వారికి పెళ్లి చేసిన అపరిచితులు!
లండన్: బ్రిటన్‌లోని మాంచెస్టర్ నగరానికి చెందిన స్టీవెన్ మాంక్స్, లారా ఒకరికొకరు గత పదేళ్లుగా పరిచయం. ఆ పరిచయం నుంచి ప్రణయం పుట్టింది. పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాళ్లు కావాలనే ఉద్దేశంతో 2013లో నిశ్చితార్థం చేసుకున్నారు. ముందుగా ఇల్లుకొన్నాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకనే పెళ్లి వాయిదా వేసుకున్నారు. ఓ కార్పొరేట్ బ్యాంక్‌లో పనిచేసే లారా, ఓ చిన్న ప్రైవేటు కంపెనీలో పనిచేసే స్టీవెన్ మాంక్స్ వచ్చిన జీతాల్లో ఖర్చులుపోనూ మిగిలిన పైసా, పైసా పోగేస్తు వచ్చారు. ఈలోగా వారికి ఓ బిడ్డ పుట్టింది.
ఇల్లు కొనేందుకు తిరుగుతున్న సమయంలో వారిని దురదృష్టం వెంటాడింది. స్టీఫెన్ మాంక్స్కు లివర్, బౌల్ కేన్సర్ జబ్బు ఉందని తేలింది. ఇల్లు కొనేందుకు దాచుకున్న డబ్బు కాస్త కీమోథెరపీకి ఖర్చయిపోయింది. గత ఏప్రిల్ నెలలో స్టీవెన్‌ను పరీక్షించిన వైద్యులు జబ్బు చేదాటి పోయిందని, ఎంతోకాలం బతకరని తేల్చారు. దాంతో 35 ఏళ్ల సమాన వయస్సు కలిగిన స్టీవెన్, లారాలు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని మిత్రులకు తెలియజేశారు. వారిలో మ్యాక్మిలన్ అనే ఓ నర్సు ‘గిఫ్ట్ ఆఫ్ ఏ వెడ్డింగ్’ అనే సంస్థ పెళ్లి విషయంలో సహాయ సహకారాలు అందిస్తుందని సూచించింది. దాంతో లారా ఆ ఛారిటీ సంస్థ చైర్మన్‌ను కలుసుకొని తన ప్రస్తుత పరిస్థితిని వివరించారు. పెళ్లికి సహకరించాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నారు.
ఆ సంస్థ లారా, స్టీవెన్ పెళ్లి గురించి ఆన్లైన్ విరాళాల కోసం అప్పీల్ చేసింది. దీంతో స్పందించిన వేలాది మంది అపరిచితుల సహకారంతో ఇటీవల మాంచెస్టర్ సిటీ సెంటర్లోని ఓ హోటల్లో లారా, స్టీవెన్లా పెళ్లి వైభవంగా జరిగింది. నగరంలోని ఓ బ్రైడల్ షాప్ పెళ్లి కూతురుకు పెళ్లి డ్రెస్‌ను ఉచితంగా పంపించింది. ఓ అపరిచితుడు వెడ్డింగ్ రింగ్ పంపించారు, ఇంకొకరు నెక్లెస్ పంపించారు. మరొకరు కారును సమకూర్చారు. ఇలా హోటల్లో హాల్ బుకింగ్ నుంచి భోజనం వరకు అపరిచితుల సహకారంతో ఏర్పాట్లు జరగ్గా, ఫొటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు, డీజే, సింగర్లు స్వచ్ఛంగా ముందుకొచ్చి పెళ్లిని వైభవంగా జరిపించారు. కొత్త దంపతుల హానీమూన్‌కు కూడా ఏర్పాట్లు జరిగిపోయాయి.
తమకు ఇంత సహాయం చేసిన అపరిచితులను ఎప్పటికీ మరిచిపోలేనని, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని లారా తెలియజేయగా... తాను ఎంతకాలం బతికుంటానో తనకే తెలియదని, బతికి ఉన్నంతకాలం తమకు సహాయ సహకరాలు అందించిన బంధు మిత్రులను, అపరిచితులను మరిచిపోనని, వారందరికి కృతజ్ఞతలని స్టీవెన్ తెలిపారు.