గూగుల్ కంటే పదిహేనేళ్లు వెనకొచ్చిన కంపెనీ రాబిన్‌హుడ్. అయితే గూగుల్‌లో పన్నెండేళ్లు పని చేసిన అపర్ణ.. గూగుల్‌ని వదిలి, రాబిన్‌హుడ్‌లో చేరారు. స్టాక్ ట్రేడింగ్‌లను జరుపుతుండే రాబిన్‌హుడ్ తొలి చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్‌గా (సి.పి.వో) గురువారం బాధ్యతలు చేపట్టారు. రాబిన్ హుడ్‌లో ఇంతవరకు సి.పి.వో పోస్టు లేదు. ఇలాంటి పోస్ట్ ఒకటి ఉండాలని ఉండాలని అనుకున్నాక రాబిన్ హుడ్‌కు అపర్ణ తప్ప మరొకరు కనిపించలేదు. రాబిన్‌హుడ్ ఎంపిక చేసుకుంది కనుక ఆమెను రాబిన్‌హుడ్ గర్ల్ అనొచ్చు.
అపర్ణ పూర్తి పేరు అపర్ణ చెన్నాప్రగడ. అయితే ఆమె పూర్తి ప్రొఫైల్ గురించి చెప్పడం, పేరు చెప్పుకున్నంత సులభమైతే కాదు! టెక్ ఇండస్ట్రీలో ఆమెకు ఇరవై ఏళ్ల అనుభవం ఉంది. ప్రాడక్ట్‌ను డెవలప్ చెయ్యడం, డిజైన్ చెయ్యడం, వ్యూహరచన ఆమె పనులు. గూగుల్‌లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా వివిధ నాయకత్వ స్థాయిలలో పని చేశారు. అపర్ణ మద్రాస్ ఐ.ఐ.టిలో (1993–97) చదివారు. యూఎస్‌లోని మాసచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అంత చదివారంటే అంతకు అంతా నైపుణ్యాలను ఆమె తను పనిచేసిన కంపెనీలకు అందించకుండా ఉంటారా! రాబిన్‌హుడ్ ఇప్పుడు అపర్ణను సి.పి.వో.గా నియమించుకోడానికి కూడా పూర్తిగా ఆమె ప్రతిభా సామర్థ్యాలే కారణం. శాన్‌ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో ఉంటున్న అపర్ణ.. టెక్నాలజీ రంగంలోకి వెళ్లడానికి తల్లే తనకు ప్రేరణ, ప్రోత్సాహం అని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment