ఈ ఏడాదే భారత్‌లోకి ‘రెనో కాప్చర్’
ధర రూ.12 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా
ముంబై: డస్టర్, క్విడ్ మోడళ్లతో జోరు చూపిస్తున్న ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘రెనో’ తాజాగా తన ప్రీమియం ఎస్‌యూవీ ’కాప్చర్’ను ఈ ఏడాదిలోనే భారత మార్కెట్‌లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికంలో కాప్చర్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తామని రెనో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుమిత్ సాహ్నీ తెలియజేశారు. అంతేతప్ప ఫలానా తేదీకి తెస్తామని మాత్రం ప్రకటించలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే 10 లక్షల కాప్చర్ వాహనాలను విక్రయించామని, ఇదే ట్రెండ్‌ను భారత్‌లోనూ కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
డస్టర్ ప్లాట్‌ఫామ్‌పైనే రూపొందిన ఈ కాప్చర్ వాహనాలను చెన్నై ప్లాంటులో తయారు చేస్తామన్నారు. కాగా ఈ 5 సీటర్ కాప్చర్ ఎస్‌యూవీ ప్రధానంగా 1.6 లీటర్ పెట్రోల్, 2 లీటర్ డీజిల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులోకి రావొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీని ధర రూ.12 లక్షల శ్రేణిలో ఉండొచ్చని సమాచారం. ఇందులో సీ–ఆకారంలోని ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ఎస్‌తో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, అలాయ్ వీల్స్, పెద్ద ఫ్రంట్ గ్రిల్, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, ఫ్లాట్–బాటమ్‌డ్ స్టీరింగ్ వీల్ వంటి పలు ప్రత్యేకతలు ఉండొచ్చని అంచనా.