న్యాయంగా పోరాడితే కేసులా?
బొబ్బిలి: చెరుకు బిల్లుల చెల్లింపుల్లో చట్టాలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టకుండా బకాయిల కోసం పోరాడిన వారిపై అక్రమ కేసులు పెట్టడం న్యాయమా అని ఏపీ చెరుకు రైతు సంఘ జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు ప్రశ్నించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెరుకు సరఫరా చేసిన 15 రోజుల్లో చెల్లింపులు చేయాలని చట్టం చెబుతున్నా ఖాతరు చేయని యాజమాన్యంపై ఎన్ని స్టేషన్లలో కేసులు నమోదు చేశారో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆందోళనల సమయంలో రైతులది న్యాయమైన డిమాండ్ అని చెబుతున్న పోలీసు అధికారులు ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి సమన్లను పంపించడం భావ్యం కాదన్నారు. యాజమాన్యంపై ఆర్ఆర్ యాక్టు కింద కేసులు పెడతామని చెప్పి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కేసులు పెట్టిభయపెడితే ఉద్యమాలు ఆగవని స్పష్టం చేశారు. తక్షణమే రైతులపై కేసులను వెనక్కి తీసుకుని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం పార్వతీరం, బొబ్బిలి డివిజన్ కార్యదర్శులు రెడ్డి శ్రీరాంమూర్తి, రె డ్డి వేణు పాల్గొన్నారు.