sujayakrishna rangarao
-
‘ఇద్దరు రాజు’లకు వ్యతిరేక పవనాలు
తెలుగుదేశం పార్టీకి మొదటినుంచీ జిల్లాలో పెద్ద దిక్కుగా నిలుస్తున్నవారు ఒకరు. ఎంతోకాలంగా రాష్ట్ర మంత్రిగా... కేంద్ర మంత్రిగా... ఎంపీగా... ఎన్నో పదవులు ఆయన అలంకరించారు. కానీ జనం కోసం ఈయనేమీ చేయలేదన్న అపప్రధ మాత్రం మూటగట్టుకున్నారు. ఇక రెండో వ్యక్తి పదవికోసం గెలిపించిన పార్టీని... నమ్మిన జనాన్ని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరినవారు. ఈయన కూడా అభవృద్ధికోసమే ఈ మార్పు అని చెప్పి సొంత లాభం చూసుకున్నారు. జనం సమస్యలను గాలికొదిలేశారు. వీరిద్దరూ రాజ వంశీయులే. రాజులంటే ప్రజలకు అండగా నిలవాలి. ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి. వారి సమస్యల్లో పాలుపంచుకోవాలి. వాటన్నింటికీ వీరు వ్యతిరేకం. అందుకే ఈ సారి ఎన్నికల్లో వారు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జనం నుంచి వ్యతిరేకతను చవిచూస్తున్నారు. వీరి వైఖరి ప్రత్యర్థులకు అనుకూలంగా మారుతోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాకు చెందిన ఇద్దరు రాజులకు తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వీరు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రచారంలో భాగంగా జనం వద్దకు వెళుతుంటే.. ఇన్నాళ్లూ ఏం చేశారని మళ్లీ ఓట్లడగడానికి వచ్చారంటూ ఒక రాజుని ప్రజలు నిలదీస్తున్నా రు. దీంతో ప్రచారంలోకి వెళ్లడమే మానేశారు మరొక రాజు. ఇదీ జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుల పరిస్థితి. 1955 సంవత్సరంలో నిర్వహించిన ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించారు. ప్రస్తుతం విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం కొనసాగుతోంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో పూసపాటి వంశానికి చెందిన పి.వి.జి.రాజు, పి.అశోక్ గజపతిరాజు అధిక ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారంలో మాత్రం చొరవ చూపించలేకపోయారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గానికి చెందిన మీసాల గీతను కాదని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా తండ్రీ కూతుళ్లు అశోక్, అదితి టిక్కెట్టు తెచ్చుకున్నారు. ఇన్నేళ్ల పాలనపై ఇప్పుడు వ్యతిరేకత ఐదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జిల్లా నుంచి ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతి విజయనగరం పార్లమెంట్‌కు చేసిందేమీ లేదు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పించే రెండు ప్రధాన జూట్‌మిల్లులు మూతపడి సుమారు 12వేల కార్మిక కుంటుంబాలు రోడ్డున పడ్డా పట్టించుకోలేదు. రాష్ట్రంలోని 12 జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలలు ఉన్నా విజయనగరంలో ఏర్పాటు కాలేదు. ఇన్నాళ్లూ అశోక్‌గజపతిరాజుకు చెందిన మాన్సాస్ ట్రస్ట్ ద్వారా మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామంటూ కాలం గడిపారు. కనీసం తాను నివసించే బంగ్లా ఉన్న విజయనగరం పట్టణాన్ని తాగు నీటి సమస్య వేధిస్తున్నా ఆయనకదేమీ పట్టలేదు. ఇవన్నీ అశోక్‌కు, ఆయన కుమార్తె అదితికి ప్రతికూలతలుగా మారనున్నాయి. ప్రత్యర్ధి పార్టీకి ప్రచారాస్త్రాలుగా మారాయి. కేవలం టీడీపీకి, రాజ వంశానికి ఉన్న సంప్రదాయ ఓటింగ్‌పైనే వీరిద్దరూ ఆధారపడాల్సి వస్తోంది. సొంత ప్రాభవం లేని బొబ్బిలి రాజు 2004లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బొబ్బిలి రాజులకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఈ ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి సుజయకృష్ణ రంగారావు గెలుపొందారు. ఆ తరువాత 2009లో కూడా వైఎస్ హయాంలోనే సుజయ్ గెలుపొందారు. 2014లో వైఎస్ తనయుడు జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ నుంచి సుజయ్ పోటీచేసి గెలిచారు. అంటే వైఎస్ .రాజశేఖరెడ్డి, జగన్‌ల నేతృత్వంలోనే ప్రజలు బొబ్బిలి రాజును గెలిపించారు తప్ప ఆయన వ్యక్తిగత చరిష్మా ఏమీ లేదని స్పష్టమవుతోంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలిచింది లేదు. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన వైఎస్ కుటుంబాన్ని సుజయ్ పదవి కోసం వంచించి, పార్టీ మారడంతో ప్రజలు ఛీదరించుకుంటున్నారు. అంతగా తలకెత్తుకున్న అభిమానమంతా ఒక్కసారిగా చల్లారిపోయిందనీ, తాము వైఎస్ కుటుంబానికి నేటికీ అండగా ఉంటామని స్థానిక ప్రజలు, నాయకులు ఇప్పటికీ వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. మంత్రి పదవి రాగానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని చెప్పిన సుజయ్ ఆ విషయాన్ని మర్చిపోయి సొంత ప్రయోజనాలకు పదవిని వినియోగించుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనివల్లే ఆయనపై ప్రజా వ్యతిరేకత మొదలైంది. ఇటు పార్టీలోనూ సుజయ్‌పై బహిరంగంగానే నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిని బయటపెట్టారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో పర్యటనకు వెళుతున్న సుజయ్‌కు అక్కడక్కడ జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తన నియోజకవర్గాన్ని కాదు కదా కనీసం తాను నివసిస్తున్న బొబ్బిలి పట్టణాన్ని కూడా సుజయ్ పట్టించుకోలేకపోవడం ఆయనకు ప్రధాన అవరోధంగా మారింది. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ధనాన్ని, రాజుల సంప్రదాయ ఓటింగ్‌ను నమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. -
సాక్షి కథనాలతో ప్రభుత్వంలో చలనం
అమరావతి: కృష్ణానదిలో 100 ఎకరాలను కబ్జా చేసిన టీడీపీ నేతల ఇసుక మాఫియాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. కేఈ కృష్ణమూర్తి నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి మంత్రులు చినరాజప్ప, సుజయకృష్ణ రంగారావు, రెవెన్యూ, హోం, మైనింగ్ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం మంత్రి సుజయకృష్ణ రంగారావు మాట్లాడుతూ... సామాన్యుడికి ఉచితంగా ఇసుక అందించేందుకు ప్రయత్నిస్తామని, అక్రమ రవాణా నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కఠినమైన చట్టాలైతే ఉన్నాయని, అయితే అవి సమర్థవంతంగా అమలు జరగడం లేదన్నారు. కేసుల నమోదు బాగానే ఉందని, ఆ తర్వాతే ఏం జరగడం లేదని మంత్రి వ్యాఖ్యానించారు. యంత్రాల ద్వారా ఇసుక తవ్వడానికి అనుమతిచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. 44 చెక్‌పోస్టులున్నాయని, ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా మరిన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇసుక ర్యాంప్‌లను ఉపాధి హామీ కూలీల ద్వారా నిర్వహించేందుకు యోచన చేస్తున్నట్లు చెప్పారు. ఇసుక రవాణా నియంత్రణ బాధ్యతను ఆర్డీవో, డీఎస్పీలకు అప్పగిస్తామని చినరాజప్ప తెలిపారు. -
'యనమల నిబంధనలు తెలుసుకో'
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ తీరు దురదృష్టకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సుజయకృష్ణ రంగారావు అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారనే రోజాపై సస్పెన్షన్ వేవారని అన్నారు. వాస్తవానికి ఆఎపై వేటు నిబంధనలకు వ్యతిరేకం అని ఆయన అన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్, రోజా పై సస్పెన్షన్ అంశాలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం అసెంబ్లీ సమావేశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత సుజయకృష్ణ రంగారావు మాట్లాడుతూ ప్రభుత్వ తీరు దురదృష్టకరమని అన్నారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ అనే అంశం మహిళకు సంబంధించినదని, ఇందులో ఎక్కువమంది దళిత బాధితులే ఉన్నారని, ఈ విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వానికి వివరించి వారి కళ్లు తెరిపించాలనే ప్రయత్నంతోనే తమ నేత రోజా మాట్లాడారని, ఎక్కడ దోషులుగా దొరికిపోతామో అన్న భయంతో ఆమెపై ప్రభుత్వం అక్రమంగా సస్పెన్షన్ వేటు వేసిందని చెప్పారు. యనమల రామకృష్ణ నిబంధనలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. -
బొబ్బిలి రాజావారికి అంతే మంచిపేరు: వైఎస్ జగన్
విజయనగరం జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు డిమాండ్ చేశారు. మాన్సాస్ ట్రస్టు దరఖాస్తును పరిశీలిస్తున్నామనడం సరికాదని ఆయన సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ఆర్థిక పరిస్థితి కారణంగా ప్రభుత్వం వైద్యకళాశాల ఏర్పాటు చేయలేమని వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. వైద్య కళాశాలల ఏర్పాటులో చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. టీడీపీ పార్టీకి చెందిన అశోక్ గజపతి రాజుకి మెడికల్ కాలేజీ మంజూరు చేసి గొప్పగా చెప్పుకుంటున్నారని, చంద్రబాబు వారికిష్టం వచ్చినవారికి మెడికల్ కాలేజీకి అనుమతి ఇచ్చుకోవచ్చు...గొప్పలు చెప్పుకోవచ్చని ఆయన అన్నారు. గజపతిగారికి ఎంత మంచి పేరు ఉందో...బొబ్బిలి రాజావారికి అంతే మంచి పేరు ఉందన్నారు. ఆయన కూడా మంచి కార్యక్రమాలు చేశారని, సుజయకృష్ణా రంగారావుకు కూడా మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలన్నారు. -
'డ్వాక్రా రుణాలు మాఫీ చేసేవరకు నిద్రపోనివ్వం'
బొబ్బిలి(విజయనగరం): డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేసేవరకు ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..సంపూర్ణంగా రుణమాఫీ చేసేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రభుత్వం సకాలంలో రుణమాఫీ చేయకపోవడం వల్ల బ్యాంకులు కొత్త రుణాల మంజూరు చేయటం లేదన్నారు. దీంతో రైతులకు కొత్త రుణాలు అందకపోగా..డ్వాక్రా మహిళలపై బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైనా రుణమాఫీ చేయకపోవడం వల్లే డ్వాక్రా మహిళలకు అండగా జగన్ దీక్ష చేస్తున్నారని ఆయన చెప్పారు. -
సమరోత్సాహం
విశాఖ కళాభారతి ఆడిటోరియంలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. పార్టీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ తదితరులు సర్కారు తీరుపై సమరభేరి మోగించారు. కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపారు. విశాఖపట్నం: కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపా రు. భవిష్యత్ కార్యాచరణకు శ్రీకారం చుట్టా రు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం వైఎస్సార్సీపీ నగర పార్టీ విస్తృత స్థాయి సమావేశం పెద్ద ఎత్తున జరిగింది. భారీ సంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలకు నేతలు దిశానిర్దేశం చేశారు. నిరుత్సాహాన్ని పోగొట్టి ఉత్సాహం నింపారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణంలో కార్యకర్తలదే కీలకపాత్ర అని అన్నారు. వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాల మేరకే కమిటీలు వేయాలని సూచించారు. అనంతరం సభ్యులందరికీ రెం డు రోజులు శిక్షణ నిర్వహిస్తామన్నారు. కార్యకర్తలు క్రమశిక్షణతో మెలిగి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జ్, ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు మాట్లాడుతూ సంస్థాగతంగా పార్టీ బలంగా లేనందున అధికారంలోకి రాలేకపోయామన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మండల, డివిజ న్ స్థాయి కమిటీల ఏర్పాటుకు పూనుకున్నారన్నారు. ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తించడానికి కింద స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి ఉద్యమాలు చేస్తామన్నారు. 2009-2014 కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని ధ్వజమెత్తారు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యేలు సహా పార్టీ నేతలమంతా అండగా ఉంటామన్నారు. తలెత్తుకోలేని స్థితిలో టీడీపీ నేతలు అమలు కాని హామీలు ఇచ్చిన చంద్రబాబు వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రజల్లో తిరగలేని పరిస్థితి వస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైఎస్సార్సీపీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యం కల్పిస్తామని, కమిటీల్లో నియమించి వారికి జిల్లా నాయకులందరూ అండగా నిలుస్తారని ధైర్యాన్ని నింపారు. కార్యకర్తలు సైనికుల్లా పని చేసి జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ మోసం చేసి అధికారంలోకి రావడం బాబుకి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ప్రజలకు అబద్ధపు హామీలిచ్చి అధికారం చేజిక్కించుకున్నారని చెప్పా రు. పార్టీ ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు మాట్లాడుతూ చంద్రబాబు మాట లతో పేదలను మోసం చేస్తారని, చేతలతో ధనికులకు దోచిపెడతారని ఎద్దేవా చేశారు. కార్యదర్శి వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. కార్యదర్శి కంపా హనోకు మాట్లాడుతూ పార్టీ పురోభివృద్ధికి ఆది నుంచి కష్టపడుతున్న కార్యకర్తలను గుర్తించి ప్రాధాన్యం కల్పించాలన్నారు. మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, తైనా ల విజయకుమార్, కర్రి సీతారాం తదితరులు ప్రసంగించారు. ముందుగా వైఎస్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు తిప్పల నాగి రెడ్డి, చొక్కాకుల వెంటకరావు, రొంగలి జగన్నాథం, కోలా గురువులు, ఐ.హెచ్.ఫరూఖి, సత్తి రామకృష్ణారెడ్డి, దామా సుబ్బారావు, రవిరెడ్డి, పక్కి దివాకర్, పసుపులేటి ఉషాకిరణ్, గుడ్ల పోలిరెడ్డి, విల్లూరి భాస్కరరావు పాల్గొన్నారు. -
వై.ఎస్.విజయమ్మ పర్యటన రేపు
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ : భారీ వర్షాల కారణంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఈ నెల 30న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పర్యటించనున్నారని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజ యకృష్ణ రంగారావు సోమవారం తెలిపారు. గార, పోలాకి మండలాల తోపాటు శ్రీకాకుళం పట్టణంలో నీట మునిగిన ప్రాంతాల్లో విజయమ్మ పర్యటించి బాదితులను పరామర్శిస్తారని ఆయన పేర్కొన్నారు. విజయవంతం చేయండి: కృష్ణదాస్ జిల్లాలో విజయమ్మ పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముంపునకు గురైన ప్రాంతాల్లోని బాధితులను ఆదుకోవడంలోను, నష్టాలను అంచనా వేయటంలోను అధికార యంత్రాంగం విఫలమైందని విమర్శించారు.