ఇష్టారాజ్యం
తిరుపతి: సీఎం త్వరపెడుతున్నా హంద్రీనీవా పనుల్లో వేగం పెరగాల్సిందిపోయి.. రోజురోజుకూ తగ్గుతోంది. కాంట్రాక్టర్లు అంతా అధికార పార్టీనేతలు కావడమే ఇందుకు ప్రధాన కారణం. పనుల ఆలస్యంపై అధికారులు కాంట్రాక్టర్లను గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో కాంట్రాక్టు సంస్థలను అధికారులు ప్రాధేయపడినా లెక్క చేయడం లేదు. పనులు సంస్థ పేరుతో ఉంటే.. పనులు నిర్వహించే వారంతా సబ్కాంట్రాక్టర్లే కావడం గమనార్హం. ముఖ్యమంత్రి పనుల పరిశీలనా నిమిత్తం మదనపల్లెకు వచ్చిన సందర్భంలో ప్రధాన కాంట్రాక్టర్లు సైతం ముఖం చాటేశారు. దీంతో అధికారులకు మాత్రం తిప్పలు తప్పడంలేదు.
ఇదిగో సాక్ష్యం..
మదనపల్లె సమీపంలోని టన్నెల్ పనులను రిత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకొంది. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీనేతకు వారు సబ్‌కాంట్రాక్టు కట్టబెట్టారు. ఆ సబ్ కాంట్రాక్టర్ పనులు చేయకుండా మరొకరికి అప్ప జెప్పారు. దీంతో ఎక్కడిపనులు అక్కడే ఆగిపోతున్నాయి. అధికారులు ప్రశ్నిస్తే.. మందకొడిగా సాగుతున్నాయి. రోజుకు 24 మీటర్ల మేర టన్నెల్ పని చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు మేనెల చివరికి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశించింది. పనుల వేగం మొదట్లో ఓ మాదిరిగా ఉన్నా చివరికి వచ్చేసరికి వేగం పూర్తిగా తగ్గింది. అందులో భాగంగా జనవరిలో రోజుకు సరాసరిన 16 మీటర్లు, ఫిబ్రవరిలో 12 మీటర్లు, మార్చిలో 8 మీటర్లకు తగ్గిపోయింది.
కాంట్రాక్టర్లను అడిగేదెవరు..
కుప్పం బ్రాంచికెనాల్ పనులను ఆర్కె ఇన్ఫ్రా దక్కించుకోగా, ఆ సంస్థ మరో సంస్థకు పనులను కట్టబెట్టినట్టు సమాచారం. పనులు నత్తనడకన జరుగుతండటంతో అధికారులపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారే పనులు చేసేదంతా అధికార పార్టీ కాంట్రాక్టర్లని, వారితో అధికారులకు ఏమాత్రం పనిచేయించే సామర్థ్యం లేదని సీఎంకు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం టన్నెల్ పనుల పరిశీలన నిమిత్తం వచ్చిన సీఎం సబ్ కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పనులు చేయగలిగి ఉండి కొంతమంది చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మదనపల్లె పర్యటనలో సైతం ప్రధాన కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు హాజరు కాలేదని తెలిసింది.
గడువులోపు పూర్తి చేయాల్సిందే..
టన్నెల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులను సీఎం హెచ్చరించారు. మ్యానువల్ పద్ధతిలో పనులు చేస్తే ఎప్పటికి పూర్తవుతాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి బూమర్లు ఏర్పాటు చేసి రోజు 24 మీటర్లు పనిచేయాని అధికారులను ఆదేశించారు. బూమర్లు దొరకడం లేదని 15 వతేది నుంచి టన్నెల్ పనుల వేగం అందుకోవడం కష్టమేననని నీటిపారుదలశాఖ సిబ్బందిలో చర్చ సాగుతోంది.