Sumit Sahni
-
ఈ ఏడాదే భారత్‌లోకి ‘రెనో కాప్చర్’
ధర రూ.12 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా ముంబై: డస్టర్, క్విడ్ మోడళ్లతో జోరు చూపిస్తున్న ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘రెనో’ తాజాగా తన ప్రీమియం ఎస్యూవీ ’కాప్చర్’ను ఈ ఏడాదిలోనే భారత మార్కెట్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికంలో కాప్చర్ను మార్కెట్లోకి తీసుకువస్తామని రెనో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుమిత్ సాహ్నీ తెలియజేశారు. అంతేతప్ప ఫలానా తేదీకి తెస్తామని మాత్రం ప్రకటించలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే 10 లక్షల కాప్చర్ వాహనాలను విక్రయించామని, ఇదే ట్రెండ్‌ను భారత్‌లోనూ కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డస్టర్ ప్లాట్‌ఫామ్‌పైనే రూపొందిన ఈ కాప్చర్ వాహనాలను చెన్నై ప్లాంటులో తయారు చేస్తామన్నారు. కాగా ఈ 5 సీటర్ కాప్చర్ ఎస్యూవీ ప్రధానంగా 1.6 లీటర్ పెట్రోల్, 2 లీటర్ డీజిల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులోకి రావొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీని ధర రూ.12 లక్షల శ్రేణిలో ఉండొచ్చని సమాచారం. ఇందులో సీ–ఆకారంలోని ఎల్ఈడీ డీఆర్ఎల్ఎస్తో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, అలాయ్ వీల్స్, పెద్ద ఫ్రంట్ గ్రిల్, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, ఫ్లాట్–బాటమ్డ్ స్టీరింగ్ వీల్ వంటి పలు ప్రత్యేకతలు ఉండొచ్చని అంచనా. -
రెనో 800సీసీ కారు వస్తోంది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ రెనో ఇండియా 800 సీసీ కారును తీసుకొస్తోంది. 2015లోనే ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయి. తొలుత భారత్‌లో, ఆ తర్వాత బ్రెజిల్, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో పరిచయం చేస్తారు. చెన్నై సమీపంలోని రెనో-నిస్సాన్ సంయుక్త ప్లాంటులో ఈ కారు తయారవుతోంది. చిన్న కార్ల తయారీకై ఇరు సంస్థలు అభివృద్ధి చేసిన కామన్ మాడ్యూల్ ఫ్యామిలీ ప్లాట్‌ఫామ్‌పై ఇది రూపుదిద్దుకుంటోంది. రూ.4 లక్షల లోపు ఖరీదున్న చిన్న కారును 2015 మధ్యకాలంలో విడుదల చేస్తున్నట్టు రెనో ఇండియా సీఈవో, ఎండీ సుమిత్ సాహ్నీ వెల్లడించారు. ఈ కారును ఎంత సీసీ సామర్థ్యంతో తీసుకొచ్చేది వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. అయితే కంపెనీ ప్రకటించిన రూ.4 లక్షలలోపు కారు, అభివృద్ధి దశలో ఉన్న 800 సీసీ కారు రెండూ ఒకటేనా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కాగా, కొండాపూర్‌లో ఏర్పాటు చేసిన రెనో హైటెక్ సిటీ షోరూంను ప్రారంభించేందుకు శుక్రవారం హైదరాబాద్ వచ్చిన సుమిత్ సాహ్నీ సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ఆయనింకా ఏమన్నారంటే.. కొత్త విభాగాలను సృష్టిస్తాం..: లక్షకుపైగా డస్టర్ వాహనాలు భారతీయ రోడ్లెక్కాయి. ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ ఈ పండుగల సీజన్లో రానుంది. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల్లో డస్టర్ కొత్త విభాగాన్ని సృష్టించింది. కంపెనీ తీసుకొచ్చే ఏ వాహనమైన ప్రత్యేక విభాగాన్ని సృష్టించాల్సిందే. 2015 ప్రారంభంలో మల్టీ పర్పస్ వాహనాన్ని(ఎంపీవీ) పరిచయం చేయనున్నాం. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ వాటా దేశంలో 2.2%. ఎంపీవీ, చిన్న కారు రాకతో రెండు మూడేళ్లలో వాటా 5%కి ఎగబాకుతుంది. ప్రపంచ దేశాల్లో రెనో విక్రయిస్తున్న మోడళ్లను భారత్‌కు అనువుగా మార్పులు చేసి ప్రవేశపెడుతున్నాం. ప్రస్తుతం 141 షోరూంలున్నాయి. మార్చికల్లా 175కు చేరుస్తాం. పాత వాహనాల స్వస్తి.. చమురు దిగుమతుల కోసం వేల కోట్ల విదేశీ మారకం కోల్పోతున్నాం. పాత వాహనాలు ఇంధనాన్ని అధికంగా వినియోగిస్తాయి. అందుకే దిద్దుబాటు చర్యల్లో భాగంగా 12-15 ఏళ్లు పైబడిన వాహనాలను పెద్ద నగరాల్లో తిరక్కుండా ప్రభుత్వం నిబంధనలు విధించాలి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలి. పాత వాహనాలను తుక్కుగా (స్క్రాప్) చేయాల్సిందే. భద్రతా పరంగా చూస్తే ఇదే సరైన నిర్ణయం. ఈ విషయమై ప్రభుత్వం చొరవ తీసుకునేలా రెనో తరఫున వాహన కంపెనీల తయారీ సంఘం సియామ్పై ఒత్తిడి చేస్తున్నాం. అధిక మైలేజీ, భద్రత ప్రమాణాలతో పర్యావరణ అనుకూల కొత్త కొత్త మోడళ్లను కంపెనీలు ప్రవేశపెడుతున్నాయి.