మెదడు పనితీరును మాటలే చెప్పేస్తాయి
వయసు పెరుగుతున్న కొద్దీ చాలామందిలో జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యం రెండూ తగ్గుతూ ఉంటాయి. ఈ మార్పును తొందరగా తెలుసుకోవడమెలా? మాట్లాడే మాటల్లో వచ్చే తేడాలను గుర్తిస్తే చాలంటున్నారు శాస్త్రవేత్తలు. మధ్యమధ్యలో విరామం ఇస్తూ పదాలు పలకడం.. కొన్ని పదాలను తరచూ పునరావృతం చేయడం మెదడు ఆలోచన సామర్థ్యం తగ్గిపోతోందనేందుకు తొలి సూచనలని విస్కాన్సిన్ మేడిసన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త స్టెర్లింగ్ జాన్సన్ జరిపిన అధ్యయనంలో తేలింది.
ఈ రకమైన పరిస్థితి అల్జీమర్స్ వ్యాధికి దారి తీయొచ్చని అంచనా. కొంతమందికి కొన్ని బొమ్మలు చూపి వాటిని వర్ణించాలని కోరారు. రెండేళ్ల తర్వాత అవే బొమ్మలను చూపగా వర్ణనకు వారు ఉపయోగించిన పదాల్లో ఎంతో మార్పు కనిపించింది. కొంతమంది తాము గతంలో వాడిన పదాలను తేలిగ్గా మరిచిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4.7 కోట్ల మంది మతిమరుపు వ్యాధితో బాధపడుతుండగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులతో ఈ సమస్యకు పరిష్కా రం లభించట్లేదు. ఈ నేపథ్యంలో సమస్యను వేగంగా గుర్తించేందుకు తమ పరిశోధన ఉపయోపడుతుందని స్టెర్లింగ్ జాన్సన్ చెబుతున్నారు.