‘ఫ్రెండ్స్.. నేను సీఎంను చంపేస్తా’
గంగావతి (కర్ణాటక): కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను హత్య చేస్తానని వాట్సప్‌లో బెదిరించిన ఓ యువకుడిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. సునీల్ రాయకర్ యువకుడు తన మొబైల్ ఫోన్ ద్వారా పంపినట్లు గుర్తించి గంగావతిలోని స్థానిక టౌన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మంగళవారం రాత్రి 11 గంటలకు అతడిని అరెస్టు చేశారు. సునీల్ రాయకర్ స్థానికంగా కంసాలి పనిచేస్తుంటాడు. సోదరులు, బంధువులు ఎక్కువమంది ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తలని సమాచారం.
ఈ నేపథ్యంలో సీఎంను అంతమొందిస్తానని కొద్దిరోజుల నుంచి తనకు తెలిసినవారికి వాట్సప్‌లలో సందేశం పంపసాగాడు. ఇది తెలిసిన పోలీసులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి గాలిస్తుండగా అర్ధరాత్రి పట్టుబడ్డాడు. సీఎంను కులం పేరుతో దూషించడం, హత్య చేసేందుకు బెదిరించడం, శాంతికి భంగం కలిగించేందుకు ప్రయత్నించడంవంటి ఆరోపణల కిందట అతడిపై నాలుగు కేసులు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రాజకుమార్ విలేకరులకు తెలిపారు.