కొణతాల రామకృష్ణ
సాక్షి, విశాఖ: ఉత్తరాంధ్రకు జీవనాధారమైన బాబు జగ్జీవన్‌రామ్ సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు చేపట్టడంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ లేఖ రాశారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న తాగు, సాగునీరు సమస్యలపై గత నాలుగేళ్లుగా ఎన్నో సార్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చామన్నారు. సుజల స్రవంతి ప్రాజెక్టుపై ప్రభుత్వం సవతి ప్రేమ చూపుతోందని ఆరోపించారు. ప్రాజెక్టుకు సంబంధించి వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఆయన కోరారు.
ఉత్తరాంధ్ర ప్రజలు పంటకు సాగునీరు, తాగడానికి నీళ్లు అడుగుతున్నారే తప్ప గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుపైన కొన్ని రాజకీయ పక్షాలకు అభిప్రాయబేధాలున్నాయి. కానీ సుజల స్రవంతి ప్రాజెక్టుపై ఎలాంటి వ్యతిరేకత లేదని తెలిపారు. మేలో జరుగబోయే తెలుగుదేశం పార్టీ మహానాడులోపు ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని, లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడుతామన్నారు. ఆందోళనల అనంతర పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
లేఖలో పేర్కొన్న పలు అంశాలు
- ప్రాజెక్టు పనులకు ఏడాదికి 5 వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించాలి.
- అదే విధంగా ఉత్తరాంధ్రలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
- గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరిలించేందుకు కార్యాచరణ రూపొందించాలి.
- బాబు జగ్జీవన్‌రామ్ సుజల స్రవంతి ప్రాజెక్టు పేరును మార్చే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలి
- నిర్వాసితులకు చట్ట ప్రకారంగా తగిన నష్ట పరిహారం చెల్లించి భూ సేకరణ చేపట్టాలి.
- పోలవరం ఎడమ కాలువ పనులను సత్వరం పూర్తిచేసి విశాఖ జిల్లాలోని లక్షా యాభైవేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలి.
Comments
Please login to add a commentAdd a comment