మహాగణపతి నిమజ్జన యాత్రా ఇలా..
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తైతే.. వినాయక నిమజ్జనం పూర్తైందని పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకునే వారు. కానీ ఈ సారి మహాగణపతి నిమజ్జనం ముందే చేయాలని పోలీసులతో పాటు.. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించారు. 15వ తేదీ సాయంత్రం 3గంటల్లోపు మహాగణపతి నిమజ్జనం పూర్తిచేయాలని రంగం సిద్ధం చేస్తున్నారు. 58 అడుగుల ఎత్తులో శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి భక్తులకు ఈ సంవత్సరం విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇరువైపులా రెండు శక్తిపీఠాలతో మహాగణపతిని భక్తులు దర్శించుకున్నారు.
గంగాయానం ఇలా..
13వ తేదీ ఉదయం నుంచే పని ప్రారంభించిన షెడ్డు టీం 25 మంది సుధాకర్ నేతృత్వంలో 14 సాయంత్రం వరకు మహాగణపతి షెడ్డును తొలగించింది. మహాగణపతిని నిమజ్జనానికి తరలించే ఎస్టీసీ ట్రాన్‌సపోర్ట్‌కు చెందిన ట్రయిలర్ వాహనానికి పీడబ్ల్యూ వర్క్‌షాప్ పిట్టర్ టెక్నీషియన్ బి.మహేష్ ఆధ్వర్యంలో పది మంది వెల్డింగ్ పనులు పూర్తిచేశారు. సాయంత్రం వినాయక విగ్రహానికి వెల్డింగ్ పనులు నిర్వహించేందుకు రంగం సిద్దం చేశారు.
రథసారధి ఎం. వెంకటరెడ్డి..
ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి తరలించేందుకు ఎస్టిసి కంపెనీలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎం.వెంకట్‌రెడ్డి డ్రైవర్‌గా విధులు నిర్వహించనున్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వెంకట్‌రెడ్డి ఈ సారిగా మహాగణపతి రథసారధిగా గణనాథుణ్ణి నిమజ్జనానికి తరలించనున్నాడు.
ట్రయిలర్ వాహనం...
తొమ్మిదేళ్లుగా మహాగణపతి నిమజ్జనానికి తరలించేందుకు ఉపయోగించే ట్రయిలర్ వాహనానికి (ఎపి16 టిడి 4059) 49 టన్నుల బరువు మోసే సామర్థం ఉంది. 26 టైర్లు, 70 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు ఉండే వాహనం దాదాపు 40 టన్నుల బరువున్న మహాగణపతిని నిమజ్జనానికి తరలించనుంది. మహాగణపతి ఇరువైపులా ఉన్న కుడివైపు కలియుగ వేంకటేశ్వరుడు, ఎడమవైపు ఉన్న ‘‘శ్రీ భాలాజీ బృందావన సహిత గోవర్థనగిరి’’ విగ్రహాలను నిమజ్జనానికి శ్రీలక్మీనర్సింహ స్వామి ట్రాన్‌సపోర్ట్‌కు చెందిన బాబీ సమకూర్చే వాహనంలో నిమజ్జనానికి తరలిస్తారు.
హైడ్రాలిక్ టెలిస్కోప్ హెవీ మొబైల్ క్రేన్ సామర్థం......
గత 11 సంవత్సరాలుగా ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం కోసం తరలించేందుకు రవి క్రేన్సకు చెందిన హైడ్రాలిక్ టెలిస్కోప్ హెవీ మొబైల్ క్రేన్‌ను ఇస్తున్నట్లు ఎం.డి. కె.వి. రావు తెలిపారు. ఈ జర్మనీలో తయారైన క్రేన్ బరువు 110 టన్నులు, 150 టన్నుల బరువును అవలీలగా పైకి ఎత్తగలదు. క్రేన్ జాక్ 50 మీటర్ల పైకి వెళ్తుంది. వెడల్పు 11 పీట్లు, పొడవు 60 పీట్లు ఉంటుంది. దీనికి 12 టైర్లు ఉంటాయి. ఒక్కో టైరు ఒక టన్ను బరువు 2 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీనికి 4 హై6డాలిక్ జాక్‌లు ఉంటాయి. 45 టన్నుల బరువున్న ఖైరతాబాద్ వినాయకుడిని క్రేన్ సునాయాసంగా తరలించగలదు. ఈ క్రేన్‌ను మహ్మద్ జమీల్ అపరేట్ చేస్తాడు.
బారీ క్రేన్ ఆపరేటర్ మహ్మద్ జమీల్......
రవి క్రేన్‌స ఆధ్వర్యంలో ప్రతీ సంవ్సరం మహాగణపతిని ట్రయిలర్ వాహనంపైకి పెట్టడం, తిరిగి నిమజ్జనం చేయడం అంతా మహ్మద్ జమీల్ నిర్వహిస్తాడు. వేల మంది భక్తులు చూస్తుండగా మహాగణపతిని క్రేన్ సాయంతో గాల్లోకి ఎత్తి.. వాహనంపై ఆసీనుడయ్యే లా చేయడం నాకు సంతోషాన్ని ఇస్తుంది అంటారు జమీల్.
నిమజ్జన ఏర్పాట్లు....
14వ తేది అర్థరాత్రి 12గంటలకు సింగరి సుదర్శన్ కుటుంబ సభ్యులు కలశం పూజ నిర్వహిస్తారు. ఆ తరువాత 1గంట నుంచి తెల్లవారు జామున 5గంటల వరకు మహాగణపతికి వెల్డింగ్ పనులు, బారీ క్రేన్‌కు మహాగణపతిని అమర్చడం, వాహనంపై పెట్టి మరలా వెల్డింగ్ పనులు చేస్తారు. 5-6 గంటల మధ్య వాహనానికి అలంకరణ చేసి 15వ తేది ఉదయం 6గంటల కల్లా మహాగణపతి నిమజ్జనానికి సిద్దంగా ఉండేలా చూస్తామని ఉత్సవ కమిటి సభ్యులు సందీప్ తెలిపారు. ఉదయం 6గంటల నుంచి శోభాయాత్ర ప్రారంభమై 9గంటల కల్లా ఎన్టీఆర్ మార్గ్‌లోని 4వ నెంబర్ క్రేన్ వరకు చేరుకుంటుంది. 9-12 గంటల వరకు క్రేన్ సెట్టింగ్, వెల్డింగ్ కట్ చేయడం పనులు పూర్తచేసుకున్న తరువాత మరో గంట సేపు పూజా, సన్మాన కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 2-3 గంటల మధ్య (సూర్యాస్తమయం లోపు) మహాగణపతిని నిమజ్జనం చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
మహాగణపతి రూట్ మ్యాప్.....
ఖైరతాబాద్ మంటపం నుంచి సెన్షేషన్ థీయేటర్ మీదుగా రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, హోంసైస్స్ కళాశాల మీదుగా ఇక్బాల్ మినార్ చౌరస్తా, సచివాలయం పాతగేటు అక్కడి నుంచి తెలుగుతల్లి చౌరస్తా వరకు రాగానే అక్కడ ఎడమ వైపుకు మలుపు తిరిగి లుంబినీ పార్క్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌లోని 4వ నెంబర్ క్రేన్ వరకు చేరుకుంటుంది.
మహాగణపతికి భారీ బందోబస్తు......
నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డీసీపీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో ఖైరతాబాద్ మహాగణపతికి బారీబందోబస్తు ఏర్పాటుచేశారు. 10రోజుల పాటు 200 మంది పోలీసులతో పాటు ముగ్గురు ఏసీపీలు, 6మంది ఇన్సస్పెక్టర్లు, 12మంది ఎస్ఐలు విధులు నిర్వహించారు. నిమజ్జనం రోజు అదనంగా మరో 200 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటారని సైఫాబాద్ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్ తెలిపారు.