జూనియర్ లెక్చరర్లకూ బీఎడ్!
♦ కసరత్తు చేస్తున్న కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ
♦ ఇదే విషయాన్ని స్పష్టం చేసిన హెచ్ఆర్డీ కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: జూనియర్ కాలేజీల్లో బోధించే లెక్చరర్లు ఉపాధ్యాయ శిక్షణ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్) చేసి ఉండాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని చెబుతోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌లో (సీబీఎస్ఈ) 11, 12 తరగతులైనా, వాటికి సమానంగా తెలుగు రాష్ట్రాలు అమలు చేస్తున్న ఇంటర్ విద్య అయినా పాఠశాల విద్యలో భాగమే. సీబీఎస్సీలో 11, 12 తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు బీఎడ్ తప్పనిసరిగా ఉన్నపుడు ఇంటర్‌కు బోధించే అధ్యాపకులకూ బీఎడ్ అవసరమే. ఈ మేరకు చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పరిశీలన జరుపుతోంది.
అన్ని రాష్ట్రాల్లో 11, 12 తరగతులకు, ఇంటర్‌కు కామన్ సిలబస్, ఒకే రకమైన పరీక్షా విధానాన్ని తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు చేపడుతున్న విషయం విదితమే. ఇంటర్ బోధించే లెక్చరర్లకు కూడా స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు (సెట్), నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు (నెట్) తరహాలో మరేదైనా అర్హత పరీక్షను ప్రవేశ పెట్టాలన్న అంశాలను పరిశీలిస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పాఠశాల విద్యా కార్యదర్శి సుభాష్‌చంద్ర కుంతియా రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యతో భేటీ సందర్భంగా తెలిపారు.
రాష్ట్రంలో 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా, 3,750 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, 1,800 మంది రెగ్యులర్, మినిమమ్ టైం స్కేల్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2,850 ప్రైవేటు జూనియర్ కాలే జీల్లో దాదాపు 50 వేల మంది లెక్చరర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో రెగ్యులర్ లెక్చరర్లు పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే పరీక్ష ద్వారా ఎంపికై పని చేస్తున్నారు. ఇక కాంట్రాక్టు లెక్చరర్లు, ప్రైవేటు లెక్చరర్లుగా ఎలాంటి పరీక్ష లేకుండా నియమితులవుతున్నారు. కాగా రాష్ట్రంలో ఇంటర్.. పాఠశాల విద్యలో భాగంగా లేదని, ఉన్నత విద్యలో భాగం గా కొనసాగుతోందని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.
పైగా ఇందులో ఉపన్యాస పద్ధతిలో (లెక్చర్ మెథడ్) బోధన విధానం ఉందని తెలిపారు. అలాంటప్పుడు బీఎడ్ ఉండాలనేది సరికాదని, నెట్, సెట్ తరహాలో ఏదైనా అర్హత పరీక్ష ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు.