successful test runs
-
చైనా స్వదేశీ విమానం సక్సెస్
బీజింగ్: చైనా మొట్టమొదటి సారిగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రయాణికుల విమానం సీ919 ఆదివారం విజయవంతంగా ప్రయాణించింది. విమానయాన రంగం మార్కెట్లోకి డ్రాగన్ దేశం అధికారికంగా ప్రవేశించింది. పశ్చిమదేశాలకు చెందిన బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థలతో పోటీ పడేలా చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల విమానాన్ని తయారు చేసింది. తొలిసారిగా షాంఘై నుంచి బీజింగ్‌కు వెళ్లిన ఈ విమానం రెండున్నర గంటల్లో సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. -
మరోసారి సత్తా చాటిన ‘అగ్ని–5’
సాక్షి, విశాఖపట్నం: అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణి ప్రయోగం మరోసారి విజయవంతమైంది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్‌లో బుధవారం రాత్రి 7.50 గంటలకు ఈ ప్రయోగం నిర్వహించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ క్షిపణి నిర్దేశిత పూర్తి దూరం ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించినట్లు ఒక ప్రకటనలో తెలియజేశాయి. 5,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై అలవోకగా విరుచుకుపడే సామర్థ్యం అగ్ని–5 క్షిపణి సొంతం. ఇప్పటివరకూ అగ్ని–5ని ఏడుసార్లు ప్రయోగించారు. ప్రతిసారీ విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. దేశంలో మొట్టమొదటి, ఏకైక ఖండాంతర క్షిపణి అగ్ని–5ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) సిద్ధం చేసింది. -
డ్రైవర్ లేని బస్సు వచ్చేసింది..
బీజింగ్: డ్రైవర్‌లేని బస్సు వచ్చేసింది. చైనాలో ఈ బస్సును విజయవంతంగా పరీక్షించారు. గత ఆగస్టులో హెనాన్ ప్రావిన్స్‌లోని జెంగ్‌ఝౌ సిటీ-కైఫెంగ్ సింటీ ఇంటర్ సిటీ రోడ్డులో 32.6 కిలో మీటర్లు దూరం మేర సురక్షితంగా ప్రయాణించింది. యుటాంగ్ బస్ కంపెనీ లిమిటెడ్ రూపొందించిన ఈ డ్రైవర్ రహిత బస్సు అన్ని పరీక్షల్లో విజయవంతమైంది. ఇంటర్ సిటీ రోడ్డుపై ఆటోమేటిక్‌గా లేన్స్ మార్చుకోవడం.. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగడం.. వాహనాలను ఓవర్టేక్ చేయడం వంటి పరీక్షలను పూర్తి చేసింది. బస్సులో రెండు కెమెరాలు, నాలుగు లేజర్ రాడార్లు, మిల్లీమీటర్ వేవ్ రాడార్ సెట్, నావిగేషన్ సిస్టమ్‌ను అమర్చారు. వీటి సాయంతో బస్సు నడుస్తుంది. యుటాంగ్ కంపెనీ మూడేళ్ల క్రితం డ్రైవర్ రహిత బస్సును తయారు చేయడానికి పరిశోధనలు మొదలుపెట్టింది. ఈ బస్సును వాడుకలో తీసుకురావాలంటే సాంకేతికను మరింత అభివృద్ధి చేయడంతో పాటు ప్రభుత్వ మద్దతు అవసరమని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.