స్టీరింగ్‌పైనే ప్రాణాలొదిలిన లారీ డ్రైవర్
నేలకొండపల్లి(ఖమ్మం): ఖమ్మం నుంచి కోదాడ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ గుండె పోటుతో స్టీరింగ్ పైనే చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని నరసింహారావుపేటకు చెందిన శివంగి సత్యనారాయణరాజు(55)అనే లారీ డ్రైవర్ సోమవారం జంగారెడ్డిగూడెం నుంచి కొబ్బరిబొండాల లోడుతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం బయలుదేరారు.
నేలకొండపల్లికి తెల్లవారు జామున చేరుకున్న సమయంలో గుండె నొప్పి వచ్చింది. దీంతో ఆయన మెల్లగా లారీని రోడ్డు పక్కకు తీశాడు. ఇంజిన్ ఆఫ్ చేయక మునుపే తీవ్ర గుండెపోటుతో స్టీరింగ్‌పై కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. విషమ పరిస్థితుల్లోనూ ఆయన సమయస్ఫూర్తిగా వ్యవహరించటంతో పెనుప్రమాదం తప్పిందని గ్రామస్తులు అంటున్నారు.