మంత్రి వేములతో రవీందర్‌రావు, వెంకట్రామిరెడ్డి, సుఖేందర్‌రెడ్డి, కడియం, కౌశిక్‌రెడ్డి, బండా ప్రకాశ్
సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా టీఆర్‌ఎస్ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారికి అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సోమవారం సాయం త్రం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడి యం శ్రీహరి, తక్కల్లపల్లి రవీందర్‌రావు, బండా ప్రకాశ్ ముదిరాజ్, పాడి కౌశిక్‌రెడ్డి, పి.వెంకట్రామిరెడ్డి ఉన్నారు.
శాసనమండలి ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు ఈ నెల 9 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరించగా, టీఆర్‌ఎస్ నుంచి ఆరుగురు అభ్యర్థులతోపాటు మరో ఇద్దరు స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు పరిశీలనలో తిరస్కరణకు గురవడంతో బరిలో టీఆర్‌ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు మాత్రమే మిగిలారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఆరుగురు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అభ్యర్థులు సాయంత్రం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమకు చట్టసభలో అవకాశమిచ్చిన పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణను చూసి ఓర్వలేకనే..: కడియం శ్రీహరి
‘అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో చిత్తశుద్ధితో పనిచేస్తాం. అభివృద్ధిలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ అన్ని ప్రాంతాలు, వర్గాలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తోంది.
కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు కావస్తుండగా, జీడీపీ భారీగా తగ్గి కరోనా సమయంలో అట్టడుగుకు పడిపోయింది. మోదీ పాలనాదక్షుడైతే దేశ జీడీపీ ఎలా తగ్గిందో రాష్ట్ర బీజేపీ నేతలు వివరించాలి. ధాన్యం సేకరణ అంశం కేంద్రం పరిధిలోనిదే అయినప్పటికీ కొనుగోలు చేయకుండా సమస్యలు సృష్టిస్తోంది’ అని శ్రీహరి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment