subhash paleker
-
10% నీటితోనే వరి, చెరకు సాగు!
వరి, చెరకు, అరటి.. అత్యధికంగా సాగు నీరు అవసరమయ్యే పంటలివి. అయితే, సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కేవలం 10% నీరు, 10 శాతం విద్యుత్తు, 5% (దేశీ వరి) విత్తనంతోనే సాగు చేస్తూ కరువు కాలంలోనూ సజావుగా దిగుబడి తీస్తున్న విలక్షణ రైతు విజయరామ్. వికారాబాద్ సమీపంలో రెండేళ్లుగా కరువుతో అల్లాడుతున్న తన వ్యవసాయ క్షేత్రంలో అతి తక్కువ నీరు, విద్యుత్తు, విత్తనంతో అనేక రకాల దేశీ వరి వంగడాలు, చెరకు, అరటితోపాటు కందిని ఆయన సాగు చేస్తున్నారు. ఈ క్షేత్రాన్ని ఇటీవల పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ సందర్శించి, సంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు సూచనలిచ్చారు.ఆ ప్రాంతంలో రెండేళ్లుగా కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అతి తక్కువ నీటితో వరి, చెరకు, అరటి, కంది తదితర పంటలు సాగు చేస్తుండటం విశేషం. మిఠాయిల వ్యాపారి అయిన విజయరామ్ ఎనిమిదేళ్ల క్రితం రాజమండ్రిలో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పాఠాలు విని పొందిన స్ఫూర్తితో ఆవులు, పొలం కొని ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. కృష్ణా జిల్లా గూడూరు మండలం తరకటూరులో సౌభాగ్య గోసదన్‌ను ఏర్పాటు చేసి 8 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నారు. పాలేకర్ చేత 6 వేల మంది రైతులకు శిక్షణ ఇప్పించిన ఆయన 200 రకాల దేశీ వరి వంగడాలను సేకరించి, కొన్ని ఎంపిక చేసిన రకాలను సాగు చేస్తున్నారు. గత ఏడాది వికారాబాద్ మండలం ధారూర్ మండలం బూరుగడ్డ గ్రామంలో 43 ఎకరాల నల్లరేగడి వ్యవసాయ భూమిని గత ఏడాది కొనుగోలు చేశారు. 35 ఏళ్లు రసాయనిక సాంద్ర వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన ఈ నేలలో ఘనజీవామృతం, జీవామృతం, ఆచ్ఛాదన తదితర పద్ధతులను పాటిస్తూ ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఇటీవల సుభాష్ పాలేకర్ ఈ క్షేత్రాన్ని సందర్శించి, వాతావరణ మార్పులను తట్టుకొనేందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతే శరణ్యమనడానికి 10% నీరు, 10% విద్యుత్తుతోనే వరి, చెరకు, అరటి పంటలను విజయరామ్ సాగు చేస్తుండటమే నిదర్శనమని ప్రశంసించారు. రైతులు తలా ఒక ఎకరంలో ఈ పద్ధతిలో సాగు చేసి ఫలితాలు స్వయంగా సరిచూసుకోవచ్చన్నారు. ఆరు తడి దేశీ వరిలో అంతర పంటలు ప్రత్యేకతలు, పంటకాలం, దిగుబడి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని రత్నచోడి, తులసిబాసో, బహురూపి, మాపిలైసాంబ, చెకో, మైసూర్ మల్లిగా, నారాయణ కామిని, నవారా, కర్పుకొని వంటి దేశీ వరి రకాలను కొన్ని మడుల్లో విజయరామ్ ఈ ఖరీఫ్‌లో సాగు చేశారు. కొన్ని వరి రకాల్లో అంతర పంటలు వేశారు. అంతర పంటలు వేయని వరి రకాల్లో సాళ్లకు, మొక్కలకు మధ్య అడుగున్నర దూరం పెట్టారు. అంతర పంటలు వేసిన వరి పొలంలో వరుసల మధ్య 3 అడుగుల దూరం పెట్టారు. బురద పొలంలో ఎకరానికి 100–200 కిలోల ఘన జీవామృతం వేస్తారు. అవకాశం ఉన్న రైతులు ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం వేస్తే మరీ మంచిది. భూమిలో తేమను పట్టి ఉంచడానికి, పంట త్వరగా బెట్టకు రాకుండా ఉండటానికి ఘనజీవామృతం చాలా ఉపయోగపడుతుందని, సకల పోషకాలూ అందుతాయని విజయరామ్ వివరించారు. 14–15 రోజులు పెంచిన నారును కుదురుకు ఒకే మొక్కను నాటుతారు. వరికి 20 రోజులకో తడి రత్నచోడి వరిలో నాటిన పొలంలోనే తోటకూర జాతికి చెందిన అమరంతస్ ధాన్యపు పంటను అంతర పంటగా వేశారు. నెల క్రితమే రత్నచోడి కోతలు పూర్తవగా ఇప్పుడు అమరంతస్ కోతకు సిద్ధమవుతోంది. కర్పుకౌని దేశీ వరిలో సాళ్లు/మొక్కల మధ్య 2 అడుగుల దూరం పెట్టారు. గతంలో వేరు శనగను అంతరపంటగా వేశారు. అయితే, అక్టోబర్‌లో శనగను అంతర పంటగా వేసి ఉంటే నత్రజని బాగా అందేదని పాలేకర్ సూచించారు. మాపిళ్లైసాంబ రకం ఆరు తడి వరిలో దుబ్బుకు 40–60 పిలకలు వచ్చాయి. ఆరు తడి పంటకు 20 రోజులకు ఒకసారి నీటి తడి ఇచ్చామని విజయరామ్ తెలిపారు. పాలేకర్ సూచించిన విధంగా వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో అక్టోబర్‌లో శనగను వరిలో అంతర పంటగా వేస్తామన్నారు. ఆరుతడిగా సాగు చేయడం వల్ల వరిలోనూ ఎద్దులతో 2,3 సార్లు గుంటక తోలటం ద్వారా కలుపు ఖర్చును తగ్గించుకోవడం సాధ్యమైందని అన్నారు. గన్నీ బాగ్స్‌ను కూడా ఆచ్ఛాదనగా వాడొచ్చు 6 అడుగుల దూరంలో కర్పూర అరటి, చెక్కర కేళిలను 20 రోజులకోసారి తడి ఇస్తూ సాగు చేస్తున్నారు. గడ్డీ గాదాన్ని సాళ్ల మధ్యలో ఆచ్ఛాదనగా వేశారు. మొక్కల మొదళ్లలో తేమ ఆరినా.. ఆచ్ఛాదన అడుగున తేమ బాగా ఉంటున్నదని తెలిపారు. రైతులకు అందుబాటులో ఉన్న ఏ సేంద్రియ పదార్థాన్నయినా ఆచ్ఛాదనగా వేయొచ్చునని పాలేకర్ అన్నారు. కందికి ఒకసారే జీవామృతం మచ్చల కంది సహా ఆదిలాబాద్‌కు చెందిన నాటు రకాల కందులను 7 అడుగుల దూరంలో సాళ్లుగా, అర అడుగుకు ఒక విత్తనం పడేలా నాగళ్లతో ఎకరంన్నర నల్లరేగడి భూమిలో విత్తారు. విత్తనానికి ముందు ఎకరానికి 200 కిలోల వరకు ఘనజీవామృతం వేశారు. ద్రవజీవామృతం ఒకేసారి అందించగలిగామని, అయినా కంది విరగ కాసిందని, చెట్టుకు అరకేజీ వరకు దిగుబడి రావచ్చని విజయరామ్ తెలిపారు. 4.5 నెలల్లో చెరకుకు ఒకే తడి ఎకరం భూమిలో విజయరామ్ అతి తక్కువ నీటితో చెరకును సాగు చేస్తున్నారు. నాలుగున్నర నెలల క్రితం సాళ్ల మధ్య 8 అడుగులు, మొక్కల మధ్య అడుగు దూరంలో చెరకు ముచ్చెలు నాటారు. అంతర పంటలుగా కాకర, లంక దోస నాటారు. దీంతో తోటలో ఎక్కడా నేల కనపడకుండా కాకర తీగలు అల్లుకుపోయాయి. ఇప్పటికి కేవలం 2 సార్లు జీవమృతం ఇచ్చారు. గత నెలలో ఒకే సారి నీటి తడి ఇచ్చినప్పటికీ తోట బెట్టకు రాకపోవడం విశేషం. అయితే, చెరకు సాళ్ల మధ్య అలసంద కూడా వేయటం అవసరమని, నత్రజని లోపం రాకుండా ఉంటుందని పాలేకర్ సూచించారు. ఇప్పటికైనా అలసంద గింజలు వేయమని సూచించారు. ఆచ్ఛాదనకు కాదేదీ అనర్హం ప్రకృతి వ్యవసాయంలో జీవామృతంతోపాటు అంతరపంటలు, ఆచ్ఛాదన కూడా రైతులు పాటించాల్సిన చాలా ముఖ్య అంశమని పాలేకర్ అన్నారు. చెరకు పిప్పి, కొబ్బరి బొండం డొక్కలు, కొబ్బరి మట్టలు, గడ్డీ గాదంతోపాటు వ్యాపారుల వద్ద తక్కువ ధరకు లభించే వాడేసిన గన్నీ బ్యాగులు, పాత నూలు వస్త్రాలు సైతం ఆచ్ఛాదనగా వేయొచ్చని అన్నారు. తీవ్ర కరువులోనూ రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేసిన పంటలు ఎండిపోతుంటే.. ప్రకృతి వ్యవసాయదారుల పంటలు కళకళలాడుతుండటం రైతులంతా గుర్తించాలన్నారు. దేశీ వరి వంగడాలను దిగుబడి దృష్ట్యా కాకుండా ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా సాగు చేస్తూ పరిరక్షించుకోవడం అవసరమని అంటున్న విజయరామ్ను 040–27635867, 99491 90769 నంబర్లలో సంప్రదించవచ్చు. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ 7 అడుగులు పెరిగిన కంది చేనులో విజయరామ్, చెరకు తోటలో దట్టంగా అల్లుకున్న కాకర తీగలు, అరటి తోటలో పాలేకర్ -
పొలం బాటలో.. పట్టభద్రుడు
ఇంజినీరింగ్ చదివిన ఏ కుర్రాడైన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనుకుంటాడు. కంపెనీలు ఇచ్చే ప్యాకేజీలతో తన ప్రతిభను కొలమానంగా వేసుకుంటారు. అయితే మదనపల్లెకు చెందిన ఆదర్శ రైతు ఎం.సి.వి. ప్రసాద్ దీనికి పూర్తి భిన్నం. తాను సంపాదించిన జ్ఞానం వ్యవసాయాభివృద్ధికి ఉపయోగపడాలని పరితపించాడు. తండ్రి ఇచ్చిన పొలంలో వ్యవసాయం మొదలుపెట్టాడు. ఖర్చులేని వ్యవసాయం(జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్) చేస్తూ అద్భుతాలు సాధిస్తున్నాడు. మదనపల్లె సిటీ: చదువు జ్ఞానాన్నిస్తుంది. సేద్యం ఆహారాన్ని అందిస్తుంది. ఆ రెండూ కలిస్తే అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయని నిరూపిస్తున్నాడు మదనపల్లెకు చెందిన ఆదర్శ రైతు ఎం.సి.వి.ప్రసాద్. చదువుకుంది సివిల్ ఇంజినీరింగ్. బెంగళూరులోని ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం. ఇవేవి అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. నేల తల్లికి ఏదో చేయాలని పరితపించేవాడు. అందుకే ప్రేమతో హలం పట్టాడు. అనుభవ పాఠాలతో పాటు నాన్న పద్మనాభరెడ్డి ఇచ్చిన 80 ఎకరాల భూమిలో వ్యవసాయ పనులు మొదలు పెట్టాడు. మహారాష్ట్రకు చెందిన రైతుభాందవుడు సుభాష్‌పాలేకర్ బాటలో పయనిస్తున్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఖర్చులేని వ్యవసాయం (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ) అమలు చేస్తున్నారు. తండ్రి వ్యవసాయంలో దిట్ట. మొట్టమొదట మదనపల్లెకు టమాట పంటను పరిచయం చేశారు. తండ్రి బాటలో పయనిస్తూ అద్భుతాలు సాధిస్తున్నారు. మదనపల్లె సమీపంలోని చిన్నతిప్పసముద్రం(సీటీఎం) వద్ద ప్రసాద్‌కు 80 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడ అడుగుపెడితే చాలు వ్యవసాయానికి కొత్త జీవనాన్ని అందిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఖర్చులేని వ్యవసాయం ఆయన సొంతం2008లో మహారాష్ట్రకు చెందిన సుభాష్‌పాలేకర్ అనే వ్యవసాయవేత్త తిరుపతికి వచ్చారు. ఖర్చులేని ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. దీనికి ఆకర్షితులైన ప్రసాద్ అదే బాటలో పయనిçస్తున్నారు. రసాయన, సేంద్రియ ఎరువుల అవసరం లేకుండా పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరిస్తున్నారు. 80 ఎకరాల తన క్ష్రేతంలో మిరప, టమట, చెరకు, సజ్జ, గోధుమ, మొక్కజొన్న, వంగ, మొక్కజొన్న, వేరుశనగ, కందులు, మినుములు పండిస్తున్నారు. కూరగాయల సాగు కోసం పాలిçహౌస్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు దానిమ్మ, ఉసిరి, అల్లనేరేడు, జామ వంటి పండ్లను పండిస్తున్నారు. ఈ విధానంలో బీజామృతం, జీవామృతం,ç బ్రహ్మాస్త్రం వంటి వాటిని ఉపయోగించి ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని నిరూపించారు. ఈ విధానం వల్ల తక్కువ పెట్టుబడి, పర్యావరణ పరిరక్షణ, భూసారం పెరుగుదల, నీటి వనరుల పొదుపు వంటి వాటిని సాధించవచ్చు. 2008కి ముందు ఏటా సుమారు రూ.10 లక్షల పెట్టుబడి పెట్టిన ప్రసాద్‌కు పాలేకర్ విధానానికి మారిన తర్వాత అలాంటి అవసరమే లేకుండా పోయింది. ఇదంతా కేవలం దేశవాళీ ఆవులను నమ్ముకోవడం వల్ల కలిగిన లాభమంటారు. చెరకు: ఏడెకరాల్లో చెరకు సాగు చేశారు. బెల్లం తయారీ చేసి విక్రయిస్తూ ఎకరాకు రూ.1.5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. ఎకరాకు రూ. 70 వేలు ఖర్చు చేస్తున్నారు. లెమన్‌గ్రాస్: ఆరు ఎకరాల్లో లెమన్‌గ్రాస్ సాగు చేశారు. పంట నుంచి నూనె తీసేందుకు స్టీమ్ డిస్టిలేషన్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఎకరా పంటకు దాదాపు 250 లీటర్ల వరకు నూనె వస్తుంది. మార్కెట్లో కిలో నూనె రూ.1000 వరకు ఉంటుంది. ఈ çపంట సాగు ద్వారా రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పామారోజా, దవనం, సిట్రోనెల్లా, వట్టివేర్లు, తులసి, లావెండర్ వంటి సుగంధ ఔషద మొక్కలు సాగు చేస్తున్నారు. వ్యవసాయక్ష్రేతంలో ఎనిమిది రకాల దేశవాళీ ఆవులను పోషిస్తున్నారు. వాటి పేడ, మూత్రంతో జీవామృతం తయారు చేసి భూసారాన్ని పెంచేందుకు ఎరువుగా వినియోగిస్తున్నారు. తెగుళ్ల నివారణకు బ్రహ్మాస్త్రం (వేప, కానుగ, సీతాఫలం, ఉమ్మెత్త, జిల్లేడు, వావిలాకులను 15 లీటర్ల గోమూత్రంలో ఉడికించి తయారు చేసి వినియోగిస్తున్నారు. గోఆధారిత కషాయాల ద్వారా పంటలకు సోకే సమస్త రోగాలను నివారిస్తున్నారు. యాంత్రీకరణకు తోడు బిందు పద్ధతిలో పంటలకు నీరందిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. సాగులో ఆధునిక, సేంద్రియ పద్ధతులను మేళవిస్తూ పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తున్నారు. ప్రకృతివనం: ప్రకృతివనం పేరుతో 52 రకాల సేంద్రియ ఉత్పత్తులను విక్రయిస్తూ 55 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. విద్యార్థుల సందర్శన.. వ్యవసాయ క్షేత్రాన్ని వివిధ వ్యవసాయ, ఉద్యాన విద్యార్థులు క్షేత్రస్థాయి పరిశోధనకు వస్తుంటారు. ఏపీతో పాటు కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు సందర్శిస్తున్నారు. సెలేషియా మొక్కలు పెంపకం.. వ్యవసాయ క్ష్రేతంలో మధుమేహ మందుకు పని కివచ్చే సెలేషియా మొక్కల పెంపకం చేపట్టారు. దాదాపు ఎనిమిది ఎకరాల్లో మొక్కలు పెంచుతున్నారు. జపాన్‌కు చెందిన టకామా కంపెనీతో దీన్ని ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు. అవార్డులు: ♦ దవనం మొక్కలను అత్యధికంగా సాగు చేయడంతో 2005లో సీఎస్ఐఆర్ ఉన్నతి అవార్డును అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ నుంచి అందుకున్నారు. ♦ 2011లో ఉత్తమ తైల యూనిట్ నిర్వహణకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ ఆర్థోపెడిక్ సంస్థ అవార్డు అందుకున్నారు. ♦ 2011లో ఏపీ ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్ అవార్డును పొందారు. ♦ 2013లో మానవత ఫౌండేషన్ అఛీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ♦ 2013 సుబ్బారావు ఉత్తమ రైతు అవార్డు ప్రకృతి వ్యవసాయమే సరైన మార్గం రైతులు ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభానికి పాలేకర్ చెబుతున్న జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయమే సరైన మార్గం. 700 అడుగుల బోర్ వేస్తే తప్ప నీటి చుక్క జాడ దొరకని ప్రాంతంలో పాలేకర్ విధానాల వల్లే లాభసాటి ప్రకృతి వ్యవసాయం చేయడం సాధ్యం. సతీమణి యోగిత, స్నేహితుడు గుణశేఖర్లు పూర్తి సహాయ సహకాలు అందిస్తున్నారు. –ఎం.సి.వి.ప్రసాద్. -
సాగుకు ఉత్తమ మార్గం.. ప్రకృతి సేద్యం
– విదేశీ పద్ధతులు విడనాడకుంటే సాగు వినాశనమే – నీటి కోసం యుద్ధం తప్పదు – ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ తిరుపతి తుడా/అలిపిరి : ‘మితిమీరి రసాయనాలను వినియోగించి భూ గర్భాన్ని కలుషితం చేశాం. హరిత విప్లవంతో మన దేశీయ విత్తన సంపదను పోగొట్టుకున్నాం. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయానిదే భవిష్యత్తు. సాగుకు ఉత్తమ మార్గం కూడా అదే.’ అని ప్రకృతి వ్యవసాయ నిపుణులు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. చివరిరోజు శిక్షణలో ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు గో ఆధారిత ప్రకృతి సేద్యానికి పూనుకోకతప్పదని హెచ్చరించారు. అధిక దిగుబడులు ఆశించి, సంకరజాతి విత్తనాల కోసం పాకులాడి అధిక రసాయనాలను ఏ స్థాయిలో వినియోగిస్తే అదే స్థాయిలో రైతు అన్ని రకాలుగా నష్టపోకతప్పదన్నారు. ఇప్పటికే భూమిలోని సూక్ష్మజీవులు క్షీణ దశకు చేరాయని, ఇంకా రసాయనాల వినియోగం కొనసాగిస్తే సూక్ష్మజీవులను పూర్తి స్థాయిలో కోల్పోక తప్పదన్నారు. అదే పరిస్థితి తలెత్తితే ఆ తరువాత సాగుకు దారే ఉండదని చెప్పారు. ముందుగా మేల్కొని ప్రకృతి వ్యవసాయన్ని కొనసాగిస్తే పంట ఎదుగుదలకు దోహదపడే సూక్ష్మజీవులను వృద్ధి చేసుకుని పూర్వ వైభవాన్ని అందుకోవచ్చని సూచించారు. అజ్ఞానంలో ఉంటూ విదేశీ సాగు విధానాలను విడనాడకుండా ఉంటే వ్యవసాయానికి వినాశనం తప్పదని హెచ్చరించారు. మూడో ప్రపంచ యుద్ధమంటూ జరిగితే అది నీటి కోసమే ఉంటుందన్నారు. ఇందుకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య జరుగుతున్న కావేరి జల వివాదమే ఇందుకు సాక్షమని చెప్పుకోవచ్చని అన్నారు. ప్రకృతిలో ఉన్నది విజ్ఞాన శాస్త్రమని, మానవుడు సృష్టించింది సాంకేతిక శాస్త్రమన్న విషయాన్ని రైతులు గుర్తించాలన్నారు. మట్టిలో ‘వాపస’ ప్రక్రియ జరగకుండా మొక్కలకు ఎంత నీరు అందించినా ఎదుగుదల ఉండదన్నారు. అవగాహనతోనే అధిక దిగుబడి వరి, కూరగాయల పంటల్లో అధిక దిగుబడులు ప్రకృతి సేద్యంతోనే సాధ్యమవుతుందని పాలేకర్ అన్నారు. జీవామృతం, ఘన జీవామృతం, బీజామృతం ఉపయోగించి వరి, కూరగాయల పంటల్లో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే పద్ధతుల గురించి ఆయన వివరించారు. మండల స్థాయిలో నిర్వహిస్తాం వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై రైతులు ఆసక్తి చూపుతున్నారన్నారు. నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమంలో రైతులు ఎంతగానో ఉత్తేజితమయ్యారని తెలిపారు. పాలేకర్ సూచనలు పాటిస్తామంటూ రైతులు చెబుతున్నారని, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై మండల స్థాయిలో 9 రోజుల శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. మారుతున్న కాలానుగుణంగా శాస్త్రీయ వ్యవసాయ విధానాలు అవలంభించాలన్నారు. రైతులను సంక్షోభం నుంచి బయట పడేయగలిగే ఏకైక మార్గం పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయమే అన్నారు. -
ప్రకృతి సేద్యంతోనే స్వయం సమృద్ధి
– జీవామృతానిదే భవిష్యత్తు – రసాయన, సేంద్రియ ఎరువుల వాడకం నిషేధించండి – సుభాష్ పాలేకర్ పిలుపు తిరుపతి తుడా/అలిపిరి: ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంభించినప్పుడే భారతదేశం స్వయం సమృద్ధి సాధించగలదని ప్రకృతి వ్యవసాయ నిపుణులు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ అన్నారు. తిరుపతి వేదికగా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’పై జరుగుతున్న శిక్షణ కార్యక్రమం రెండో రోజైన సోమవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారవంతరమైన మన భూమి బంజరుగా మారడానికి రసాయన ఎరువుల వాడకమే కారణమన్నారు. దేశ జనాభా 123 కోట్ల మైలురాయిని దాటిందని, ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం 2050 సంవత్సరానికి 165 కోట్లు దాటే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో ఏడాదికి 25 కోట్ల మెట్రిక్ టన్నులు ఆహార పదార్థాల ఉత్పత్తి జరుగుతోందన్నారు. అయితే 2050 నాటికి 50 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాల ఉత్పత్తి జరగాల్సిన అవసరం ఉందన్నారు. మరి దిగుబడి తగ్గుతున్న ఈ రోజుల్లో 50 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం ద్వారానే ఆహార భద్రత సాధ్యమవుతుందన్నారు. జీవామృతం ద్వారా చేపట్టే ప్రకృతి వ్యవసాయానిదే భవిష్యత్తు అని గుర్తు చేశారు. రైతులు ముందుకు వచ్చి రసాయన ఎరువుల వాడకాన్ని నిషేధించాలని సూచించారు. రసాయన ఎరువులు మోతాదుకు మించి వినియోగించడంతోనే సారవంతమైన మన భూమి కలుషితం అయ్యిందన్నారు. తద్వారా పంట దిగుబడులు తగ్గి పెట్టుబడులు భారానికి మించిపోయిందని చెప్పారు. ‘కేశాకర్షణ శక్తి’తోనే మొక్కల ఎదుగుదల మొక్కల్లో సహజ సిద్ధంగా కేశాకర్షణ శక్తి దాగి ఉంటుందని, దానికి ఎటువంటి విఘాతం కలిగించకుంటే మొక్క ఎదుగుదల వేగంగా ఉంటుందని ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ తెలిపారు. మట్టి కణాల మధ్య ఖాళీలు ఉంటాయని, వాటి ద్వారానే మొక్క వేర్లకు పోషకాలు, నీరు అందుతుందన్నారు. రసాయన ఎరువులు వాడకం వల్ల మట్టిలోని ఖాళీల్లో రసాయన లవణాలు భర్తీ అయ్యి మొక్కల పెరుగుదలకు అవరోధంగా మారుతుందన్న సత్యాన్ని రైతులు గమనించాలని కోరారు. అలాగే వానపాముల విసర్జనాల్లో దాగి ఉన్న పోషకాల గురించి రైతులకు వివరించారు. జీవామృతంతో సూక్ష్మజీవుల అభివృద్ధి వ్యవసాయ పెట్టుబడులు తగ్గించి, అధిక ఆరోగ్యవంతమైన దిగుబడులు సాధించాలంటే జీవామృతంతోనే సాధ్యమవుతుందని సుభాష్ పాలేకర్ చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో జీవామృతాన్ని తయారు చేసుకోవచ్చన్నారు. పంట ఎదుగుదలకు కావాల్సిన సూక్ష్మ జీవులను జీవామృతం తగిన మోతాదులో అందించే సత్తా ఉంటుందని చెప్పారు.