stock trading
-
రాబిన్‌హుడ్ గర్ల్
గూగుల్ కంటే పదిహేనేళ్లు వెనకొచ్చిన కంపెనీ రాబిన్‌హుడ్. అయితే గూగుల్‌లో పన్నెండేళ్లు పని చేసిన అపర్ణ.. గూగుల్‌ని వదిలి, రాబిన్‌హుడ్‌లో చేరారు. స్టాక్ ట్రేడింగ్లను జరుపుతుండే రాబిన్‌హుడ్ తొలి చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్‌గా (సి.పి.వో) గురువారం బాధ్యతలు చేపట్టారు. రాబిన్ హుడ్‌లో ఇంతవరకు సి.పి.వో పోస్టు లేదు. ఇలాంటి పోస్ట్ ఒకటి ఉండాలని ఉండాలని అనుకున్నాక రాబిన్ హుడ్కు అపర్ణ తప్ప మరొకరు కనిపించలేదు. రాబిన్‌హుడ్ ఎంపిక చేసుకుంది కనుక ఆమెను రాబిన్‌హుడ్ గర్ల్ అనొచ్చు. అపర్ణ పూర్తి పేరు అపర్ణ చెన్నాప్రగడ. అయితే ఆమె పూర్తి ప్రొఫైల్ గురించి చెప్పడం, పేరు చెప్పుకున్నంత సులభమైతే కాదు! టెక్ ఇండస్ట్రీలో ఆమెకు ఇరవై ఏళ్ల అనుభవం ఉంది. ప్రాడక్ట్‌ను డెవలప్ చెయ్యడం, డిజైన్ చెయ్యడం, వ్యూహరచన ఆమె పనులు. గూగుల్‌లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా వివిధ నాయకత్వ స్థాయిలలో పని చేశారు. అపర్ణ మద్రాస్ ఐ.ఐ.టిలో (1993–97) చదివారు. యూఎస్‌లోని మాసచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అంత చదివారంటే అంతకు అంతా నైపుణ్యాలను ఆమె తను పనిచేసిన కంపెనీలకు అందించకుండా ఉంటారా! రాబిన్‌హుడ్ ఇప్పుడు అపర్ణను సి.పి.వో.గా నియమించుకోడానికి కూడా పూర్తిగా ఆమె ప్రతిభా సామర్థ్యాలే కారణం. శాన్ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో ఉంటున్న అపర్ణ.. టెక్నాలజీ రంగంలోకి వెళ్లడానికి తల్లే తనకు ప్రేరణ, ప్రోత్సాహం అని అంటున్నారు. -
ఎఫ్‌అండ్‌వో ఎక్స్‌పైరీపై ఇన్వెస్టర్ల దృష్టి!
వచ్చే వారం అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గురువారం(29న) ఎఫ్‌అండ్‌వో గడువు ముగియనుంది. శుక్రవారం(30) నుంచీ నవంబర్ సిరీస్ ప్రారంభంకానుంది. దీంతో ట్రేడర్లు తమ పొజిషన్లను కొత్త సిరీస్‌కు రోలోవర్ చేసుకునే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఏడాది(2020-21) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ఊపందుకోగా.. ఈ వారం మరికొన్ని బ్లూచిప్ కంపెనీలు పనితీరు వెల్లడించనున్నాయి. వెరసి.. అటు ఎఫ్‌అండ్‌వో, ఇటు కంపెనీల ఫలితాలు మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశించే అవకాశమున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. జాబితా ఇలా ఈ వారంక్యూ2(జులై- సెప్టెంబర్) ఫలితాలను విడుదల చేయనున్న ప్రధాన కంపెనీల జాబితా చూద్దాం.. కొటక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 26న, ఎయిర్టెల్, టాటా మోటార్స్ 27న, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హీరో మోటో, ఎల్అండ్టీ, టైటన్ 28న పనితీరు వెల్లడించనున్నాయి. ఇదే విధంగా బీపీసీఎల్, మారుతీ సుజుకీ 29న ఫలితాలు ప్రకటించనున్నాయి. ఇతర అంశాలూ ఈ నెల 28 నుంచీ బీహార్‌లో మూడు దశల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభంకానుంది. పోలింగ్ సరళితోపాటు.. పలు ఇతర అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేసే వీలున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. యూఎస్ ప్రభుత్వ ప్యాకేజీ, అధ్యక్ష ఎన్నికలపై అంచనాలు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల తీరు తదితరాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. సాంకేతికంగా క్యూ2లో సిమెంట్ విక్రయాలు, విద్యుత్ వినియోగం వంటి అంశాలు ఆర్థిక రికవరీని సూచిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. మార్కెట్లకు ఎఫ్‌పీఐలు మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే మార్కెట్లు ప్రస్తుతం సైడ్‌వేస్ ట్రేడింగ్ జోన్లోకి ప్రవేశించినట్లు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఓవర్‌బాట్ పొజిషన్‌కు చేరినట్లు అభిప్రాయపడ్డారు. ఇకపై నిఫ్టీకి 12,050 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకానున్నట్లు అంచనా వేశారు. ఇదేవిధంగా 11,600 స్థాయిలో బలమైన సపోర్ట్ లభించే వీలున్నదని తెలియజేశారు. గత వారం స్వల్ప పరిధిలో కదిలిన నిఫ్టీ ఇటీవలి రెసిస్టెన్స్‌కు సమీపంలో నిలిచినట్లు వివరించారు. ప్రస్తుతం ట్రెండ్ సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రపంచ మార్కెట్ల బలహీనతలు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని అభిప్రాయపడ్డారు. ఇటీవల సిమెంట్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐటీ కౌంటర్లు జోరు చూపడంతో కొంతమేర లాభాల స్వీకరణకు అవకాశమున్నదని భావిస్తున్నారు. అంతేకాకుండా సమీప భవిష్యత్‌లో రంగాలవారీగా ప్రాధాన్యతలు మారే వీలున్నట్లు ఊహిస్తున్నారు. -
నేడు లాభాల ఓపెనింగ్ చాన్స్?!
నేడు(25న) దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 70 పాయింట్లు ఎగసి 10,910 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్స్ 10,840 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. గత వారం నిరుద్యోగ క్లెయిములు అంచనాలను(8.4 లక్షలు) మించుతూ 8.7 లక్షలుగా నమోదైనట్లు యూఎస్ గణాంకాలు తాజాగా వెల్లడించాయి. అయితే సహాయక ప్యాకేజీపై కాంగ్రెస్‌లో సయోధ్య కుదరని నేపథ్యంలో గురువారం యూఎస్ మార్కెట్లు స్వల్పంగా 0.2-0.4 శాతం మధ్య బలపడ్డాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సైతం 0.5 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. కాగా.. వరుస నష్టాల నుంచి ప్రపంచ మార్కెట్లు బయటపడినప్పటికీ అంతర్గతంగా సెంటిమెంటు బలహీనంగానే ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో మార్కెట్లలో ఆటుపోట్లు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. అమ్మకాల సునామీ ప్రపంచ మార్కెట్ల పతనంతో గురువారం దేశీ స్టాక్ మార్కెట్లకు సైతం షాక్ తగిలింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో సెన్సెక్స్ 1,115 పాయింట్లు పడిపోయింది. ఫలితంగా 37,000 పాయింట్ల మార్క్‌ను సైతం కోల్పోయి 36,553 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 326 పాయింట్లు పతనమై 10,806 వద్ద నిలిచింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 11,000 పాయింట్ల స్థాయికి నీళ్లొదులుకుంది. వెరసి మార్కెట్లు ఇంట్రాడే కనిష్టాల సమీపంలో ముగిశాయి! నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 10,725 పాయింట్ల వద్ద, తదుపరి 10,645 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 10,950 పాయింట్ల వద్ద, ఆపై 11,095 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 20,256 పాయింట్ల వద్ద, తదుపరి 20,055 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 20,807 పాయింట్ల వద్ద, తదుపరి 21,156 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1,886 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) స్వల్పంగా రూ. 189 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 3,912 కోట్లకు మించి అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 1,629 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. -
బ్యాంక్, సిమెంట్ షేర్ల జోరు
కంపెనీల క్యూ3 ఫలితాలు బాగా ఉండటం, బడ్జెట్‌పై ఆశావహ అంచనాలతో బ్యాంక్, సిమెంట్ షేర్లు పెరగడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. బలహీనంగా మొదలైనప్పటికీ, సెన్సెక్స్ 227 పాయింట్ల లాభంతో 41,613 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 12,248 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడ్డా, మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. కరోనా వైరస్ చైనాలోనే తీవ్రంగా ఉందని, ఇతర దేశాల్లో ప్రభావం స్వల్పమేననని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లు రికవరీ కావడం సానుకూల ప్రభావం చూపించింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు నష్టపోయాయి. సెన్సెక్స్ 332 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల మేర పతనమయ్యాయి. బడ్జెట్ మరో వారంలో రానుండటంతో బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్ 2 శాతం, కోటక్ బ్యాంక్ 1.9 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.1 శాతం, ఎస్బీఐ 0.2 శాతం చొప్పున పెరిగాయి. చైనా, తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్లకు సెలవు. హాంగ్‌కాంగ్, జపాన్ మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 1 శాతం మేర పెరిగాయి. ఈ క్యూ3లో నికర లాభం 80 శాతం మేర పెరగడంతో అల్ట్రాటెక్ సిమెంట్ షేర్2.4 శాతం లాభంతో రూ.4,641 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. -
మరో 10మందిపై నిషేధం: ఎన్ఎస్ఈఎల్
ముంబై: చెల్లింపుల సంక్షోభానికి సంబంధించి మరో 10 మందిపై నిషేధాన్ని విధిస్తున్నట్లు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) తెలిపింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, బీఎస్ఈ, ఎంసీఎక్స్ఎస్ఎక్స్లతో సంప్రదింపుల తరువాత 10 మంది డిఫాల్టర్లను స్టాక్ ఎక్స్ఛేంజీల ట్రేడింగ్ కార్యకలాపాల నుంచి నిషేధిస్తున్నట్లు పేర్కొంది. వీటిలో లోయిల్ కాంటినెంటల్ ఫుడ్, లోయిల్ హెల్త్ ఫుడ్స్, మోహన్ ఇండియా, నామ్‌ధారీ ఫుడ్ ఇంటర్నేషనల్, నామధారీ రైస్ అండ్ జనరల్ మిల్స్, వైట్ వాటర్ ఫుడ్స్, శ్రీ రాధే ట్రేడింగ్, పీడీ ఆగ్రోప్రాసెసర్స్, స్వస్తిక్ ఓవర్సీస్ కార్పొరేషన్, జుగర్‌నాట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కమోడిటీ కాంట్రాక్ట్‌లకు సంబంధించి రూ. 5,600 కోట్ల చెల్లింపులను చేపట్టడంలో ఎన్ఎస్ఈఎల్ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభంలో భాగమైన సభ్యులలో ఎన్కే ప్రొటీన్స్ సంస్థ అత్యధికంగా రూ. 970 కోట్లను చెల్లించలేకపోయిందని ఎన్ఎస్ఈఎల్ పేర్కొంది. ఈ బాటలో శ్రీ రాధే ట్రేడింగ్ రూ. 34.64 కోట్లు, పీడీ ఆగ్రోప్రాసెసర్స్ రూ. 637.55 కోట్లు, స్వస్తిక్ ఓవర్సీస్ రూ. 101 కోట్లు, ఏఆర్కే ఇంపోర్ట్స్ రూ. 719.4 కోట్లు, లోటస్ రిఫైనరీస్ రూ. 252.56 కోట్లు చొప్పున బాకీ పడినట్లు వెల్లడించింది.