సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటన ఆ పార్టీ ముఖ్య నేతల్లో కాక రేపుతోంది. ‘హార్డ్ టాస్క్ మాస్టర్’గా పేరొందిన అమిత్ షా ఇంతకుముందు వచ్చినప్పుడు రాష్ట్ర పార్టీకి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఆరేడు నెలల్లోనే ఎన్నిక లున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో పార్టీ సన్నద్ధత, సంస్థాగత బలోపేతం, ఇతర పార్టీల నుంచి చేరికల వేగవంతానికి చేపట్టాల్సిన చర్యలను సూచించారు.
అయితే ఆయా అంశాల్లో ఆశించిన మేర ముందుకు సాగని పరిస్థితిలో అమిత్‌షాకు ఏం చెప్పాలనే దానిపై ముఖ్యనేతల్లో ఆందోళన కనిపిస్తున్నట్టు సమాచారం. దీనికితోడు ఎన్నికలకు పూర్తిస్థాయి సన్నద్ధతలో భాగంగా అమిత్ షా ఎలాంటి కఠిన అసైన్‌మెంట్లు ఇస్తారోనన్న టెన్షన్ రాష్ట్ర ముఖ్యనేతలను కలవరపెడుతోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఊపందుకోని చేరికల కార్యాచరణ
మునుగోడు ఉప ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆ తర్వాత ఇటీవల కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి తప్ప ముఖ్య నేతలెవరూ బీజేపీలో చేరలేదు. ఉమ్మడి జిల్లాల స్థాయిలో ప్రభావమున్న నాయకుల చేరికలు కూడా జరగలేదు. జాతీయస్థాయి నేతలు రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రతీసారి చేరికలపై ఊహాగానాలు వెలువడుతున్నా అవి సాకారం కావడం లేదు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని రాష్ట్ర నాయకులు తరచూ చెప్పడమే తప్ప.. ఆ మేరకు కార్యాచరణ ముందుకు పడలేదు. ఈ క్రమంలో చేరికలపై అమిత్‌షాకు ఏం చెప్పాలని ముఖ్యనేతల్లో ఆందోళన నెలకొన్నట్టు తెలిసింది.
సమన్వయం, విందు భేటీలపై..
గత నెలన్నర రోజుల్లో ఢిల్లీలో, హైదరాబాద్‌లో జరిగిన సమావేశాల్లో రాష్ట్ర పార్టీ ముఖ్యనేతల మధ్య సమన్వయం అవసరాన్ని, సమష్టిగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకతను అమిత్‌షా నొక్కిచెప్పారు. వారం, రెండు వారాలకోసారి నేతల నివాసాల్లో అల్పాహారం, లంచ్, డిన్నర్ వంటివి ఏర్పాటు చేసుకోవాలని.. అంతా కలుసుకుని, ఆలోచనలు పంచుకోవాలని, సమన్వయం పెంచుకోవాలని సూచించారు. ఇది కూడా అమలైన దాఖలాలు లేవు. ఈ విషయంలో అమిత్‌షా ప్రశ్నిస్తే ఏమని చెప్పాలనే తర్జనభర్జన రాష్ట్ర నేతల్లో కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
బూత్ కమిటీల నియామకాలపై..
రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలింగ్ బూత్ కమిటీలను నియామించాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్‌షా ఇంతకుముందే ఆదేశించారు. ఈ అంశంలో రాష్ట్ర సంస్థాగత ఇన్‌చార్జి సునీల్ బన్సల్ వరుస సమీక్షలతో రాష్ట్ర నేతల వెంటపడుతున్నారు. అయినా కొన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. అసలు అమిత్‌షా సభ జరగనున్న చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలోని చేవెళ్ల, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ కమిటీల నియామకం పూర్తి కాలేదు.
అంతేగాకుండా ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన నేతలు కూడా లేరు. సమీక్ష సందర్భంగా ఈ అంశంపై అమిత్‌షాకు ఎలా సమాధానం చెప్పాలన్న దానిపై పార్టీ నాయకులు మీమాంసలో పడినట్టు తెలిసింది. ఒక దశలో చేవెళ్లలో అమిత్‌షా సభ వద్దని స్థానిక నేతలు పట్టుబట్టినట్టు సమాచారం. కానీ పార్టీ పెద్దల ఆదేశాలతో ప్రవాసీ యోజన, సభకు ఏర్పాట్లు మొదలుపెట్టినట్టు తెలిసింది. చేవెళ్ల సభను విజయవంతం చేసి అమిత్‌షా మెప్పు పొందాలని భావిస్తున్నట్టు సమాచారం.
సభ తర్వాత విస్తృత సమీక్ష
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని ముందుండి నడిపిస్తున్న అమిత్‌షా ఆదివారం హైదరాబాద్‌కు రానున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా చేవెళ్లకు చేరుకుని ‘పార్లమెంట్ ప్రవాసీ యోజన’ కార్యక్రమం, సభలో పాల్గొంటారు. తర్వాత హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌కు చేరుకుని.. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ, ఇతర ముఖ్య నేతలతో విస్తృతంగా సమీక్షించనున్నారు. పార్టీపరంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వాటిద్వారా ప్రజలకు ఏమేరకు చేరువయ్యారు? పోలింగ్ బూత్ కమిటీల నియామకం, శక్తి కేంద్రాల ఏర్పాటు (3, 4 బూత్‌లు కలిపి ఒకటి), సంస్థాగతంగా వివిధ కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు.
రాజకీయంగానూ హీట్
అమిత్‌షా తెలంగాణ పర్యటన అటు రా>ష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచబోతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ, కాంగ్రెస్, ఇతర చిన్నపార్టీలు దూకుడు పెంచాయి. ఇలాంటి సమయంలో 23న చేవెళ్ల సభలో అమిత్‌షా ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను సవాల్ చేస్తూ.. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేలా ఈ సభ ఉండొచ్చని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.
పేర్లు వినిపిస్తున్నా.. చేరికలేవి?
బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పిస్తూ, ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలతో రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. బీఆర్‌ఎస్‌ను ధిక్కరించి మాట్లాడుతూ పార్టీ నుంచి సస్పెండైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ముఖ్య నేత జూపల్లి కృష్ణారావు.. ఈ ఇద్దరిని చేర్చుకోవడానికి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉండి, రాష్ట్రంలోనూ గెలుస్తామంటున్న బీజేపీలో చేరికపై వారు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు.
ఈ విషయంలో బీజేపీ నేతలు వెనుకబడ్డారేమోనన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. అమిత్‌షా చేవెళ్ల సభ సందర్భంగా వారిని బీజేపీలో చేర్చుకుని ఉంటే.. పార్టీకి ఊపు వచ్చేదని అంటున్నారు. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముఖ్యనేత, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తాను బీఆర్‌ఎస్‌ను వీడి వేరే పార్టీలో చేరనున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని గురువారం ఖండించారు. బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని ప్రకటించారు.
Amit Shah Visit: అమిత్ షా రాక.. బీజేపీలో ‘చేరికల’ కాక! ఏం చెప్పాలని రాష్ట్ర నేతల్లో ఆందోళన
Published Fri, Apr 21 2023 2:58 AM | Last Updated on Fri, Apr 21 2023 7:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment