కమలం... కాస్త సతమతం
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనపై బీజేపీ నాయకుల్లో తీవ్ర ఉత్కంఠతో పాటు ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. తెలంగాణ ఏర్పడ్డాక రెండేళ్ల తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి ప్రధాని వస్తున్నందున ఈ సందర్భంగా ఏమి జరుగుతుందా అన్న ఆసక్తి కూడా నెలకొందట. దానితో పాటు రాష్ట్రపార్టీకి ఏమని దిశానిర్దేశం చేస్తారు? టీఆర్‌ఎస్ పట్ల బీజేపీ రాజకీయ వైఖరి ఎలా ఉండబోతుంది? అన్న దానిపై పార్టీలో తెగ తర్జనభర్జనలు సాగుతున్నాయట. అయితే ఏదైనా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమో లేదా పథకం కోసమో కాకుండా సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ ‘మిషన్ భగీరథ’ కార్యక్రమం ప్రారంభానికి రావడం ఏమిటా అన్న ప్రశ్నలను కొందరు నాయకులు వేస్తున్నారు.
ఈ పర్యటనలో భాగంగా గజ్వేల్‌లోనే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు కేంద్రప్రభుత్వానికి సంబంధించిన రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్, రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంట్ పునరుద్ధరణ వంటి వాటికి ఒకేచోట ప్రారంభోత్సవం చేయడం ఏమిటనే అభ్యంతరాలు కూడా అంతర్గత చర్చల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. అసలు ప్రధాని ప్రసంగం ఏ విధంగా ఉండబోతుందో, ఏయే అంశాలను ప్రస్తావిస్తారనే ఉత్కంఠ కూడా పార్టీలో వ్యక్తమవుతోంది. అసలు మిషన్ భగీరథ వంటి కార్యక్రమానికి రావడమే కరెక్ట్ కాద ని వాదిస్తున్న వారూ ఉన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు మిషన్ భగీరథను పొగిడితే తాము రాజకీయంగా ఎలాంటి ఇబ్బందుల్లో పడతామోనన్న ఆందోళన కూడా నెలకొందట. అప్పుడు రాష్ట్ర బీజేపీగా తమకు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే అస్త్రాలు కూడా కరువవుతాయన్నది వారి వాదనట. అంతేకాకుండా రాష్ట్రంలో బీజేపీనే టీఆర్‌ఎస్‌కు నిజమైన ప్రత్యామ్నాయం అని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని నాయకులు, కేడర్‌లో జోష్ నింపేలా మోదీ ప్రసంగం లేకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింత జోరుగా ప్రచారం చేయండి అనే పిలుపునిస్తే ఏమి చేయాలన్న సందిగ్థత కూడా నెలకొందట. ఇంతకీ మోదీ పర్యటన రాష్ట్ర బీజేపీకి రాజకీయంగా ఉపయోగపడుతుందా లేదా అని బుర్రలు బద్ధలు కొట్టుకుంటూ ఆదివారం ఏమి జరుగుతుందా అని కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారట....!