శేషాచల గర్భంలో ‘గంగ’ ప్రవాహం
శేషాచలం అడుగుభాగంలో గంగ పారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు శేషాచలం అటవీ ప్రాంతంలో టన్నెల్ (సొరంగ మార్గం) నిర్మాణం అనివార్యమని నీటి పారుదల శాఖ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. రెండు వారాల్లో పనులు ప్రారంభించి రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
- 33 కిలోమీటర్ల సొరంగం
- ఏపీలో భారీ టన్నెల్
- ఊపందుకోనున్న గాలేరు-నగరి ప్రాజెక్టు
తిరుపతి తుడా: శ్రీశైలం నుంచి జిల్లాకు నీటిని తీసుకురావాలనే ఉద్దేశంతో గాలేరు- నగరి సుజలస్రవంతి ప్రాజెక్టు(జీఎన్‌ఎస్‌ఎస్)కు దివంగత సీఎం ఎన్టీఆర్ రూపకల్పన చేసి, పనులకు శ్రీకారం చు ట్టారు. ఆయన మరణానంతరం గాలేరు- నగరి ప్రాజెక్టుకు గడ్డుకాలం ఎదురైంది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చి పనులను ప్రారంభించారు. 5 ప్యాకేజీల వరకు పనులు చేయించారు. తరువాత మరో ఐదేళ్లు ఈ ప్రాజెక్టు కనుమరుగైంది. ఎట్టకేలకు మళ్లీ తెరపైకి వచ్చింది. టన్నెల్ నిర్మాణానికి ప్రస్తుతం ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకొచ్చారు.
రూ.వెయ్యి కోట్లతో 33 కిలోమీటర్ల సొరంగం
గాలేరు-నగరి ప్రాజెక్టు తిరుపతి సర్కిల్ రీచ్‌లో ఎనిమిదో ప్యాకేజీతో మొదలై 14వ ప్యాకేజీతో పూర్తవుతుంది. ఎనిమి దో ప్యాకేజీ శెట్టిపల్లి నుంచి చైతన్యపురం వరకు, తొమ్మిదవ ప్యాకేజీ అక్క డి నుంచి తిరుపతి వరకు వస్తుంది. రిజర్వు ఫారెస్టు అయితే అనుమతుల సమస్య ఎదురవుతుందని భావించిన అధికారులు టన్నెల్‌కు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైల్వే కోడూరు శెట్టిగుంట నుంచి అలిపిరి ప్రాంతం (ఎన్‌ఎస్‌ఎస్ క్యాంప్ ఆఫీస్) వరకు 33 కిలోమీటర్లు టన్నెల్ (సొరంగ మార్గం)తవ్వనున్నారు. శేషాచల కొండకు ఇరువైపుల నుంచి రెండు యంత్రాలతో తవ్వనున్నారు. రూ. వెయ్యి కోట్ల అంచనాలతో ఈ పనులకు శ్రీకారం చుట్టారు.
సొరంగ మార్గం ఎలా వస్తుందంటే..!
వైఎస్సార్ జిల్లాలోని శెట్టిగుంట నుంచి చిత్తూరు జిల్లాలోని చైతన్యపురం వద్ద నిర్మించనున్న బాలాజీ రిజర్వాయర్ వరకు రైల్వే ట్రాక్‌కు కిలోమీటరు దూరంలో పడమటగా సొరంగ మార్గం వస్తుంది. బాలాజీ రిజర్వాయర్ సమీపంలో 100 మీటర్ల మేరకు కాలువ వెలుపల వస్తుంది. అక్కడి నుంచి శ్రీబాలాజీ, మల్లిమడుగు రిజర్వాయర్‌లకు కాలువలను మళ్లిస్తారు. బాలాజీ రిజర్వాయర్ నుంచి అలిపిరి గాలిగోపురం(నామాలు) వెనుక భాగంలో చెర్లోపల్లి సమీపంలోని ఎన్‌ఎస్‌ఎస్ క్యాంపు కార్యాలయం(వేదిక్ వర్సిటీకి పడమర)వరకు వస్తుంది. తరువాత కాలువ ఓపెన్ విధానంలో నగరి వరకు వెళుతుంది.
ఏపీలో ఇదే భారీ టన్నెల్
ఏపీలో ఇప్పటివరకు ఈ స్థాయి టన్నెల్ మరెక్కడా లేదు. 33 మూడు కిలోమీటర్ల మేర సొరంగ మార్గంలో కాలువలుకానీ, రైల్వే లైన్లు కానీ లేవు. పనులు పూర్తయితే తిరుపతికి ఈ ప్రత్యేకత రానుంది.
అడ్డంకులు సృష్టిస్తారా?
ప్రాజెక్టు పూర్తి కావాలంటే శేషాచలం అటవీ మార్గం కీలకంగా మారింది. ఈనేపథ్యంలో కొండ కింద టన్నెల్‌కు ఆస్తికులు, పండితులు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.. శాస్త్రాలు ఒప్పుకోవంటూ కొందరు అడ్డుపడే ప్రమాదం ఉందా? అన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది
సొరంగ మార్గం తప్పదు
గాలేరు- నగరి ద్వారా తిరుపతి చుట్టుపక్కల 12 మండలాలకు తాగు, సాగు నీరు అందించాలంటే సొరంగ మార్గం తప్పదు. అనేక పర్యాయాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాం. లిఫ్ట్ పద్ధతిని పరిశీలించినా అసాధ్యమని తేలింది. గాలేరి- నగరి పూర్తి కావాలంటే సొరంగ మార్గం తప్పదు.
- ఏ. సుధాకర్, చీఫ్ ఇంజినీర్, గాలేరి-నగరి