ఓటమితో నిరాశ వద్దు
పటిష్ట ప్రణాళికతో ముందుకుసాగుదాం
గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి
కార్యకర్తలకు అన్ని వేళలా అండ
వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు కొణతాల రామకృష్ణ
అనకాపల్లి రూరల్, న్యూస్‌లైన్: ‘ఓడి పోయామన్నది వాస్తవమే. ఇది జీర్ణించుకోలేని అంశమే. అంతమాత్రాన నిరాశ వద్దు. పటిష్ట ప్రణాళికతో భవిష్యత్తును పునర్నిర్మించుకుందాం. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి సత్తా చాటుదాం, విపక్షం అంటే ఎలా ఉండాలో ఆచరణలో చూపిద్దాం’ అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అనకాపల్లి పట్టణంలోని వైఎంవీఏ సమావేశ మందిరంలో పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం శనివారం జరిగింది. గోపాలపు రం సర్పంచ్ గొర్లి సూరిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కొణతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటమిని విజయానికి మెట్టుగా మలుచుకుని ముందుకుసాగుదామని దిశానిర్దేశం చేశారు. అన్ని సర్వేలు జగన్ సీఎం అవుతారని ప్రకటించాయని, సీమాంధ్రలో ఏ ఒక్కరిని అడిగినా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని భరోఇచ్చేవారన్నారు.
దీంతో నాయకులు, కార్యకర్తలు అతి విశ్వాసానికి పోయి ఓటమిపాలయ్యామని విశ్లేషించారు. గ్రామ, బూత్, మండల స్థాయి కమిటీలు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మోడీ గాలి వల్లే టీడీపీ విజయం సాధ్యమైందన్నారు. మోడీ నినాదాన్ని గ్రామ స్థాయికి ఆ పార్టీ నాయకులు తీసుకువెళ్లగలిగారన్నారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా టీడీపీ వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు అండగా ఉంటూ పటిష్ట ప్రణాళికతో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళతామని చెప్పారు.
నియోజకవర్గ నాయకుడు కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) మాట్లాడుతూ 2009లో కొన్ని పొరపాట్లు చేశామని, ఇప్పుడూ మళ్లీ అవే పొరపాట్లు జరిగాయన్నారు. కార్యకర్తలు కష్టపడి పనిచేసినా గెలుపు ధీమావల్లే ఓటమిపాలయ్యామని చెప్పారు. అధికారం రాకపోయినా కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేస్తామని చెప్పారు.
పార్టీ నాయకుడు కొణతాల రఘునాథ్ మాట్లాడుతూ కార్యకర్తలు కష్టపడి పనిచేసినా మోడీ ప్రభంజనంలో ఓటమి పాలయ్యామన్నారు. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి కమిటీలతో మళ్లీ పుంజుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ డి.వి.వి.గోపాలరాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మలసాల కిశోర్, పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.