Stem Cell
-
పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం!
మెగా కోడలు ఉపాసన కొణిదెల త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లైన 10 ఏళ్ల తర్వాత ఉపాసన గర్భం ధరించడంతో ఆ క్షణం కోసం మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సామాజిక సేవలోనూ ముందుండే ఉపాసన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పటికే చాలాసార్లు తన బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అయితే తాజాగా పుట్టబోయే బేబీ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. (ఇది చదవండి: వెల్కమ్ టూ కొణిదెల ఫ్యామిలీ.. ఉపాసన ట్వీట్ వైరల్!) బేబీ ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఉపాసన వెల్లడించింది. అంతేకాకుండా బేబీ కార్డ్ బ్లడ్ బ్యాంక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో బేబీతో పాటు ఫ్యామిలీ ఆరోగ్యం కోసమే అత్యాధునిక పద్ధతిలో స్టెమ్ సెల్ బ్యాంకింగ్ విధానం ఎంచుకున్నట్లు పేర్కొంది. తాజాగా ఊపాసన వీడియో చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే ఏమిటి? బొడ్డు తాడు దాచుకోవడం(స్టెమ్ సెల్ బ్యాంకింగ్) గురించి చాలామందికి పెద్దగా తెలియదు. పిల్లలు పుట్టినప్పుడు బొడ్డు తాడు దాచడం వల్ల పెద్దయ్యాక వాళ్లకది బాగా ఉపయోగపడుతుంది. అది ఎన్నోరకాల చికిత్సలకోసం భవిష్యత్తులో వినియోగిస్తారు. ఈ విషయంపై మనదేశంలో పెద్దగా అవగాహన లేదు. గతంలో మహేశ్ బాబు సతీమణి కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. తమ పిల్లలద్దరీ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ( ఇది చదవండి: వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్: బేబీ బంప్‌తో ఉపాసన, డ్రెస్ ఖరీదెంతో తెలుసా?) I have chosen @StemCyte_India India to preserve my baby's CordBlood because of their unique Hybrid Model, Superior Technology and Highest Accreditations. For more information, visit https://t.co/gQUuMlyRsG or call 1800 120 0086#StemCyteIndia #StemCellBanking#CordBlood… pic.twitter.com/CFMQvxTXSY — Upasana Konidela (@upasanakonidela) June 13, 2023 -
కేన్సర్ మళ్లీరాకుండా చేయవచ్చు!
చికిత్స చేసిన తరువాత కూడా కేన్సర్ మళ్లీమళ్లీ తిరగబెడుతుంది ఎందుకు? కేన్సర్ మందులు కొందరికి పనిచేస్తాయి. ఇంకొందరికి చేయవు. ఎందుకు? కేన్సర్ కణితిలోని మూలకణాలు కొన్నిసార్లు నిద్రాణంగా, మరికొన్ని సార్లు చురుకుగా ప్రవర్తించడం వల్ల ఇలా జరుగుతూంటుంది. వీటిని తొలగించగలిగితే కేన్సర్‌కు చెక్ పెట్టడమూ సాధ్యమే. అచ్చంగా ఈ ఘనతనే సాదించారు మిషిగన్ యూనివర్శిటీలోని రోజెల్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు. నిద్రాణంగా ఉన్నప్పుడు ఈ మూలకణాలు గ్లూకోజ్ ద్వారా, చైతన్యవంతంగా ఉన్నప్పుడు ఆక్సిజన్ ద్వారా శక్తిని పొందుతూంటాయని గుర్తించిన శాస్త్రవేత్తలు ఈ రెండు మార్గాలను అడ్డుకోవడం ద్వారా కేన్సర్ మూలకణాలను నాశనం చేయగలిగారు. కీళ్లనొప్పులకు వాడే ఓ మందుతో మైటోకాండ్రియా (కణాలకు శక్తిని తయారు చేసే భాగం) పనితీరును అడ్డుకోవడంతో పాటు, ఆక్సిజన్ కూడా అందకుండా చేసినప్పుడు మూలకణాలు నాశనమై పోయాయి. కణాలను విషాలతో చంపేందుకు బదులుగా తాము జీవక్రియలను ఉపయోగించామని, తద్వారా కేన్సర్ కణం తనంతట తానే చనిపోయే పరిస్థితి కల్పించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త విచా మేడలైన్, సిడ్నీ ఫోర్బ్స్‌లు తెలిపారు. కేన్సర్ చికిత్సకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇమ్యూనోథెరపీకి, ఈ మూలకణ చికిత్సను జోడిస్తే మెరుగైన చికిత్స కల్పించడంతోపాటు కేన్సర్ తిరగబెట్టకుండా చూడవచ్చునని వీరు అంటున్నారు. -
మూలకణ మార్పిడితో ఇద్దరికి పునర్జన్మ
సాక్షి, హైదరాబాద్: మూలకణ మార్పిడి చికిత్సతో ఇద్దరికి పునర్జన్మను ప్రసాదించారు నిమ్స్ వైద్యులు. ఖరీదైన ఈ చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ జాబితాలో చేర్చి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని వి.లక్ష్మీప్రసన్న(21) కొంతకాలంగా రక్తసంబంధ సమస్యతో బాధపడుతోంది. చికిత్స కోసం 8 నెలల క్రితం ఆమె నిమ్స్ హెమటాలజీ విభాగాధిపతి డాక్టర్ ఏఎంవీఆర్ నరేందర్‌ను సంప్రదించింది. ఇదే సమయంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఎంఎస్సీ విద్యార్థి రామకృష్ణ(26) కూడా నిమ్స్‌కు వచ్చాడు. వైద్య పరీక్షల్లో వీరిద్దరూ ఎప్లాస్టిక్ ఎనీమియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. మూలకణాల మార్పిడి చికిత్స ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. మూలకణాలను దానం చేసేందుకు బాధితుల సోదరులు ముందుకు రావడంతో వారి నుంచి కణాలు సేకరించారు. ప్రాసెస్ చేసిన తర్వాత బాధితులకు ఎక్కించారు. సాధారణంగా ఇలాంటి చికిత్సకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.20 లక్షలకుపైగా ఖర్చవుతుంది. నిమ్స్‌లో 2008 నుంచే మూలకణాల మార్పిడి చికిత్స చేస్తున్నారు. ఇప్పటి వరకు 120 చికిత్సలు చేశారు. అయితే ఆయా వైద్య ఖర్చులను రోగులే భరించాల్సి వచ్చేది. ఆర్థిక స్తోమత లేని నిరుపేదలు చికిత్సకు నోచుకోలేక మృత్యువాతపడుతుండటంతో హెమటాలజీ, మెడికల్ ఆంకాలజీ వైద్యుల సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం ఖరీదైన ఈ సేవలను ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ పథకాల్లో చేర్చింది. దీనిలో భాగంగా రూ.10 లక్షల వరకు వైద్య ఖర్చులు చెల్లిస్తోంది. లక్ష్మీప్రసన్నకు ఈహెచ్ఎస్ స్కీమ్ కింద, రామకృష్ణకు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందించినట్లు డాక్టర్ నరేందర్ స్పష్టం చేశారు. నిమ్స్ ఆస్పత్రిలో ఈ తరహా చికిత్సలు ఉచితంగా చేయడం ఇదే ప్రథమమని ఆయన వెల్లడించారు. -
విస్తరణలో ట్రాన్స్‌సెల్ బయోలాజిక్స్
త్వరలో క్లినికల్ ట్రయల్స్‌లోకి ప్రవేశం - వీసీ కంపెనీ నుంచి రూ.30 కోట్ల ఫండ్ - ఎలీప్ ఎస్టేట్‌లో కొత్త ఫెసిలిటీ ఏర్పాటు - ట్రాన్స్‌సెల్ సీఈవో సుభద్ర ద్రావిడ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టెమ్ సెల్ (మూల కణాల) బ్యాంకింగ్, ప్రాసెసింగ్ సేవల రంగంలో ఉన్న ట్రాన్స్‌సెల్ బయోలాజిక్స్ విస్తరణ బాట పట్టింది. హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఎలీప్ పారిశ్రామికవాడలో కొత్త ఫెసిలిటీని ఇటీవలే ప్రారంభించిన ఈ సంస్థ నూతన విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. క్లినికల్ ట్రయల్స్‌తో పాటు డ్రగ్ డిస్కవరీ విభాగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అడుగు పెట్టాలని నిర్ణయించింది. ఇందుకు కావాల్సిన నిధులను సమకూర్చేందుకు భారత్‌కు చెందిన ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ ముందుకొచ్చినట్లు ట్రాన్స్‌సెల్ సీఈవో సుభద్ర ద్రావిడ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. రూ.30 కోట్లు పెట్టుబడికి ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. అయితే ఎంత వాటా ఇచ్చేదీ త్వరలోనే వెల్లడిస్తామన్నారు. కొత్త విభాగాల్లోకి ప్రవేశించడం ద్వారా ట్రాన్స్సెల్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యమన్నారు. మరో వెంచర్ క్యాపిటల్ సంస్త ఇప్పటికే రూ.2 కోట్లు సమకూర్చింది. అక్టోబరుకల్లా అదనంగా రూ.6 కోట్లను అందిస్తోంది. సామర్థ్యం పెంపు... హైదరాబాద్ సమీపంలోని ఐసీఐసీఐ నాలెడ్జ్ పార్క్‌లో ట్రాన్సెల్ ఫెసిలిటీ ఉంది. సేకరించిన శాంపిళ్లను రెండుగా చేసి వేర్వేరు కేంద్రాల్లో భద్రపరుస్తారు. ఇందులో భాగంగానే ఎలీప్ ఎస్టేట్‌లో భారీ ఫెసిలిటీని కంపెనీ గత నెలలో ఏర్పాటు చేసింది. దీని సామర్థ్యం 15,000 శాంపిళ్లు. దీనిని మూడేళ్లలో 50,000 శాంపిళ్ల స్థాయికి తీసుకు వెళ్తామని సుభద్ర తెలిపారు. దంతాలు, అడిపోస్ టిష్యూ (కొవ్వు), బొడ్డు తాడు రక్తం, బొడ్డు తాడు కణం, ఎముక మజ్జ నుంచి మూల కణాలను సేకరించి భద్రపరిచే ఏకైక కంపెనీ తమదేనని ట్రాన్స్‌సెల్ చెబుతోంది. అడిపోస్ టిష్యూ నుంచి సేకరించిన మూల కణాలను కండరాల క్షీణత వ్యాధి చికిత్సలో వాడతారు. అలాగే మొహం, పొట్టపై ఉన్న మడతలు, మచ్చలు పోగొట్టేందుకు చేసే స్టెమ్ సెల్ థెరపీలోనూ ఉపయోగిస్తున్నారు. వక్షోజాల సైజు పెంచే చికిత్సల్లోనూ ప్రధానంగా వాడుతున్నారు. యూఎస్, రష్యాలో ఈ విధానం బాగా ప్రాచుర్యంలో ఉంది. పంటి లోపల ఉన్న గుజ్జు నుంచి సేకరించిన మూల కణాలను నరాల సంబంధ చికిత్సల్లో వాడుతున్నారు. రూ.3,000 కోట్ల మార్కెట్... మూల కణ బ్యాంకింగ్ (నిధి) మార్కెట్ ప్రస్తుతం భారత్‌లో సుమారు రూ.3,000 కోట్లుంది. ట్రాన్స్సెల్తోసహా ఆరు కంపెనీలు ఈ రంగంలో పోటీపడుతున్నాయి. 2017 నాటికి పరిశ్రమ రూ.5,000 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలున్నాయి. 2003లో ఈ పరిశ్రమ పరిమాణం కేవలం రూ.100 కోట్లు. దీనిని బట్టి పరిశ్రమ వృద్ధి తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చు. మూల కణాలను భద్రపర్చుకోవాలన్న అవగాహన భారత్‌లో అంతకంతకూ పెరుగుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని సుభద్ర చెప్పారు. ఇక 70 రకాల వ్యాధులను నయం చేసేందుకు, నివారణకు మూల కణ ఆధారిత చికిత్సలు (స్టెమ్ సెల్ థెరపీ) ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్నాయని చెప్పారు. ఇందులో భారత్‌లో మధుమేహం, క్యాన్సర్, పార్కిన్సన్స్, నరాల సంబంధ, ఆర్థరైటిస్ వంటి 10 రకాల వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉంది. -
రఫెల్ నాదల్ కు స్టెమ్ సెల్ ట్రీట్ మెంట్!
బార్సిలోనా: టెన్నిస్ సూపర్ స్టార్ రఫెల్ నాదల్ స్టెమ్ సెల్ ట్రీట్ మెంట్ తీసుకోనున్నాడు. గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న నాదల్ ట్రీట్ మెంట్ కు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు అతని వ్యక్తిగత డాక్టర్ ఎంజేల్ రూయిజ్ కటోర్రో స్పష్టం చేశాడు. ఈ కారణంతోనే నాదల్ గత కొన్ని రోజుల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపాడు. 14 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన నాదల్ ట్రీట్ మెంట్ పూర్తి చేసుకుని డిసెంబర్ నాటికి తిరిగి టెన్నిస్ బరిలోకి దిగే అవకాశం ఉందన్నాడు. -
వాటా విక్రయిస్తున్న ట్రాన్సెల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టెమ్ సెల్ (మూల కణాల) బ్యాంకింగ్, ప్రాసెసింగ్ సేవల రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ ట్రాన్సెల్ బయాలాజిక్స్ నూతన విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. ఇందుకు కావాల్సిన నిధుల సమీకరణకై వాటా విక్రయిస్తున్నట్టు కంపెనీ వర్గాల సమాచారం. తొలి విడతగా రూ.10 కోట్లు, మలివిడతగా రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రైవేటు ఈక్విటీ సంస్థ ముందుకు వచ్చినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. 12 నుంచి 15 శాతం మేర వాటా విక్రయించే అవకాశం ఉంది. బొడ్డు తాడు, దంతాలు, కొవ్వు, ఎముక మజ్జ నుంచి మూల కణాలను సేకరించగలిగే ఏకైక కంపెనీ ప్రపంచంలో తమదేనని ట్రాన్సెల్ చెబుతోంది. మూల కణాలను నిక్షిప్తం చేసుకునేందుకు దాతలు పెరుగుతుండడంతో ఈ రంగంలో ఉన్న వ్యాపార అవకాశాలను గుర్తించిన ప్రైవేటే ఈక్విటీ సంస్థలు ట్రాన్సెల్తో భాగస్వామ్యానికి సిద్ధమవుతున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులు వస్తాయని కంపెనీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. క్లినికల్ ట్రయల్స్‌తోపాటు.. ఇప్పటి వరకు మూల కణాల నిక్షిప్తం, ప్రాసెసింగ్ సేవలందించిన ట్రాన్సెల్ మూల కణ ఆధారిత చికిత్సా పరీక్షలు (క్లినికల్ ట్రయల్స్) చేపట్టేందుకు సమాయత్తమైంది. కొన్ని రకాల వ్యాధులను నయం చేసేందుకు, నివారణకు మూల కణ చికిత్స (స్టెమ్ సెల్ థెరపీ) భారత్‌తో సహా వివిధ దేశాల్లో ప్రాచుర్యంలో ఉంది. అలాగే మూల కణ ఆధారిత ప్రొడక్ట్ డెవలప్మెంట్ విభాగాల్లోకి సైతం కంపెనీ అడుగు పెడుతోంది. ఇంజెక్టబుల్ ఉత్పత్తులను అభివృద్ధి చేయాలన్నది సంస్థ లక్ష్యం. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ మాత్రమే భారత్‌లో ఈ రెండు విభాగాల్లో ప్రవేశించింది. కాగా, ట్రాన్సెల్ ప్రమోటర్లు ఇప్పటి వరకు రూ.6 కోట్లు సొంత నిధులను వెచ్చించారు. మూల కణ రంగ శాస్త్రవేత్త సుభద్ర ద్రావిడ ట్రాన్సెల్ను స్థాపించారు. యూఎస్, కెనడా దేశాల్లో పనిచేసిన అనుభవం ఉంది. సామర్థ్యం పెంపు.. ప్రస్తుతం 4 వేల శాంపిళ్లను హైదరాబాద్ కేంద్రంలో ట్రాన్సెల్ భద్రపరిచింది. 6 వేల శాంపిళ్లను నిక్షిప్తం చేయగలిగే సామర్థ్యం ఉంది. మరో 10 వేల శాంపిళ్లు భద్రపరిచేలా సామర్థ్యాన్ని పెంచనుంది. దేశంలో ఎక్కడి నుంచైనా మూల కణాలను సేకరించి 24 గంటల్లో భద్రపరిచే వ్యవస్థ తమ వద్ద ఉందని కంపెనీ అంటోంది. శ్రీలంక, దుబాయి తదితర దేశాలకు సేవలను విస్తరించింది. దేశవ్యాప్తంగా వివిధ కంపెనీల వద్ద ఒక లక్ష శాంపిళ్లు భద్రంగా ఉన్నాయి. ఏటా ఈ సంఖ్య 50 శాతం పెరుగుతోంది.