మోగిన నగారా.. మండలిలో అడుగు పెట్టే చాన్స్‌ ఎవరికో?..  | EC Issues Schedule For Filling Six Vacancies In Council Under MLAs Quota | Sakshi
Sakshi News home page

MLC Elections: మోగిన నగారా.. మండలిలో అడుగు పెట్టే చాన్స్‌ ఎవరికో?.. 

Published Mon, Nov 1 2021 2:36 AM | Last Updated on Mon, Nov 1 2021 1:18 PM

EC Issues Schedule For Filling Six Vacancies In Council Under MLAs Quota - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూలు ఆదివారం విడుదలైంది. 119 మంది సభ్యులున్న శాసనసభలో టీఆర్‌ఎస్‌కు సంఖ్యాపరంగా 103 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఎన్నిక జరిగే ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ దృష్టిలో పడేందుకు ఔత్సాహికులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ఏడాది జూన్‌ మొదటి వారంలో ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తయింది. ఎమ్మెల్యే కోటాలో పదవీ కాలం పూర్తి చేసుకున్న వారిలో మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, మాజీ చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత ఉన్నారు. మేలోనే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావించినా కోవిడ్‌ రెండోదశ విజృంభించడంతో వాయిదా వేసింది. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడటంతో ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు విడుదలైంది. 

మరోసారి అవకాశమా?
గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు తమకు మళ్లీ అవకాశం దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న నేతల జాబితా చాంతాడును తలపిస్తోంది. పద్మశాలి, విశ్వ బ్రాహ్మణ వంటి సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని గతంలో కేసీఆర్‌ ప్రకటించడంతో ఎవరికి వారు మండలిలో అడుగుపెట్టే అవకాశాలను లెక్క వేసుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో 12 మంది స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు పదవీ కాలం పూర్తవుతోంది. కేసీఆర్‌ వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశముంది. 

ఎవరికి వారే అంచనాలు... 
టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రులు ఎల్‌.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, ఇనుగాల పెద్దిరెడ్డి తమకు అవకాశం వస్తుందనే ధీమాతో ఉన్నారు. దీంతో పాటు వివిధ సందర్భాల్లో కేసీఆర్‌ నుంచి హామీ పొందిన పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కల్లపల్లి రవీందర్‌రావు, ఎంసీ కోటిరెడ్డి, పీఎల్‌ శ్రీనివాస్, మాజీ స్పీకర్‌ మధుసూధనాచారి, సీఎం కార్యాలయ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌ ఈసారి అవకాశం దక్కుతుందని అంచనా వేసుకుంటున్నారు.

ఇటీవలే పదవీకాలం పూర్తి చేసుకున్న స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయ కార్యదర్శి రమేశ్‌రెడ్డి, క్యామ మల్లేశ్‌ వంటి వారు జాబితాలో ఉన్నారు. 

కౌశిక్‌రెడ్డి పదవికి ఆమోదం లభించేనా? 
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్‌ కోటాలో మండలికి నామినేట్‌ చేస్తూ మంత్రివర్గం ఆగస్టులో తీర్మానం చేసింది. అయితే కౌశిక్‌రెడ్డిపై పలు కేసులు పెండింగ్‌లో ఉండటంతో వాటి వివరాలను గవర్నర్‌ కోరినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పూర్తవడం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల కావడంతో కౌశిక్‌రెడ్డి పేరును గవర్నర్‌ ఆమోదించే విషయం మళ్లీ తెరమీదకు వస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement