నేడు(25న) దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 70 పాయింట్లు ఎగసి 10,910 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్స్ 10,840 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. గత వారం నిరుద్యోగ క్లెయిములు అంచనాలను(8.4 లక్షలు) మించుతూ 8.7 లక్షలుగా నమోదైనట్లు యూఎస్ గణాంకాలు తాజాగా వెల్లడించాయి. అయితే సహాయక ప్యాకేజీపై కాంగ్రెస్‌లో సయోధ్య కుదరని నేపథ్యంలో గురువారం యూఎస్ మార్కెట్లు స్వల్పంగా 0.2-0.4 శాతం మధ్య బలపడ్డాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సైతం 0.5 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. కాగా.. వరుస నష్టాల నుంచి ప్రపంచ మార్కెట్లు బయటపడినప్పటికీ అంతర్గతంగా సెంటిమెంటు బలహీనంగానే ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో మార్కెట్లలో ఆటుపోట్లు తప్పకపోవచ్చని భావిస్తున్నారు.
అమ్మకాల సునామీ
ప్రపంచ మార్కెట్ల పతనంతో గురువారం దేశీ స్టాక్ మార్కెట్లకు సైతం షాక్ తగిలింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో సెన్సెక్స్ 1,115 పాయింట్లు పడిపోయింది. ఫలితంగా 37,000 పాయింట్ల మార్క్‌ను సైతం కోల్పోయి 36,553 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 326 పాయింట్లు పతనమై 10,806 వద్ద నిలిచింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 11,000 పాయింట్ల స్థాయికి నీళ్లొదులుకుంది. వెరసి మార్కెట్లు ఇంట్రాడే కనిష్టాల సమీపంలో ముగిశాయి!
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 10,725 పాయింట్ల వద్ద, తదుపరి 10,645 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 10,950 పాయింట్ల వద్ద, ఆపై 11,095 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 20,256 పాయింట్ల వద్ద, తదుపరి 20,055 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 20,807 పాయింట్ల వద్ద, తదుపరి 21,156 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.
ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1,886 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) స్వల్పంగా రూ. 189 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 3,912 కోట్లకు మించి అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 1,629 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment