Sub Election
-
మరోమారు ‘కూటమి’ ప్రయోగం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపక్షాలు మళ్లీ జట్టు కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోమారు ‘కూటమి’ ప్రయోగం తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కలసికట్టుగా పోటీచేసి భంగపడ్డ ప్రతిపక్షాలు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికల సందర్భంగా మరోమారు ఏకం కానున్నాయి. ఈ నెల 31న జరగనున్న ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని టీపీ సీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వామపక్షాలు, టీజేఎస్, టీడీపీలకు లేఖలు రాయడంతో ఆ దిశగా చర్చ మొద లైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కలసి పనిచేసిన సీపీఐ, టీడీపీ, టీజేఎస్లతోపాటు సీపీఎంకు కూడా ఆయన లేఖలు రాశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్థులు కోమటిరెడ్డి లక్ష్మి (నల్లగొండ), ఇనుగాల వెంకట్రామిరెడ్డి (వరంగల్), కొమ్మూరి ప్రతాపరెడ్డి (రంగారెడ్డి)లకు మద్దతివ్వాలని మంగళవారం అన్ని పార్టీల అధ్యక్షులకు ఉత్తమ్ లేఖలు రాశారు. వాళ్లు ఇచ్చారు కానీ... ఉత్తమ్ ప్రతిపాదనకు ప్రతిపక్షాలు అంగీకరిస్తే మరో సారి ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి ఎన్నికలను ఎదుర్కొన్నట్టవుతుందనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే సీపీఐ, టీజేఎస్, టీడీపీలతో కలసి కాంగ్రెస్ కూటమి కట్టి ఎన్నికలను ఎదుర్కొంది. ఆ ఎన్నికల్లో ఆశాభంగం కావడంతో ఆ తర్వాత కూటమిలోని పార్టీలు తలో దారిలో వెళ్లాయి. కలసికట్టుగా ఎన్నికలు ఎదుర్కొన్న ఆ పార్టీల నేతలు ఎన్నికల్లో ఎదురైన ఓటమిపై కనీసం ఒక్కచోట కూర్చుని సమీక్ష చేయలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిందే తడవుగా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా అధికారికంగా కలసి పనిచేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీపీసీసీ చీఫ్ ఉత్తమ రాసిన లేఖకు ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రయోగం జరుగుతుందా..? లేదా? అన్నది ఒకట్రెండు రోజుల్లో తేలనుంది. -
సానుభూతి X అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి షెడ్యూల్ రావడంతో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ ఉప ఎన్నికపై మెదక్ జిల్లా నేతలతో మాట్లాడారు. ఇక టీఆర్ఎస్ అభివృద్ధి మంత్రం జపిస్తూ ఎన్నికకు సమాయత్తమవుతోంది. సానుభూతిపైనే కాంగ్రెస్ ఆశలు కాంగ్రెస్‌కు నారాయణఖేడ్ నియోజకవర్గంలో బలమైన పునాది ఉంది. ఇక్కడ ఇప్పటిదాకా కేవలం ఒక్కసారే(1994లో) కాంగ్రెస్ ఓడిపోయింది. మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ ఆ పార్టీ వరుస విజయాలు సాధించింది. వీటికితోడు నియోజకవర్గంలో పార్టీ నేతలు పి.కిష్టారెడ్డి, సురేశ్ షెట్కార్ కుటుంబాలకు బలమైన అనుచర వర్గం ఉంది. ఈ రెండు కుటుంబాలు ఐక్యంగా ఉంటే కాంగ్రెస్‌ను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని ఆ పార్టీ నేతల విశ్వాసం. ఈ కుటుంబాల నుంచి ఒకరు లోక్‌సభకు, మరొకరు శాసనసభకు పోటీలో ఉంటూ పరస్పరం సహకరించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లోనూ సురేష్ షెట్కార్ జహీరాబాద్ నుంచి లోక్‌సభకు పోటీచేయగా, పి.కిష్టారెడ్డి అసెంబ్లీకి పోటీచేశారు. నారాయణఖేడ్ నుంచి పోటీ చేసిన కిష్టారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందగా, షెట్కార్ ఓడిపోయారు. కిష్టారెడ్డి అకాల మృతితో వస్తున్న ఉప ఎన్నికలో పోటీ చేయాలని షెట్కార్ అభిలషించారు. అయితే కిష్టారెడ్డిపై ఉన్న సానుభూతితో ఆయన కుమారుడు సంజీవరెడ్డిని పోటీలోకి దించాలని టీపీసీసీ నిర్ణయించింది. షెట్కార్తో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతి పక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, మెదక్ జిల్లా ముఖ్య నేతలు దామోదర రాజనర్సింహ, జె.గీతారెడ్డి, వి.సునీతా లక్ష్మారెడ్డి, జగ్గారెడ్డి సమావేశమై ఉప ఎన్నికల్లో సహకరించాలని కోరారు. కిష్టారెడ్డి కుటుంబ సభ్యుల తరఫున పనిచేయాలని, రానున్న సాధారణ ఎన్నికల్లో తగిన ప్రాధాన్యం ఉంటుందని నచ్చజెప్పారు. టీఆర్ఎస్ అభివృద్ధి జపం.. సాధారణ ఎన్నికల నాటికి నారాయణఖేడ్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలహీనంగానే ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పార్టీల నేతలను పెద్దఎత్తున చేర్చుకుంది. జిల్లాకు చెందిన మంత్రి టి.హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో నియోజకవర్గంలోని చెరువులు, రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు వంటి వాటికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఉప ఎన్నికల కోణంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల్లోనూ ఈ నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇతర పార్టీల నేతలను ఆకర్షించడానికి పదవులు, కాంట్రాక్టులను ఎరగా చూపిస్తున్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను కూడా తమకు అనుకూలంగా మల్చుకోవడానికి టీఆర్ఎస్ యత్నిస్తోంది. -
9 స్థానాలకు ఉప ఎన్నిక తప్పదా?
⇒ టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల రాజీనామాపై జోరుగా చర్చ ⇒ అనర్హత వేటుపై పెండింగ్‌లో స్పీకర్ నిర్ణయం ⇒ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు యోచనపై ఊహాగానాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉప ఎన్నికల నగారా మోగనుందా... టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇదే ఆలోచనలో ఉన్నారా.. ప్రస్తుతం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ ఇది. వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై స్పీకర్ నిర్ణయం ఇంకా పెండింగ్‌లో ఉంది. అలాగే మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీనిపైనా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. అలాగే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్, టీడీపీలు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు గడ్డం విఠల్‌రెడ్డి, కనకయ్య, రెడ్యానాయక్, కాలే యాదయ్యతోపాటు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు తమ తమ పార్టీలను వదిలి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయా పార్టీల నాయకత్వాలు వీరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ మధుసూదనాచారికి ఫిర్యాదు చేశాయి. ఈ పరిస్థితుల్లో తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చే యించి ఉప ఎన్నికలకు వెళ్లాల్సిన అనివార్య పరిస్థితి ఉందన్నది రాజకీయవర్గాల అభిప్రాయం. వీరిపై అనర్హత వేటు వేయకుండా, లేదంటే రాజీనామానాలు చేయించకుండా సభలోనే ఉంచి నడిపించడం అంత తేలికైన విషయం కాదని, ఉప ఎన్నికలకు పోవడం ఒక్కటే టీఆర్ఎస్ ముందున్న ఏకైక మార్గమని పరిశీ లకులు విశ్లేషిస్తున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ మదిలో ఏముందన్నది టీఆర్ఎస్ వర్గాల్లోనే స్పష్టత లేదు. పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తే, 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశముంది.