ఊరంతటికీ టీచర్లు
ఆదర్శం
గురువుది పాఠాలు చెప్పి ఊరుకునే మనస్తత్వమే అయితే పల్లెటూరి విద్యార్థులు పెద్దచదువులు చదవలేరు. బడికి వచ్చినవారికే నాలుగక్షరాలు నేర్పి పుస్తకం మూసేస్తే గ్రామం ఎన్నటికీ అభివృద్ధికి నోచుకోదు. పిల్లలకు చదువుతోబాటు దాని విలువ కూడా తెలియజెప్పే గురువులు కావాలి. ప్రైవేట్, కాన్వెంట్ చదువులదే రాజ్యమైన ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉన్నారు. విద్యకు దూరంగా ఉన్నవారిని బడికి తీసుకొచ్చి బుద్ధులు నేర్పే ఉపాధ్యాయులున్నారు కనుకనే మారుమూల పల్లెల నుంచి మంచి ముత్యాలు పుట్టుకొస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో కొత్తకోటపాడు గ్రామంలో ఓ ఇద్దరు ఉపాధ్యాయులు ఇటు పిల్లల్నీ, అటు తల్లిదండ్రుల్నీ కూడా విద్యావంతులుగా మారుస్తున్న వైనం తెలిస్తే వారికి చేతులెత్తి మొక్కకుండా ఉండలేం.
గరిమెళ్ల అరుణ... కొత్తకోటపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని. సుధాలత టీచర్. ఐదు తరగతులకు వీళ్లిద్దరే టీచర్లు. ఈ ఇద్దరు టీచర్లు ఆ పాఠశాలకొచ్చి రెండేళ్లు దాటింది. ‘‘నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో పాఠశాలను, పిల్లల్ని చూసి చాలా ఆందోళనపడ్డాను. వీరికి కేవలం పాఠాలు మాత్రమే చె ప్పి వదిలేస్తే సరిపోదని మొదటిరోజే అర్థమయింది. దీనికి తోడు ఆ ఊరిలో ఎవరికీ కూడా చదువుపై పెద్దగా శ్రద్ధ లేదని తెలిసింది.
‘మాకు చదువు ముఖ్యం కాదు, ఏదో పిల్లలు నీడపట్టున ఉంటారనే ఉద్దేశ్యంతో బడికి పంపుతున్నాం’ అని గ్రామపెద్దలు చెప్పినపుడు మనసంతా చేదు తిన్నట్లయింది. వెంటనే నేను, సుధాలత కలిసి గ్రామపరిస్థితులపై మాట్లాడుకుని ఒక అవగాహనకొచ్చాం. పొద్దస్తమానం పాఠాలే చెబుతుంటే పిల్లలకు విసుగు పుడుతుంది. అందుకే వాటితో పాటు బొమ్మలు వేయించడం, పద్యాలు నేర్పడం, కథలు చెప్పడం, పాటలు పాడించడం వంటివి ప్రారంభించాం. దాంతో పిల్లలకి పాఠశాలపై ఆసక్తి పెరిగింది.
అప్పటివరకూ ఏదో తప్పదన్నట్లుగా ఏడుపు ముఖంతో వచ్చేవారు కాస్తా ఉత్సాహంగా, సంతోషంగా బడికి రావడం మొదలుపెట్టారు’’ అంటూ తాను పాఠశాలలో అడుగుపెట్టినప్పుడున్న పరిస్థితులని గుర్తు చేసుకున్నారు అరుణ. గత ముప్పై ఏళ్లుగా అనేక ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అరుణ టీచర్‌కు పల్లెపాఠశాలలంటే ప్రాణం.
ఆణిముత్యాలు...
గడిచిన రెండేళ్లలో ఆ పాఠశాల విద్యార్థులు చదువుతోపాటు పద్యాలు, పెయింటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఊర్మిళ అనే మూడవతరగతి విద్యార్థిని పద్యాలు చెప్పడంలో మండలస్థాయిలో, పెద్దాపురం డివిజన్ స్థాయిలో బోలెడన్ని బహుమతులు గెలుచుకుని వీరి కృషికి గుర్తింపు తెచ్చింది. ‘‘నూటయాభై పద్యాలు...గుక్కతిప్పుకోకుండా చెప్పగలదు ఊర్మిళ. 2012లో తిరుపతి మహాసభలు జరిగిన సమయంలో మండలస్థాయిలో తను మొదటి బహుమతి గెలుచుకున్నప్పుడు మాకు చాలా ఆనందమేసింది. ఊర్మిళ గురించి పత్రికల్లో వచ్చినపుడు మమ్మల్ని అందరూ అభినందించారు. గంగాధర్ అనే నాలుగోతరగతి అబ్బాయి చిత్రలేఖనంలో చక్కని ప్రతిభ కనబరుస్తున్నాడు. సొంతంగా కథలు రాస్తూ వాటికి నప్పే బొమ్మలు కూడా గీస్తూ ఉపాధ్యాయుల మన్ననలతో పాటు బయటివారి మనసు కూడా గెలుచుకుంటున్నాడు.
అమ్మ చేతిలోనే...
బిడ్డ భవిష్యత్తు తల్లి చేతిలోనే ఉంటుందంటారు ఈ ఉపాధ్యాయులు. ‘‘అమ్మ కోరుకుంటే... అమ్మ పట్టుదలతో ఉంటే బిడ్డలు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు. అందుకే మా దృష్టి మొత్తం పిల్లల తల్లులపై పెట్టాం. రోజూ పిల్లలకు పాఠాలు చెబుతూనే అప్పుడప్పుడు తల్లుల్ని కూడా పిలిపిస్తూ వారికి చదువు విలువను తెలియజేస్తున్నాం. మొదట్లో అంతగా ఆసక్తి చూపేవారు కాదు కానీ, మా కృషిని గుర్తించి క్రమేణా తల్లులందరూ కూడా తమ పిల్లలతో కలిసి బడికి రావడం మొదలుపెట్టారు’’ అంటూ తమ బోధన విశేషాలను చెప్పుకొచ్చారు అరుణ టీచర్.
పాఠశాలలో హాజరుశాతం పెంచడం, పరిసరాల పరిశుభ్రత, వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, పాఠశాలలో విద్యార్థులు సాధించిన ప్రగతిని, ఇతర విశేషాలని తల్లిదండ్రులతో పంచుకోవడం, పాఠశాల కార్యక్రమాలకు తల్లిదండ్రులు కూడా హాజరయేలా చూడటం... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రెండేళ్లలో ఈ ఇద్దరు టీచర్లు చాలా మార్పులు తీసుకొచ్చారు. పాఠశాలలో, ఊరివాళ్లలో ఈ ఉపాధ్యాయులు తీసుకొచ్చిన మార్పు గురించి ఆ ఊరి పెద్ద కె. శ్రీరామమూర్తి మాట్లాడుతూ... ‘‘గురువు తలుచుకుంటే ఎంతటివారినైనా మార్చగలరని అరుణ టీచర్, సుధాలత టీచర్ నిరూపించారు. మా ఊరంతా వారికి రుణపడి ఉంటుంది’’ అని అంటారు.
చదువులమ్మపై ఉన్న అభిమానంతో రానూపోనూ రోజూ డెబ్భైకిలోమీటర్లు ప్రయాణించి మరీ ఈ ఉపాధ్యాయులు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల ఆలోచనలను కూడా మారుస్తుండడం ఎంతోమందికి ఆదర్శప్రాయం!
- భువనేశ్వరి
ఫొటోలు: లోలభట్టు శ్రీనివాసరాజు