్షం.. పరోక్షం.. పెద్ద వాటికి పరోక్షం, చిన్న వాటికి ప్రత్యక్షం.. ఇలా రకరకాల ఆలోచనల తర్వాత పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం ఓ స్పష్టతకొచ్చింది. ఎప్పట్లాగే గ్రామ పంచాయతీల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు. బుధవారం కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ కొత్త పంచాయతీరాజ్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. చర్చ తర్వా త గురువారం బిల్లుకు ఆమోదముద్ర పడనుంది. పరోక్ష విధానంలో ఎన్నికలు జరిపేలా చట్టానికి సవరణ చేసే కసరత్తు జరుగుతోందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరిగింది.
బిల్లుపై గత రెండుమూడ్రోజులుగా న్యాయశాఖ, పంచాయతీరాజ్ శాఖలు మల్లగుల్లాలు పడుతున్నాయి. చివరకు మంగళవారం సీఎం ఆదేశంతో ప్రత్యక్ష విధానానికే మొగ్గు చూపుతూ బిల్లు రూపొందించారు. షార్ట్ సర్క్యులేషన్ విధానంలో మంత్రివర్గం ఆమోదం పొందటంతో బుధవారం నేరుగా సభలో ప్రవేశపెట్టనున్నారు. చివరిరోజున కాగ్ నివేదికను కూడా ప్రభుత్వం సభ ముందుంచనుంది. రాష్ట్రంలో కొత్తగా 4,380 గ్రామ పంచాయతీలు ఏర్పాటు కాబోతున్నాయి. వీటితో కలుపుకొని రాష్ట్రంలో పంచాయతీల సంఖ్య 12,740కు చేరనుంది.
Comments
Please login to add a commentAdd a comment