sukhender reddy
-
కమ్యూనిస్టులతో కలిసుంటే బాగుండేది
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కమ్యూనిస్టులు మిత్ర పక్షంగా ఉంటే బాగుండేదని, ఎన్నికలకు ముందు వామపక్షాలు దూరం కావడం బాధాకరమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ‘ఇండియా’, ‘ఎన్డీఏ’కూటములకు సమదూరం పాటిస్తున్నందునే కమ్యూనిస్టులతో మైత్రి సాధ్యం కాలేద ని తాను భావిస్తున్నానన్నారు. మండలిలోని తన చాంబర్లో శుక్రవారం మీడియా ప్రతినిధులతో గుత్తా మాట్లాడారు. వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై బి. వినోద్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి సంప్రదింపులు జరిపారని, వారికి నామినేటెడ్ పోస్టు లు కూడా ఇస్తామన్నారని గుత్తా తెలిపారు. కాగా, తాను ఉన్న పదవిని దృష్టిలో పెట్టుకుని కమ్యూనిస్టు పార్టీ నేతల వ్యాఖ్యలపై మాట్లాడబోనన్నారు. అవకాశమిస్తేనే గుత్తా అమిత్ పోటీ నల్లగొండ ఎంపీగా 2019లో తాను పోటీ చేస్తే విజయం సాధించేవాడినని, అయితే రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యక్ష రాజకీయాల నుంచి నామినేటెడ్ పదవులవైపు వచ్చానని గుత్తా వెల్లడించారు. తాను రాజకీయాల్లో కొనసాగినంత కాలం కేసీఆర్ వెంటే ఉంటానని, భవిష్యత్తులో ఆయనకు నచ్చకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని గుత్తా ప్రకటించారు. తనకు శాసన మండలి చైర్మన్‌గా పదవీ కాలం చాలా ఉందని, సీఎం, తాను అనుకున్నంత కాలం ఆ పదవిలో కొనసాగుతానని పేర్కొన్నారు. తన కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి పార్టీ టికెట్ ఆశించిన మాట వాస్తమేనని, కానీ అవకాశం లేకుంటే పార్టీ మాత్రం ఏం చేస్తుందని అన్నారు. బట్టకాల్చి మీదేయడమే రేవంత్ పని బట్టకాల్చి ఎదుటి వారిపై వేయడమే పనిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని గుత్తా అన్నారు. రెడ్లకు భయపడి బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇచి్చందనేది అవాస్తవమని, ప్రస్తుత రాజకీయాల్లో క్వాలిటీ ఆఫ్ లీడర్ షిప్ పడిపోతోందని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో సీనియర్లు కాకుండా జూనియర్ల రాజ్యం నడుస్తోందని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా టీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారికి అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సోమవారం సాయం త్రం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడి యం శ్రీహరి, తక్కల్లపల్లి రవీందర్రావు, బండా ప్రకాశ్ ముదిరాజ్, పాడి కౌశిక్‌రెడ్డి, పి.వెంకట్రామిరెడ్డి ఉన్నారు. శాసనమండలి ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు ఈ నెల 9 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరించగా, టీఆర్ఎస్ నుంచి ఆరుగురు అభ్యర్థులతోపాటు మరో ఇద్దరు స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు పరిశీలనలో తిరస్కరణకు గురవడంతో బరిలో టీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు మాత్రమే మిగిలారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అభ్యర్థులు సాయంత్రం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమకు చట్టసభలో అవకాశమిచ్చిన పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణను చూసి ఓర్వలేకనే..: కడియం శ్రీహరి ‘అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో చిత్తశుద్ధితో పనిచేస్తాం. అభివృద్ధిలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ అన్ని ప్రాంతాలు, వర్గాలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తోంది. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు కావస్తుండగా, జీడీపీ భారీగా తగ్గి కరోనా సమయంలో అట్టడుగుకు పడిపోయింది. మోదీ పాలనాదక్షుడైతే దేశ జీడీపీ ఎలా తగ్గిందో రాష్ట్ర బీజేపీ నేతలు వివరించాలి. ధాన్యం సేకరణ అంశం కేంద్రం పరిధిలోనిదే అయినప్పటికీ కొనుగోలు చేయకుండా సమస్యలు సృష్టిస్తోంది’ అని శ్రీహరి అన్నారు. -
మోగిన నగారా.. మండలిలో అడుగు పెట్టే చాన్స్ ఎవరికో?..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూలు ఆదివారం విడుదలైంది. 119 మంది సభ్యులున్న శాసనసభలో టీఆర్ఎస్కు సంఖ్యాపరంగా 103 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఎన్నిక జరిగే ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టిలో పడేందుకు ఔత్సాహికులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ మొదటి వారంలో ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తయింది. ఎమ్మెల్యే కోటాలో పదవీ కాలం పూర్తి చేసుకున్న వారిలో మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత ఉన్నారు. మేలోనే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావించినా కోవిడ్ రెండోదశ విజృంభించడంతో వాయిదా వేసింది. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడటంతో ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు విడుదలైంది. మరోసారి అవకాశమా? గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు తమకు మళ్లీ అవకాశం దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న నేతల జాబితా చాంతాడును తలపిస్తోంది. పద్మశాలి, విశ్వ బ్రాహ్మణ వంటి సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించడంతో ఎవరికి వారు మండలిలో అడుగుపెట్టే అవకాశాలను లెక్క వేసుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో 12 మంది స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు పదవీ కాలం పూర్తవుతోంది. కేసీఆర్ వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశముంది. ఎవరికి వారే అంచనాలు... టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రులు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, ఇనుగాల పెద్దిరెడ్డి తమకు అవకాశం వస్తుందనే ధీమాతో ఉన్నారు. దీంతో పాటు వివిధ సందర్భాల్లో కేసీఆర్ నుంచి హామీ పొందిన పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కల్లపల్లి రవీందర్రావు, ఎంసీ కోటిరెడ్డి, పీఎల్ శ్రీనివాస్, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ ఈసారి అవకాశం దక్కుతుందని అంచనా వేసుకుంటున్నారు. ఇటీవలే పదవీకాలం పూర్తి చేసుకున్న స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి రమేశ్‌రెడ్డి, క్యామ మల్లేశ్ వంటి వారు జాబితాలో ఉన్నారు. కౌశిక్‌రెడ్డి పదవికి ఆమోదం లభించేనా? హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో మండలికి నామినేట్ చేస్తూ మంత్రివర్గం ఆగస్టులో తీర్మానం చేసింది. అయితే కౌశిక్‌రెడ్డిపై పలు కేసులు పెండింగ్‌లో ఉండటంతో వాటి వివరాలను గవర్నర్ కోరినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తవడం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో కౌశిక్‌రెడ్డి పేరును గవర్నర్ ఆమోదించే విషయం మళ్లీ తెరమీదకు వస్తోంది. -
తప్పుదోవ పట్టిస్తున్న సీమాంధ్ర నేతలు: ఎంపీ గుత్తా
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ కొనసాగుతుందని, విభజనకు సంబంధం లేకుండా సీమాంధ్రుల ఆందోళనలపై ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రకటించినా సీమాంధ్ర నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షపై ఆయన మాట్లాడుతూ...నిజాం కాలంనాటి చంచల్‌గూడ జైలులో సీమాంధ్రకు మద్దతుగా దీక్ష చేసే అర్హత జగన్‌కు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడేలా దీక్ష చేయదల్చుకుంటే అభ్యంతరం లేదని, దీక్ష మాత్రం సీమాంధ్ర జైళ్లలో చేసుకోవచ్చన్నారు. జగన్‌ను సీమాంధ్ర జైలుకు తరలించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపాలని కోరారు. సీమాంధ్రుల ఉద్యమం శవంతో సమానమని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతల దీక్షలపై స్పష్టమైన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ఎంపీలు పవిత్రమైన పార్లమెంటులో వీధినాటకాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌పై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలంగాణ ఎంపీల సస్పెన్షన్ విషయంలో నోరు మెదపకపోవడంతోనే ఆయన నైజం బయటపడిందన్నారు.