సీబీఎస్ఈ కంటే మన సిలబసే ఎక్కువ
- ‘నీట్’కు దాన్ని మినహాయించి చదివితే చాలు
- ఇంటర్ బోర్డు భేటీలో నిపుణుల స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: నీట్ సిలబస్ రాష్ట్ర విద్యార్థులకు సమస్యే కాదని నిఫుణులు స్పష్టం చేశారు. నీట్ పరిగణనలోకి తీసుకునే సీబీఎస్ఈ 11, 12 తరగతుల సిలబస్‌లోని అంశాలన్నీ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి నీట్ తప్పనిసరి కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఇంటర్ సిలబస్‌లో మార్పులపై సబ్జెక్టు నిపుణులతో ఇంటర్ బోర్డు శనివారం సమావేశం నిర్వహించింది.
రెండింటినీ పరిశీలించిన నిపుణులు, సీబీఎస్ఈ కంటే మన బోర్డు సిలబస్‌లోనే అదనపు పాఠ్యాంశాలున్నాయని తేల్చారు. వచ్చే ఏడాది నుంచి నీట్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు మన బోర్డు సిలబస్‌లో అదనంగా ఉన్న అంశాలను తొలగించి మిగతావి మాత్రం ప్రిపేరైతే సరిపోతుందన్నారు. కాబట్టి ఏ ఆందోళనా లేకుండా నీట్-2 పరీక్షకు సిద్ధమవ్వాలని సూచించారు. అయితే నెగిటివ్ మార్కుల విషయంలో గ్రామీణ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
2010లో నీట్‌ను ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించినప్పుడే రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ సబ్జెక్టుల సిల బస్‌ను నీట్‌కు అనుగుణంగా, సీబీఎస్ ఈ 11, 12 తరగతుల్లోని సిలబస్ మేరకు మార్చారు. సీబీఎస్ఈ కంటే రాష్ట్ర బోర్డు బోటనీలో 20 శాతం, జువాలజీలో 30% సిలబస్ అదనంగా ఉందని లెక్చరర్లు చెబుతున్నారు.మన సిలబస్‌లో సబ్జెక్టుల వారీగా ఉన్న అదనపు అంశాలు...
ఫిజిక్స్‌లో: సీబీఎస్ఈలో ఉన్నవే ఇంటర్ బోర్డు సిలబస్‌లోనూ ఉన్నాయి
కెమిస్ట్రీలో: సీబీఎస్ఈలో ఉన్న అన్ని టాపిక్లతో పాటు, అందులో లేని ‘ఎక్స్’ కిరణ స్పటిక విజ్ఞానమనే టాపిక్ కూడా బోర్డు సిలబస్‌లో ఉంది
జువాలజీలో: సీబీఎస్ఈ సిలబస్‌కు అదనంగా ఆవరణ శాస్త్రం, ఏక కణ జీవుల గమనం, ప్రత్యుత్పత్తి, మానవ పరిణామక్రమం, వ్యాధి నిరోధక శాస్త్రం పాఠ్యాంశాలున్నాయి
వృక్షశాస్త్రంలో: వృక్ష ఆవరణ శాస్త్రం, సూక్ష్మ జీవ శాస్త్రంలో బ్యాక్టీరియా, వైరస్, వృక్షశాస్త్ర పరిధి, వృక్షశాస్త్ర శాఖలు, ద్విభాగాలు పాఠ్యాంశాలు కూడా మన దగ్గరే అదనంగా ఉన్నాయి.
పుస్తకాల్లో నేరుగా లేనివి 9 ప్రశ్నలే
ఇటీవల జరిగిన నీట్-1 పరీక్ష తాలూకు ప్రశ్నపత్రాల సరళిని చూస్తే మన ఇంటర్ పుస్తకాల్లో లేని ప్రశ్నలు 9 వచ్చాయి. అయితే వాటిలో మూ డింటికి కాన్సెప్టులు (భావనలు) అడిగారు. మరో మూడింటిని ప్రయోగ దీపికల నుంచి అడిగారు. ఇంకో మూడింటిని బేసిక్ కాన్సెప్టుల నుంచి అడిగారు. ఇవి సీబీఎస్ఈ 8 నుంచి 10వ తరగతి పుస్తకాల్లో ఉన్నవే.