పోలీస్‌ అయ్యేదెప్పుడు? | Doubts on Constables and si posts | Sakshi
Sakshi News home page

పోలీస్‌ అయ్యేదెప్పుడు?

Published Fri, Jan 4 2019 12:02 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Doubts on Constables and si posts - Sakshi

రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహిస్తున్న పోలీస్‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి. భారీ స్థాయిలో కానిస్టేబుల్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులతో పాటు ఇతర విభాగాల్లోని పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్‌ బోర్డు రాత పరీక్షలు నిర్వహించింది. అలాగే తర్వాతి దశకు అభ్యర్థులను సైతం ఎంపిక చేసింది. అయితే ఈ పరీక్షల్లో సిలబస్‌లో లేని అంశాల నుంచి ప్రశ్నలొచ్చాయని ఆరోపిస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఔటాఫ్‌ సిలబస్‌ వల్ల తాము నష్టపోయామని వాదిస్తూ దేహదారుఢ్య పరీక్షలకు తమను అర్హులుగా చేయడంతో పాటు సంబంధిత ప్రశ్నలకు మార్కులు జతచేసేలా ఆదేశించాలంటూ కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యవహారంలో కోర్టు తాత్కాలికంగా నియామక ప్రక్రియను నిలిపేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తర్వాతి దశకు ఎంపికైన అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీస్‌ శాఖలో చేరాలన్న పట్టుదలతో వేలకు వేలు ఖర్చు చేసి శిక్షణ తీసుకున్నామని.. తీరా దేహదారుఢ్య పరీక్షకు వచ్చేసరికి నియామక ప్రక్రియ ఆపేస్తే ఎలా అని అభ్యర్థులు మనోవేదనకు గురవుతున్నారు.   
 – సాక్షి, హైదరాబాద్‌

తాత్కాలికమే అయినా.. 
బోర్డు షెడ్యూల్‌ ప్రకారం దేహదారుఢ్య పరీక్షలు గతేడాది డిసెంబర్‌ 17 నుంచి జరగాల్సి ఉంది. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారికంగా గతేడాది డిసెంబర్‌ 11న ప్రకటించింది. అప్పట్నుంచి ఇప్పటివరకు కోర్టులో ఉన్న ఈ కేసు వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలియక అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇది కేవలం తాతాల్కికమే అంటూ చెప్తూ వస్తున్న బోర్డు మాత్రం అభ్యర్థులకు స్పష్టమైన హామీనివ్వడం లేదు. 18,428 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న 9 లక్షల మంది అభ్యర్థుల్లో సగం మంది అభ్యర్థులు రాత పరీక్షలో అర్హత సాధించారు. ఇటు కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు, ఇటు స్వీయ శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.

గత నోటిఫికేషన్‌లోనూ... 
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015–16 మధ్య తొలిసారిగా నిర్వహించిన 10 వేల కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీలోనూ ఇలాంటి గందరగోళమే ఏర్పడింది. రిజర్వేషన్ల వ్యవహారం, కటాఫ్‌ మార్కుల వ్యవహారంలో బోర్డు పనితీరుపై అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్‌సీసీ కేటగిరీలో రిజర్వేషన్‌ సరిగ్గా అమలు చేయకపోవడం, కటాఫ్‌ వ్యవహారంలో అభ్యర్థులకు అన్యాయం జరగడం వల్ల విషయం హైకోర్టుకు చేరి సుమారు 4 నెలల పాటు భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది. ఇప్పుడున్న పరిస్థితిపై తాజా భర్తీ ప్రక్రియ ఎన్ని నెలలు వాయిదా పడుతుందో తెలియదని బోర్డు అధికారులు అనధికారికంగా చెప్తున్నారు. అయితే వరుసగా పలు ఎన్నికలు రావడంతో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ మే చివరి వరకు నిలిచిపోతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ ఎన్నికలన్నీ అయిపోయిన తర్వాతే కోర్టు కేసు పరిష్కారం అవుతుందని కొందరు అంటున్నారు. ఏదిఏమైనా రిక్రూట్‌మెంట్‌ అధికారులు ఓ ప్రకటన చేసి లక్షలాది మంది అభ్యర్థులకున్న అనుమానాలను నివృత్తి చేయాలన్న డిమాండ్‌ సర్వత్రా వ్యక్తమవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement