విద్యార్థి నాగసాయి (ఫైల్)
యాజమాన్యమే బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాల డిమాండ్
హైదరాబాద్: రాజధానిలోని ప్రగతినగర్ నారాయణ జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ పంటకుదురుకు చెందిన వంశీధర్ కుమారుడు నాగసాయి.. ప్రగతినగర్ నారాయణ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం హాస్టల్‌లో నాగసాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీ సులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
అయితే నాగసాయి మృతి విషయం తెలుసుకున్న అతని బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల వద్దకు చేరుకుని, ఈ ఘటనకు యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కళాశాల నిర్వాహకుల ఒత్తిడి మూలంగానే నాగసాయి మృతి చెందాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా, నారాయణ కళాశాలల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. నారాయణ విద్యాసంస్థల చైర్మన్, ఏపీ మంత్రి నారాయణ దిష్టిబొమ్మను బర్కత్‌పుర చౌరస్తాలో దగ్ధం చేశారు. గత 15 రోజుల నుంచి నారాయణ కళాశాలలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.