suburban trains
-
నడిచే రైలులో కత్తులతో అలజడి..!
సాక్షి, తిరువళ్లూరు(చెన్నై): ఫ్యాక్షనిస్టు సినిమాల తరహలో నడిచే రైలులో కత్తులను తిప్పుతూ అలజడి రేపిన నలుగురు కాలేజ్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై నుంచి తిరుత్తణి వెళ్తున్న యూనిట్ రైలులో డోర్ల వద్ద వేలాడుతూ.. కొందరు యువకులు కత్తులు చూపిస్తూ నానా హంగామా సృష్టించారు. రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. పలు టీవీ చానళ్లు ఈ ఘటనపై కథనాలు ప్రసారం చేశాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు ఆయుధాలతో హడావుడి చేసిన విద్యార్థులను గుర్తించేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో పట్టాభిరామ్ రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న చెన్నై కళాశాల విద్యార్థి దండపాణిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు తెలిపిన వివరాల మేరకు తిరువళ్లూరు జిల్లా పాక్కం గ్రామానికి చెందిన విఘ్నేష్, జగదీషన్, బాలమురళీకృష్ణన్ తదితరులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయుధపూజ చేయాలన్న ఉద్దేశంతోనే కత్తులతో ప్రయాణించినట్టు విద్యార్థులు తెలిపారు. అయితే, ప్రత్యర్థి వర్గం వారిని భయపెట్టడానికే వారు కత్తులతో సంచరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నలుగురిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి పుళల్ జైలుకు తరలించారు. -
నడిచే రైలులో కత్తులతో అలజడి..!
-
ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు
భారీ వర్షాలు ముంచెత్తుతుండడంతో ముంబైలో జనజీవనం స్తంభించింది. పుణె, నాసిక్‌లలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో శాంతాక్రజ్‌లో 94.4 మి.మీ, కొలాబాలో 48.3 మి.మీల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వచ్చే 24 గంటల్లో కూడా ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. దాదర్, పరెల్, వొర్లిలో లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు నిలవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ట్రాక్‌లపై నీరు నిలవడంతో సబర్బన్ రైళ్లు షెడ్యూల్ కంటే 15-20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
తడిసిన ముంబై.. ఆగిన ట్రాఫిక్
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం సహా.. పశ్చిమ మహారాష్ట్ర, ఇతర తీరప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. రుతుపవనాలు దాదాపు మూడు వారాలు ఆలస్యమైనా.. బుధవారం మాత్రం ఉన్నట్టుండి భారీ వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. రైళ్ల రాకపోకలపై కూడా వర్షం ప్రభావం గట్టిగానే పడింది. లోతట్టు ప్రాంతాలు చాలావరకు నీట మునిగిపోయాయి. ముంబై పశ్చిమ ప్రాంతంలోని ఎస్వీ రోడ్డు లాంటి చోట్ల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వెస్ట్రన్ రైల్వే, సెంట్రల్ రైల్వే, హార్బర్ లైన్ లాంటి మార్గాల్లో సబర్బన్ రైళ్లు కూడా చాలాచోట్ల నిలిచిపోయాయి. ఈస్ట్రన్, వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ వేలలో కూడా ట్రాఫిక్ బాగా నిలిచిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని, ఇవి మరికొన్ని రోజుల పాటు కొనసాగుతాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వీకే రాజీవ్ తెలిపారు. ముంబైతో పాటు మహారాష్ట్రలోని థానె, రాయగఢ్, రత్నగిరి, సింధుదుర్గ్, నాసిక్, అహ్మద్ నగర్, సతారా జిల్లాల్లో కూడా భారీగానే వర్షాలు కురిశాయి. మధ్యాహ్నానికి ముంబై నగరంలో 105 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నీటిసరఫరాలో కోత విధించాలన్న యోచనను గ్రేటర్ ముంబై కార్పొరేషన్ తాత్కాలికంగా విరమించుకుంది.