ఐ లవ్ హైదరాబాద్.. కర్రాబిళ్ల ఆడేవాళ్లం
సాక్షి, సిటీబ్యూరో/హిమాయత్‌నగర్ : ‘హోలీ హోలీల రంగ హోలీ.. చెమ్మకేలిల హోలీ’ అంటూ చిన్నప్పుడు బాగ్‌అంబర్‌పేట వీధుల్లో ఆడిన రోజులు ఎప్పటికీ మరిచిపోలేనివి. ఆ పండుగపూట రంగులు పట్టుకొని ఇంటింటికీ వెళ్లి పెద్ద మనుషులకు బొట్లు పెట్టి చందాలు సేకరించేవాళ్లం. అలా వచ్చిన డబ్బుతో రాత్రివేళ విందు ఏర్పాటు చేసేవాళ్లం. మాకు తోడు స్థానికులు కలిసేవాళ్లు. ఇక ఉమ్మడిగా ఒకేచోట కూర్చొని తిన్న జ్ఞాపకాల ముద్రలు ఎవరూ చెరపలేనివి. నా ఊరు, నా మనుషులతో ఉన్న అనుబంధం నాతో పోవాల్సిందే. నిన్న.. నేడు.. రేపు.. నా మనసంతా హైదరాబాదే’ నగరంలో పుట్టి పెరిగి బుధవారం కన్నుమూసిన జస్టిస్ సుభాషన్‌రెడ్డి మాటలివి..లోకాయుక్త హోదాలో కొద్ది కాలం క్రితం సాక్షి ప్రతినిధితో పంచుకున్న సుభాషన్‌రెడ్డి అనుభవాలివీ..
పూలు కోసేవాడిని...
మాకు అంబర్‌పేట, రామంతాపూర్, ఉప్పల్‌లో వ్యవసాయ భూమి ఉండేది. 36 మంది వ్యవసాయ కూలీలు పనిచేసేవారు. ప్రతిరోజూ వారికి జొన్నరొట్టెలు, అన్నం పెట్టేవాళ్లం. ఒక్క యాపిల్ తప్ప ప్రతి పంటను పండించేవాళ్లం. తాతతో కలిసి మల్లెపూల తోటకు పోయేవాడిని, అక్కడ కూలీలతో కలిసి పూలను కోసేందుకు పోటీపడేవాడిని. కూరగాయాల లోడ్‌తో మోండా మార్కెట్‌కు వెళ్లేవాడిని. వ్యవసాయ పొలాల్లో చిన్నప్పుడు సరదాగా చేసిన అన్ని పనులు గుర్తొస్తూనే ఉంటాయి.
అప్పట్లో..నగరమంతా చల్లదనమే..
అప్పట్లో వాతావరణం చల్లగా ఉండేది. ఎండాకాలంలోనూ గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ మించేది కాదు. ఇంట్లో ఫ్యాన్లు కూడా లేవు. వేసవిలో ఫ్యాన్లతో అవసరముండేది కాదు. వానలు సమయానుకూలంగా పడేవి. హుస్సేన్‌సాగర్ నీళ్లు తాగేవాళ్లం. బట్టలు కూడా ఉతికేవాళ్లం. వ్యవసాయానికి పనికి వచ్చేవి. కొంత మంది ఈత కూడా కొట్టేది. అన్ని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉండేది. ఎలాంటి నీటి కొరత ఉండేది కాదు.
డెక్కన్ ఆట మరచిపోలేను...
చిన్నప్పుడు స్నేహితులతో కలిసి డెక్కన్ (కూల్‌డ్రింక్స్ మూత)లను సేకరించేవాళ్లం. వీధుల్లోని అన్ని దుకాణాల వద్ద ఇవి దొరికేవి. ఆ డెక్కన్లతో ఫ్రెండ్స్‌తో కలిసి ఆటలు ఆడేది. ఒక గుండం గీసి అందులో డెక్కన్‌లను వేసేది. ఒక డెక్కన్ను మాత్రమే రాయితో కొట్టి మిగతా డెక్కన్‌లను గెలుచుకునేది. ఈ ఆట సరదాగా అనిపించేది. గోళీల ఆట కూడా ఆడా. బొంగురం తిప్పేది. గుల్లేరు పట్టుకొని మామిడి చెట్టుపై ఉన్న పండ్లను కొట్టేది. మొక్కజొన్న కంకులపై వాలే పక్షులను గురిచూసి కొట్టేవాన్ని.
సినిమాలు బాగా చూసేవాన్ని...
నూర్ మహల్ టాకీస్, ప్రభాత్, ప్రశాంత్, సాగర్ థియేటర్లలో సినిమాలు చూసేవాళ్లం. వీలుచిక్కినప్పుడల్లా స్నేహితులతో కలిసి మూవీలకు వెళ్లేవాడిని. బాయ్ జా బజార్ సినిమాను ప్రశాంత్ థియేటర్లో ఐదుసార్లు చూశా. ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు నటించిన మాయా బజార్ సినిమాను సాగర్ థియేటర్లో లెక్కలేనన్ని సార్లు చూశా. అప్పట్లో దో అణాకు చాయ్ వచ్చేది.
ఇప్పటి పిల్లలకు తీరని లోటు
గతంలో పిల్లలు బాల్యదశను ఎంతో ఎంజాయ్ చేసేవాళ్లం. నాన్నమ్మ, అమ్మమ్మల ఇళ్లకు వెళ్లేవాళ్లం. ఆటలు బాగా ఆడేది. ఇప్పటి రోజుల్లో అయితే ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్రపోయేవరకు పాఠశాల, ట్యూషన్‌తోనే సమయం గడిచిపోతోంది. పండుగలకు కూడా బంధువులతో కూడా సరిగా సమయాన్ని వెచ్చించలేకపోతున్నారు. ఇది ఇప్పటిపిల్లలకు తీరని లోటే.
అతని టీమ్‌లో నేనుండాల్సిందే..
సుభాషణ్ రెడ్డి నాకు చిన్ననాటి నుంచీ మిత్రుడు. ఈతకు వెళ్లినా..కర్రాబిళ్ల ఆడినా అతని టీంలో నేనుండాల్సిందే. పెద్దయ్యాక కూడా అవకాశం వచ్చిన ప్రతి సారీ కబుర్లు చెప్పుకునేవాళ్లం. పెద్ద న్యాయమూర్తి అయినా వారి ఇంట్లో ఏ చిన్న పూజ అయినా నేనే హాజరై పూజలు చేయాల్సిందే. వారం క్రితం వారి ఇంటికి వెళ్లి వారి నాన్నగారితో మాట్లాడాను. ఒక స్నేహితుడిని కోల్పోయాను. బాధగా ఉంది. – సుభాష్ పంతులు,బుర్జుగల్లీ హనుమాన్ ఆలయం
తోచిన సాయం చేసేవారు
అంబర్‌పేటలో పది ఎకరాల ఆసామి అయిన సుభాష్‌రెడ్డి పటేల్ అయినప్పటికీ ఎలాంటి భేదం లేకుండా తనకు తోచిన సాయం చేసేవారు. బాగ్ అంబర్‌పేటలో ఉన్న వారి నివాసంతో పాటు వారి కుటుంబంలో ఎవరు ఇల్లు కట్టినా మేం పని చేశాం. మాకే చెప్పి దగ్గరుండి కట్టించాల్సిందిగా చెప్పేవారు. చిన్ననాటి నుంచి సుభాష్‌రెడ్డి మాకు ఎంతో అండగా ధీమా ఇచ్చేవారు. ఏదైనా బస్తీలో పంచాయతీ అయితే ఆయన దగ్గరకు వెళ్లి పరిష్కరించుకునేవాళ్లం. – రాములు, అంబేడ్కర్‌నగర్,బాగ్ అంబర్‌పేట
బాధాకరం
సుభాషణ్‌రెడ్డి మృతి బాధాకరమని సమాచారహక్కు మాజీ కమిషనర్ డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లు, ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డిలు అన్నారు. న్యాయమూర్తిగా ఆయన ఎన్నో హోదాల్లో విధులు నిర్వర్తించి ఎందరికో మార్గదర్శకులుగా ఉన్నారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కర్రాబిళ్ల ఆడేవాళ్లం
నాకూ సుభాషణ్కి మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది. ఇద్దరం ప్రాణస్నేహితులం. చిన్నతనంలో మేం కర్రాబిళ్ల, స్విమ్మింగ్ చేసిన సన్నివేశాలు ఇప్పుడు నా కళ్ల ఎదుట కనిపిస్తున్నాయి. సుభాషణ్ న్యాయవృత్తిలో అంచలంచెలుగా ఎదిగారు.నా మంచి స్నేహితుడు ఈ రోజు నన్ను వదిలేసి వెళ్లడం నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది.– వి.హనుమంతరావు,మాజీ రాజ్యసభ సభ్యులు
పలువురి నివాళి
జస్టిస్ సుభాషణ్‌రెడ్డికి పలువురు నివాళులర్పించారు.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర ఎస్ చౌహాన్, న్యాయమూర్తులు జస్టిస్ రామచంద్రరరావు, జస్టిస్ కేశరావు, జస్టిస్ చల్లా కోదండరాం, జస్టిస్ అభినంద్షాలీ, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ షమీఅక్తర్లతో పాటు సుమారు 35మంది మాజీ న్యాయమూర్తులు నివాళులు అర్పించారు. వందల మంది న్యాయవాదులు విచ్చేసి ఆయన సేవలను స్మరించుకుంటూ, ఓనమాలు దిద్దిన గురువు మా మధ్య లేకపోవడం బాధాకరంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఐఏఎస్ అధికారి అమ్రపాలి, కేవీపీ రామచంద్రరావు, జస్టిస్ ఈశ్వరయ్య, చంద్రకుమార్, నటుడు సామ్రాట్, ఏసీబీ మాజీ డైరెక్టర్ ఏ.కె.ఖాన్, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఖాద్రీలు ఘన నివాళులు అర్పించారు.