
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపక్షాలు మళ్లీ జట్టు కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోమారు ‘కూటమి’ ప్రయోగం తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కలసికట్టుగా పోటీచేసి భంగపడ్డ ప్రతిపక్షాలు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికల సందర్భంగా మరోమారు ఏకం కానున్నాయి. ఈ నెల 31న జరగనున్న ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని టీపీ సీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వామపక్షాలు, టీజేఎస్, టీడీపీలకు లేఖలు రాయడంతో ఆ దిశగా చర్చ మొద లైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కలసి పనిచేసిన సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌లతోపాటు సీపీఎంకు కూడా ఆయన లేఖలు రాశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్థులు కోమటిరెడ్డి లక్ష్మి (నల్లగొండ), ఇనుగాల వెంకట్రామిరెడ్డి (వరంగల్), కొమ్మూరి ప్రతాపరెడ్డి (రంగారెడ్డి)లకు మద్దతివ్వాలని మంగళవారం అన్ని పార్టీల అధ్యక్షులకు ఉత్తమ్ లేఖలు రాశారు.
వాళ్లు ఇచ్చారు కానీ...
ఉత్తమ్ ప్రతిపాదనకు ప్రతిపక్షాలు అంగీకరిస్తే మరో సారి ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి ఎన్నికలను ఎదుర్కొన్నట్టవుతుందనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే సీపీఐ, టీజేఎస్, టీడీపీలతో కలసి కాంగ్రెస్ కూటమి కట్టి ఎన్నికలను ఎదుర్కొంది. ఆ ఎన్నికల్లో ఆశాభంగం కావడంతో ఆ తర్వాత కూటమిలోని పార్టీలు తలో దారిలో వెళ్లాయి. కలసికట్టుగా ఎన్నికలు ఎదుర్కొన్న ఆ పార్టీల నేతలు ఎన్నికల్లో ఎదురైన ఓటమిపై కనీసం ఒక్కచోట కూర్చుని సమీక్ష చేయలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిందే తడవుగా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా అధికారికంగా కలసి పనిచేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీపీసీసీ చీఫ్ ఉత్తమ రాసిన లేఖకు ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రయోగం జరుగుతుందా..? లేదా? అన్నది ఒకట్రెండు రోజుల్లో తేలనుంది.