State visit
-
నేడు రాష్ట్రానికి అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం నాటి రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పర్యటనలో భాగంగా... ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1:20 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు ఇంపీరియల్ గార్డెన్లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్‌లో పాల్గొని వారికి అమిత్ షా దిశా నిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:15 నుంచి 4:25 వరకు ఎల్బీ స్టేడియంలో నిర్వ హించే విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొంటారు. బీజేపీ పోలింగ్ బూత్ కమిటీల అధ్యక్షులు, ఆ పై మండల, జిల్లా కమిటీల అధ్యక్షులు, నాయకులు పార్టీ కార్యకర్తలకు ఆయన మార్గ నిర్దేశం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 వేల పోలింగ్ బూత్‌లు ఉండడంతో ఈ బూత్ కమిటీల అధ్యక్షులు, ఇన్చార్జిలు, ఇతరనాయకులు.. మొత్తంగా దాదాపు 50–60 వేల మంది వరకు ఈ సమ్మేళనానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర నేతలతో భేటీ కానున్న షా సమ్మేళనం అనంతరం సాయంత్రం 4:45 నుంచి 5:45 వరకు ఐటీసీ కాకతీయ హోటల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికల ప్రచారం, నాయకుల మధ్య మరింత మెరుగైన సమన్వయంపై అమిత్ షా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. సాయంత్రం 6:10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు. -
అమిత్ షా రాక.. బీజేపీలో ‘చేరికల’ కాక! రాష్ట్ర నేతల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటన ఆ పార్టీ ముఖ్య నేతల్లో కాక రేపుతోంది. ‘హార్డ్ టాస్క్ మాస్టర్’గా పేరొందిన అమిత్ షా ఇంతకుముందు వచ్చినప్పుడు రాష్ట్ర పార్టీకి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఆరేడు నెలల్లోనే ఎన్నిక లున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో పార్టీ సన్నద్ధత, సంస్థాగత బలోపేతం, ఇతర పార్టీల నుంచి చేరికల వేగవంతానికి చేపట్టాల్సిన చర్యలను సూచించారు. అయితే ఆయా అంశాల్లో ఆశించిన మేర ముందుకు సాగని పరిస్థితిలో అమిత్‌షాకు ఏం చెప్పాలనే దానిపై ముఖ్యనేతల్లో ఆందోళన కనిపిస్తున్నట్టు సమాచారం. దీనికితోడు ఎన్నికలకు పూర్తిస్థాయి సన్నద్ధతలో భాగంగా అమిత్ షా ఎలాంటి కఠిన అసైన్మెంట్లు ఇస్తారోనన్న టెన్షన్ రాష్ట్ర ముఖ్యనేతలను కలవరపెడుతోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఊపందుకోని చేరికల కార్యాచరణ మునుగోడు ఉప ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆ తర్వాత ఇటీవల కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి తప్ప ముఖ్య నేతలెవరూ బీజేపీలో చేరలేదు. ఉమ్మడి జిల్లాల స్థాయిలో ప్రభావమున్న నాయకుల చేరికలు కూడా జరగలేదు. జాతీయస్థాయి నేతలు రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రతీసారి చేరికలపై ఊహాగానాలు వెలువడుతున్నా అవి సాకారం కావడం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని రాష్ట్ర నాయకులు తరచూ చెప్పడమే తప్ప.. ఆ మేరకు కార్యాచరణ ముందుకు పడలేదు. ఈ క్రమంలో చేరికలపై అమిత్‌షాకు ఏం చెప్పాలని ముఖ్యనేతల్లో ఆందోళన నెలకొన్నట్టు తెలిసింది. సమన్వయం, విందు భేటీలపై.. గత నెలన్నర రోజుల్లో ఢిల్లీలో, హైదరాబాద్‌లో జరిగిన సమావేశాల్లో రాష్ట్ర పార్టీ ముఖ్యనేతల మధ్య సమన్వయం అవసరాన్ని, సమష్టిగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకతను అమిత్‌షా నొక్కిచెప్పారు. వారం, రెండు వారాలకోసారి నేతల నివాసాల్లో అల్పాహారం, లంచ్, డిన్నర్ వంటివి ఏర్పాటు చేసుకోవాలని.. అంతా కలుసుకుని, ఆలోచనలు పంచుకోవాలని, సమన్వయం పెంచుకోవాలని సూచించారు. ఇది కూడా అమలైన దాఖలాలు లేవు. ఈ విషయంలో అమిత్‌షా ప్రశ్నిస్తే ఏమని చెప్పాలనే తర్జనభర్జన రాష్ట్ర నేతల్లో కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బూత్ కమిటీల నియామకాలపై.. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలింగ్ బూత్ కమిటీలను నియామించాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్‌షా ఇంతకుముందే ఆదేశించారు. ఈ అంశంలో రాష్ట్ర సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్ వరుస సమీక్షలతో రాష్ట్ర నేతల వెంటపడుతున్నారు. అయినా కొన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. అసలు అమిత్‌షా సభ జరగనున్న చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలోని చేవెళ్ల, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ కమిటీల నియామకం పూర్తి కాలేదు. అంతేగాకుండా ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన నేతలు కూడా లేరు. సమీక్ష సందర్భంగా ఈ అంశంపై అమిత్‌షాకు ఎలా సమాధానం చెప్పాలన్న దానిపై పార్టీ నాయకులు మీమాంసలో పడినట్టు తెలిసింది. ఒక దశలో చేవెళ్లలో అమిత్‌షా సభ వద్దని స్థానిక నేతలు పట్టుబట్టినట్టు సమాచారం. కానీ పార్టీ పెద్దల ఆదేశాలతో ప్రవాసీ యోజన, సభకు ఏర్పాట్లు మొదలుపెట్టినట్టు తెలిసింది. చేవెళ్ల సభను విజయవంతం చేసి అమిత్‌షా మెప్పు పొందాలని భావిస్తున్నట్టు సమాచారం. సభ తర్వాత విస్తృత సమీక్ష కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని ముందుండి నడిపిస్తున్న అమిత్‌షా ఆదివారం హైదరాబాద్‌కు రానున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా చేవెళ్లకు చేరుకుని ‘పార్లమెంట్ ప్రవాసీ యోజన’ కార్యక్రమం, సభలో పాల్గొంటారు. తర్వాత హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌కు చేరుకుని.. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ, ఇతర ముఖ్య నేతలతో విస్తృతంగా సమీక్షించనున్నారు. పార్టీపరంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వాటిద్వారా ప్రజలకు ఏమేరకు చేరువయ్యారు? పోలింగ్ బూత్ కమిటీల నియామకం, శక్తి కేంద్రాల ఏర్పాటు (3, 4 బూత్‌లు కలిపి ఒకటి), సంస్థాగతంగా వివిధ కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు. రాజకీయంగానూ హీట్ అమిత్‌షా తెలంగాణ పర్యటన అటు రా>ష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచబోతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీఆర్ఎస్తోపాటు బీజేపీ, కాంగ్రెస్, ఇతర చిన్నపార్టీలు దూకుడు పెంచాయి. ఇలాంటి సమయంలో 23న చేవెళ్ల సభలో అమిత్‌షా ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను సవాల్ చేస్తూ.. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేలా ఈ సభ ఉండొచ్చని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. పేర్లు వినిపిస్తున్నా.. చేరికలేవి? బీఆర్ఎస్పై విమర్శలు గుప్పిస్తూ, ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలతో రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. బీఆర్ఎస్ను ధిక్కరించి మాట్లాడుతూ పార్టీ నుంచి సస్పెండైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ముఖ్య నేత జూపల్లి కృష్ణారావు.. ఈ ఇద్దరిని చేర్చుకోవడానికి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉండి, రాష్ట్రంలోనూ గెలుస్తామంటున్న బీజేపీలో చేరికపై వారు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఈ విషయంలో బీజేపీ నేతలు వెనుకబడ్డారేమోనన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. అమిత్‌షా చేవెళ్ల సభ సందర్భంగా వారిని బీజేపీలో చేర్చుకుని ఉంటే.. పార్టీకి ఊపు వచ్చేదని అంటున్నారు. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముఖ్యనేత, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తాను బీఆర్ఎస్ను వీడి వేరే పార్టీలో చేరనున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని గురువారం ఖండించారు. బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ప్రకటించారు. -
మార్చిలో రజనీ రాజకీయ యాత్ర..
సాక్షి, చెన్నై: మార్చి నెల నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ యాత్ర ప్రారంభమౌతున్నట్లు సమాచారం. రాష్ట్ర పర్యటనపై రజనీ కసరత్తులు చేస్తున్నారు. ఫిబ్రవరి చివరిలోపు మక్కల్ మండ్రమ్ జిల్లా కన్వీనర్లను సూపర్ స్టార్ నియమించనున్నారు. మక్కల్ మండ్రమ్ కార్యదర్శిగా రాజూ మహాలింగం నియమితులయ్యారు. చెన్నైలో రాజకీయ పరిస్థితులు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. రజనీ కాంత్ వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ఇది వరకే ప్రకటించారు. ప్రస్తుతం కమల్ హాసన్ కూడా రాజకీయ పార్టీ ప్రకటనకు కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. -
కమలం... కాస్త సతమతం
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనపై బీజేపీ నాయకుల్లో తీవ్ర ఉత్కంఠతో పాటు ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. తెలంగాణ ఏర్పడ్డాక రెండేళ్ల తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి ప్రధాని వస్తున్నందున ఈ సందర్భంగా ఏమి జరుగుతుందా అన్న ఆసక్తి కూడా నెలకొందట. దానితో పాటు రాష్ట్రపార్టీకి ఏమని దిశానిర్దేశం చేస్తారు? టీఆర్ఎస్ పట్ల బీజేపీ రాజకీయ వైఖరి ఎలా ఉండబోతుంది? అన్న దానిపై పార్టీలో తెగ తర్జనభర్జనలు సాగుతున్నాయట. అయితే ఏదైనా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమో లేదా పథకం కోసమో కాకుండా సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ ‘మిషన్ భగీరథ’ కార్యక్రమం ప్రారంభానికి రావడం ఏమిటా అన్న ప్రశ్నలను కొందరు నాయకులు వేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గజ్వేల్‌లోనే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు కేంద్రప్రభుత్వానికి సంబంధించిన రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్, రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంట్ పునరుద్ధరణ వంటి వాటికి ఒకేచోట ప్రారంభోత్సవం చేయడం ఏమిటనే అభ్యంతరాలు కూడా అంతర్గత చర్చల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. అసలు ప్రధాని ప్రసంగం ఏ విధంగా ఉండబోతుందో, ఏయే అంశాలను ప్రస్తావిస్తారనే ఉత్కంఠ కూడా పార్టీలో వ్యక్తమవుతోంది. అసలు మిషన్ భగీరథ వంటి కార్యక్రమానికి రావడమే కరెక్ట్ కాద ని వాదిస్తున్న వారూ ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు మిషన్ భగీరథను పొగిడితే తాము రాజకీయంగా ఎలాంటి ఇబ్బందుల్లో పడతామోనన్న ఆందోళన కూడా నెలకొందట. అప్పుడు రాష్ట్ర బీజేపీగా తమకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే అస్త్రాలు కూడా కరువవుతాయన్నది వారి వాదనట. అంతేకాకుండా రాష్ట్రంలో బీజేపీనే టీఆర్ఎస్కు నిజమైన ప్రత్యామ్నాయం అని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని నాయకులు, కేడర్‌లో జోష్ నింపేలా మోదీ ప్రసంగం లేకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింత జోరుగా ప్రచారం చేయండి అనే పిలుపునిస్తే ఏమి చేయాలన్న సందిగ్థత కూడా నెలకొందట. ఇంతకీ మోదీ పర్యటన రాష్ట్ర బీజేపీకి రాజకీయంగా ఉపయోగపడుతుందా లేదా అని బుర్రలు బద్ధలు కొట్టుకుంటూ ఆదివారం ఏమి జరుగుతుందా అని కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారట....! -
13న రాహుల్ పర్యటన ఖరారు
తెలంగాణలో భారీ సభ, రోడ్‌షోలు! హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఈ నెల 13న ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పొన్నాల టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు కె.జానారెడ్డి, శ్రీధర్‌బాబు, షబ్బీర్అలీలతో సమావేశమై రాహుల్ షెడ్యూల్‌ను ఖరారు చేసే పనిలో పడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈనెల 16న సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్ మైదానంలో నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొననున్న నేపథ్యంలో రాహుల్‌గాంధీ అధ్యక్షతన ఏయే జిల్లాల్లో సభలు, రోడ్‌షోలు నిర్వహిస్తే బాగుంటుందనే అంశంపై చర్చిస్తున్నారు. ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండింటిని ఎంపిక చేసి భారీ బహిరంగ సభలు నిర్వహించే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. అదే విధంగా రాహుల్‌గాంధీతో రోడ్‌షో నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నారు.