'ఔట్లుక్ మ్యాగజైన్ పై క్రిమినల్ కేసు'
ఔట్లుక్ మ్యాగజైన్‌పై చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను కించపరిచేలా తప్పుడు కథనం రాసినందుకు ఈ చర్యకు ఆదేశించారు. మరోవైపు తన పరువు మర్యాదలకు భంగం వాటిల్లేలా అనుచిత కథనం ప్రచురించినందుకు స్మితా సబర్వాల్ కూడా ఔట్లుక్ మ్యాగజైన్‌కు లీగల్ నోటీసులు పంపించారు. ఔట్లుక్ ఎడిటర్ ఇన్ చీఫ్ కృష్ణప్రసాద్, హైదరాబాద్‌లోని అసిస్టెంట్ ఎడిటర్ మాధవి టాటాలకు స్మితా సభర్వాల్ తరఫు న్యాయవాది ఈ నోటీసులు పంపారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని అందులో పేర్కొన్నారు.
ప్రస్తుతం స్మితా సబర్వాల్ సీఎంవో కార్యాలయంలో అడిషనల్ కార్యదర్శి హోదాలో ఉన్నారు. గతంలో కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కలెక్టర్‌గా పని చేసి సమర్థురాలైన అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి అధికారిపై ఔట్లుక్ పత్రికలో వచ్చిన కథనాన్ని జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పక్షాలు తీవ్రంగా ఖండించాయి. అదొక నీచమైన కథనమని, ఔట్లుక్ పత్రిక ఒక మహిళా ఐఏఎస్‌ను కించపరిచిందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మండిపడ్డారు. ఈ కథనం తెలంగాణ ప్రజలను, సీఎంవో కార్యాలయాన్ని అవమానించినట్లుగా ఉందని.. వెంటనే ఔట్లుక్ యాజమాన్యం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.