Bangladesh Political Crisis: చీఫ్ జస్టిస్‌నూ సాగనంపారు
ఢాకా: బంగ్లాదేశ్‌లో విద్యార్థి సంఘాల హల్ చల్ కొనసాగుతూనే ఉంది. బలవంతపు రాజీనామాల పర్వానికి ఇంకా తెర పడలేదు. షేక్ హసీనా హయాంలో ఉన్నత స్థాయి పదవుల్లో నియమితులైన వారంతా తప్పుకోవాల్సిందేనని సంఘాలు అలి్టమేటం జారీ చేశాయి. దాంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్ (65), సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుర్ తౌఫ్ తాలుక్దార్ శనివారం రాజీనామా చేశారు. సుప్రీం న్యాయమూర్తులందరితో కూడిన సీజే అత్యవసరంగా ఫుల్ కోర్టును సమావేశపరుస్తున్నారన్న వార్తలతో ఉదయం నుంచే కలకలం రేగింది. మహమ్మద్ యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి దేశ వ్యతిరేక శక్తులకు దన్నుగా నిలవడమే ఈ భేటీ ఆంతర్యమని విద్యార్థి సంఘాల నేతలతో పాటు పలువురు ప్రభుత్వ సలహాదారులు కూడా ఆరోపించారు. సీజే, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాజీ ప్రధాని షేక్ హసీనా తాబేదార్లంటూ దుయ్యబట్టారు. దాంతో దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనలు, నిరసనలు తీవ్రతరమయ్యాయి. సీజే, ఇతర న్యాయమూర్తులు గంటలోపు తప్పుకోవాలని విద్యార్థి సంఘాలు అలి్టమేటమిచ్చాయి. విద్యార్థులు, యువత సుప్రీంకోర్టును భారీ సంఖ్యలో ముట్టడించారు. దాంతో ఫుల్ కోర్టు భేటీని సీజే రద్దు చేశారు. మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు దేశవ్యాప్తంగా జడ్జిలందరి క్షేమం దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన రాజీనామా లేఖను వెంటనే అధ్యక్షునికి పంపినట్టు న్యాయ సలహాదారు వెల్లడించారు. ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా రాజీనామా చేశారు. జస్టిస్ మహ్మద్ అష్ఫకుల్ ఇస్లాంను తాత్కాలిక సీజేగా నియమించారు. తాలుక్దార్ రాజీనామాను ఇంకా ఆమోదించలేదని సర్కారు పేర్కొంది. ఢాకా వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ మక్సూద్ కమాల్ తదితర ఉన్నతాధికారులెందరో రాజీనామా బాట పట్టారు. యువత, విద్యార్థుల ఆందోళనలతో హసీనా సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వీడటం తెలిసిందే. మైనారిటీలపై అవే దాడులు... బంగ్లావ్యాప్తంగా హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హసీనా తప్పుకున్న నాటినుంచి గత ఆరు రోజుల్లో కనీసం 205కు పైగా మతపరమైన దాడుల ఉదంతాలు చోటుచేసుకున్నట్టు హిందూ సంఘాలు వెల్లడించాయి. దాంతో మైనారిటీలంతా భయాందోళనల నడుమ గడుపుతున్నట్టు వివరించాయి. ఇందుకు సంబంధించిన వివరాలతో మధ్యంతర ప్రభుత్వాధినేత యూనుస్‌కు బహిరంగ లేఖ రాశాయి. తమకు భద్రత కలి్పంచాలని కోరాయి. గత ఐదారు రోజుల్లో దేశవ్యాప్తంగా 230 మంది హింసాకాండకు బలయ్యారు. దాంతో గత జూలై నుంచి చనిపోయిన వారి సంఖ్య 560 దాటింది. తమపై, తమ కుటుంబాలపై దా డులకు నిరసనగా వేలాది మంది హిందువులు శనివారం వరుసగా రెండో రోజు కూడా ఢాకాలో నిరసనలకు దిగారు. ‘హిందువుల ను కాపాడండి’ అంటూ నినాదాలు చేశారు.మైనారిటీలను కాపాడుకుందాం: యూనుస్ మైనారిటీలపై జరుగుతున్న దాడులను యూనుస్ తీవ్రంగా ఖండించారు. ‘‘మైనారిటీలు మన దేశ పౌరులు కారా? ఇది చాలా నీచమైన చర్య’’ అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. దేశంలోని హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులకు ఎలాంటి హానీ కలగకుండా కాపాడాల్సిందిగా యువతకు పిలుపునిచ్చారు. హసీ నా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను ముందుండి నడిపిన పాతికేళ్ల విద్యార్థి అబూ సయీద్‌ను దేశ ప్రజలంతా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. జూలైలో తలెత్తిన ఈ ఆందోళనలకు తొలుత బలైన విద్యార్థుల్లో అబూ కూడా ఉన్నాడు.