ఆకుల లలిత, కల్వకుంట్ల కవిత , సాయిచంద్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో టీఆర్‌ఎస్ స్వల్ప మార్పులు చేసింది. స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉండగా, టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఆదివారం పార్టీ తరపున సమాచారం అందించారు. నిజామాబాద్ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోటీకి ఆసక్తి చూపకుంటే మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితకు అవకాశం ఇవ్వాలని తొలుత భావించారు.
అయితే, కవిత మరోమారు సిట్టింగ్ స్థానం నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో లలితకు అవకాశం దక్కలేదు. కవిత మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు నిజామాబాద్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు కవిత వెంట నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు. మహబూబ్‌నగర్ రెండో స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డికి బదులుగా గాయకుడు సాయిచంద్‌కు ఇవ్వాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ భావించారు.
శాసనమండలిలో కాంగ్రెస్ శాసనసభా పక్షం విలీనం సందర్భంగా టీఆర్‌ఎస్‌లో చేరిన దామోదర్‌రెడ్డికి మళ్లీ అవకాశమిస్తామని అప్పట్లో కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తనకు మరోమారు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని దామోదర్‌రెడ్డి పట్టుబట్టారు. దీంతో చివరి నిమిషంలో ఆయనకు మరోమారు అవకాశం దక్కింది. జాబితాలో మార్పులతో చివరి నిమిషంలో సాయిచంద్‌కు టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం చేజారింది.
పలువురి నామినేషన్లు
టీఆర్‌ఎస్ తరపున స్థానిక సంస్థల కోటాలో పోటీ చేసే 12 మందిలో పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు (రంగారెడ్డి), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), తాతా మధు (ఖమ్మం), డాక్టర్ యాదవరెడ్డి (మెదక్) సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగియనుండటంతో మిగతా అభ్యర్థులు భానుప్రసాద్‌రావు, ఎల్.రమణ (కరీంనగర్), దండె విఠల్ (ఆదిలాబాద్), కల్వకుంట్ల కవిత (నిజామాబాద్), ఎంసీ కోటిరెడ్డి (నల్లగొండ), కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి (మహబూబ్‌నగర్) చివరిరోజు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment