sujala sravanthi project
-
హంద్రీ–నీవా డిప్యూటీ సర్వేయర్ అరెస్టు
మదనపల్లె టౌన్: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే అభియోగంపై చిత్తూరు జిల్లా మదనపల్లె హంద్రీ–నీవా సుజల స్రవంతి డిప్యూటీ ల్యాండ్ సర్వేయర్ జి.వెంకటరమణను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి విలేకరులకు తెలిపిన వివరాలు.. మదనపల్లె ఎస్బీఐ కాలనీలో నివసిస్తున్న వెంకటరమణ మదనపల్లె తహశీల్దార్ కార్యాలయంలో రెగ్యులర్ సర్వేయర్‌గానూ, హెచ్ఎన్ఎస్ఎస్ విభాగంలో డిప్యూటీ ల్యాండ్ సర్వేయర్‌గానూ పనిచేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో వెంకటరమణ ఇంటిపై ఏఎస్పీ నేతృత్వంలో సీఐలు ప్రసాద్‌రెడ్డి, విజయేశ్వర్, గిరిధర్, మంగళవారం దాడులు నిర్వహించారు. మదనపల్లెలోని మూడు ప్రాంతాల్లోనూ, చౌడేపల్లె మండలం దుర్గసముద్రం, పుంగనూరు, నెల్లూరు జిల్లాలోని గూడూరు, కొత్తపల్లెలో ఏకకాలంలో ఆరు బృందాలతో దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి సుమారు రూ.16 కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు గుర్తించారు. అలాగే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సర్వేయర్ పేరుమీద రెండు డూప్లెక్స్ ఇళ్లు, భార్య జోత్స్న పేరుతో మరో రెండు డూప్లెక్స్ ఇళ్లు, జీప్లస్ టు భవనం, ఒక బయో ప్రొడక్టŠస్ ఫ్యాక్టరీ, కారు, బైకుతో పాటు పుంగనూరు రోడ్డులోని వలసపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో రెండు షెడ్లు ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు రూ. 1.40 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. 1996 మార్చిలో వెంకటరమణ సర్వేయర్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి చిత్తూరు జిల్లాలోనే పనిచేస్తున్నారు. ఆరేళ్ల క్రితం మదనపల్లె తహశీల్దార్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. వెంకటరమణను అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీకోర్టుకు తరలిస్తున్నట్లు ఏఎస్పీ వివరించారు. -
‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్’
సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం చుట్టింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 2009లోనే ప్రాజెక్ట్‌కు ఆయన శంకుస్థాపన చేశారని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పరిపాలనా అనుమతులు, 50 కోట్ల నిధులు కూడా వైఎస్సార్ కేటాయించారని విజయసాయిరెడ్డి తెలిపారు. దీనిని పూర్తి చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినా ఇన్నేళ్లలో ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు మళ్లీ శంకుస్థాపన చేసి సరికొత్త డ్రామాకు తెరలేపారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం చుట్టింది శ్రీ వైఎస్. 2009లోనే ప్రాజెక్ట్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. పరిపాలనా అనుమతులు, 50 కోట్ల నిధులు కూడా కేటాయించారు. దీనిని పూర్తి చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినా ఇన్నేళ్ళలో ఒక్క పైసా విదల్చలేదు. ఈరోజు మళ్ళీ శంకుస్థాపన డ్రామా. — Vijayasai Reddy V (@VSReddy_MP) November 15, 2018 -
చంద్రబాబుకు కొణతాల రామకృష్ణ లేఖ
సాక్షి, విశాఖ: ఉత్తరాంధ్రకు జీవనాధారమైన బాబు జగ్జీవన్‌రామ్ సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు చేపట్టడంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ లేఖ రాశారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న తాగు, సాగునీరు సమస్యలపై గత నాలుగేళ్లుగా ఎన్నో సార్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చామన్నారు. సుజల స్రవంతి ప్రాజెక్టుపై ప్రభుత్వం సవతి ప్రేమ చూపుతోందని ఆరోపించారు. ప్రాజెక్టుకు సంబంధించి వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఆయన కోరారు. ఉత్తరాంధ్ర ప్రజలు పంటకు సాగునీరు, తాగడానికి నీళ్లు అడుగుతున్నారే తప్ప గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుపైన కొన్ని రాజకీయ పక్షాలకు అభిప్రాయబేధాలున్నాయి. కానీ సుజల స్రవంతి ప్రాజెక్టుపై ఎలాంటి వ్యతిరేకత లేదని తెలిపారు. మేలో జరుగబోయే తెలుగుదేశం పార్టీ మహానాడులోపు ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని, లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడుతామన్నారు. ఆందోళనల అనంతర పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. లేఖలో పేర్కొన్న పలు అంశాలు - ప్రాజెక్టు పనులకు ఏడాదికి 5 వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించాలి. - అదే విధంగా ఉత్తరాంధ్రలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేయాలి - గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరిలించేందుకు కార్యాచరణ రూపొందించాలి. - బాబు జగ్జీవన్‌రామ్ సుజల స్రవంతి ప్రాజెక్టు పేరును మార్చే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలి - నిర్వాసితులకు చట్ట ప్రకారంగా తగిన నష్ట పరిహారం చెల్లించి భూ సేకరణ చేపట్టాలి. - పోలవరం ఎడమ కాలువ పనులను సత్వరం పూర్తిచేసి విశాఖ జిల్లాలోని లక్షా యాభైవేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలి. -
శేషాచల గర్భంలో ‘గంగ’ ప్రవాహం
శేషాచలం అడుగుభాగంలో గంగ పారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు శేషాచలం అటవీ ప్రాంతంలో టన్నెల్ (సొరంగ మార్గం) నిర్మాణం అనివార్యమని నీటి పారుదల శాఖ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. రెండు వారాల్లో పనులు ప్రారంభించి రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. - 33 కిలోమీటర్ల సొరంగం - ఏపీలో భారీ టన్నెల్ - ఊపందుకోనున్న గాలేరు-నగరి ప్రాజెక్టు తిరుపతి తుడా: శ్రీశైలం నుంచి జిల్లాకు నీటిని తీసుకురావాలనే ఉద్దేశంతో గాలేరు- నగరి సుజలస్రవంతి ప్రాజెక్టు(జీఎన్ఎస్ఎస్)కు దివంగత సీఎం ఎన్టీఆర్ రూపకల్పన చేసి, పనులకు శ్రీకారం చు ట్టారు. ఆయన మరణానంతరం గాలేరు- నగరి ప్రాజెక్టుకు గడ్డుకాలం ఎదురైంది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చి పనులను ప్రారంభించారు. 5 ప్యాకేజీల వరకు పనులు చేయించారు. తరువాత మరో ఐదేళ్లు ఈ ప్రాజెక్టు కనుమరుగైంది. ఎట్టకేలకు మళ్లీ తెరపైకి వచ్చింది. టన్నెల్ నిర్మాణానికి ప్రస్తుతం ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకొచ్చారు. రూ.వెయ్యి కోట్లతో 33 కిలోమీటర్ల సొరంగం గాలేరు-నగరి ప్రాజెక్టు తిరుపతి సర్కిల్ రీచ్‌లో ఎనిమిదో ప్యాకేజీతో మొదలై 14వ ప్యాకేజీతో పూర్తవుతుంది. ఎనిమి దో ప్యాకేజీ శెట్టిపల్లి నుంచి చైతన్యపురం వరకు, తొమ్మిదవ ప్యాకేజీ అక్క డి నుంచి తిరుపతి వరకు వస్తుంది. రిజర్వు ఫారెస్టు అయితే అనుమతుల సమస్య ఎదురవుతుందని భావించిన అధికారులు టన్నెల్‌కు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైల్వే కోడూరు శెట్టిగుంట నుంచి అలిపిరి ప్రాంతం (ఎన్ఎస్ఎస్ క్యాంప్ ఆఫీస్) వరకు 33 కిలోమీటర్లు టన్నెల్ (సొరంగ మార్గం)తవ్వనున్నారు. శేషాచల కొండకు ఇరువైపుల నుంచి రెండు యంత్రాలతో తవ్వనున్నారు. రూ. వెయ్యి కోట్ల అంచనాలతో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. సొరంగ మార్గం ఎలా వస్తుందంటే..! వైఎస్సార్ జిల్లాలోని శెట్టిగుంట నుంచి చిత్తూరు జిల్లాలోని చైతన్యపురం వద్ద నిర్మించనున్న బాలాజీ రిజర్వాయర్ వరకు రైల్వే ట్రాక్‌కు కిలోమీటరు దూరంలో పడమటగా సొరంగ మార్గం వస్తుంది. బాలాజీ రిజర్వాయర్ సమీపంలో 100 మీటర్ల మేరకు కాలువ వెలుపల వస్తుంది. అక్కడి నుంచి శ్రీబాలాజీ, మల్లిమడుగు రిజర్వాయర్లకు కాలువలను మళ్లిస్తారు. బాలాజీ రిజర్వాయర్ నుంచి అలిపిరి గాలిగోపురం(నామాలు) వెనుక భాగంలో చెర్లోపల్లి సమీపంలోని ఎన్ఎస్ఎస్ క్యాంపు కార్యాలయం(వేదిక్ వర్సిటీకి పడమర)వరకు వస్తుంది. తరువాత కాలువ ఓపెన్ విధానంలో నగరి వరకు వెళుతుంది. ఏపీలో ఇదే భారీ టన్నెల్ ఏపీలో ఇప్పటివరకు ఈ స్థాయి టన్నెల్ మరెక్కడా లేదు. 33 మూడు కిలోమీటర్ల మేర సొరంగ మార్గంలో కాలువలుకానీ, రైల్వే లైన్లు కానీ లేవు. పనులు పూర్తయితే తిరుపతికి ఈ ప్రత్యేకత రానుంది. అడ్డంకులు సృష్టిస్తారా? ప్రాజెక్టు పూర్తి కావాలంటే శేషాచలం అటవీ మార్గం కీలకంగా మారింది. ఈనేపథ్యంలో కొండ కింద టన్నెల్‌కు ఆస్తికులు, పండితులు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.. శాస్త్రాలు ఒప్పుకోవంటూ కొందరు అడ్డుపడే ప్రమాదం ఉందా? అన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది సొరంగ మార్గం తప్పదు గాలేరు- నగరి ద్వారా తిరుపతి చుట్టుపక్కల 12 మండలాలకు తాగు, సాగు నీరు అందించాలంటే సొరంగ మార్గం తప్పదు. అనేక పర్యాయాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాం. లిఫ్ట్ పద్ధతిని పరిశీలించినా అసాధ్యమని తేలింది. గాలేరి- నగరి పూర్తి కావాలంటే సొరంగ మార్గం తప్పదు. - ఏ. సుధాకర్, చీఫ్ ఇంజినీర్, గాలేరి-నగరి -
హంద్రీ-నీవా పిల్ల కాలువలకు మోక్షం
ఏవీఆర్ హంద్రీ-నీవా సుజలస్రవంతి ప్రాజెక్టు రెండోదశ పనుల్లో భాగంగా పిల్ల కాలువల పనులను చేపట్టేందుకు వ్యయం పెంచుతూ సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వం రూ.550కోట్ల అదనపు నిధులు కేటాయించేందుకు సిద్ధమైంది. బి.కొత్తకోట: సీఎం రాజశేఖరరెడ్డి హయాం లో ఉపకాలువల నుంచి రైతుల పోలాల్లోకి తీసుకువెళ్లాల్సిన పిల్లకాలువ పనులను చేసేందుకు కాంట్రాక్టర్లు ఎకరాకు రూ.4,700తో ఒప్పందం చేసుకున్నారు. వీటీ ద్వారా చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో 4,04,500 ఎకరాలకు సాగునీటీని అందించాలన్నది లక్ష్యం. అయి తే కాలువ పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లు పిల్ల కాలువల పనులపై శ్రద్ధచూపించలేదు. ఈ పనులను రూ.4,700తో చేపట్టేందుకు గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు మొండికేయడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఎకరాకు రూ.10,500కు పెంచుతూ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపారు. దీనికి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం అధికారం కోల్పోయే చివరి రోజుల్లో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అధికారంలోకి వచ్చిన మొదట్లో టీడీపీ ప్రభుత్వం నిలుపుదల చేస్తూ చర్యలు తీసుకొంది. తాజాగా ప్రభుత్వం పిల్లకాలువల పనులను ఎకరాకు రూ.10,500కే పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత ఒప్పందం మేరకు రూ.190కోట్లతోనే పనులు జరగాలి. ఇప్పుడు మొత్తానికి పనుల వ్యయం రూ.424కోట్లకు చేరింది. అయినప్పటికీ కాంట్రాక్టర్లు మరింత ధరను పెంచాలన్న డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. ఇకపై పనులు రద్దే.. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పిల్లకాలువల నిర్మాణం, ప్యాకేజీల్లోని పనులకు ఒప్పందం విలువను పెంచింది. ఈ విషయంలో కాంట్రాక్టర్లు మళ్లీ కొత్త ఎస్ఎస్ఆర్ రేట్ల మేరకు పెంచాలని డిమాండ్ చేస్తే చర్యలుంటాయి. పనిచేయని వాటిని రద్దుచేస్తాం. కొత్తవారికి పనులు అప్పగించే చర్యలతో ముందుకు వెళ్తాం. -మురళీనాధ్‌రెడ్డి, ఎస్ఈ, మదనపల్లె సర్కిల్