అండర్-14 చాంప్ శివాని
అండర్-16లో రన్నరప్
ఐటా సూపర్ సిరీస్ టెన్నిస్
సాక్షి, హైదరాబాద్: ఐటా సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి అమినేని శివాని అండర్-14 బాలికల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకుంది. అండర్-16 విభాగంలోనూ ఫైనల్ బరిలోకి దిగిన ఆమె రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అసోంలోని చాచల్‌లో గత ఐదు రోజులుగా జరుగుతున్న ఈ పోటీలు శుక్రవారం ముగిశాయి.
అండర్-14 బాలికల సింగిల్స్ టైటిల్ పోరులో శివాని 6-0, 6-2తో మహారాష్ట్రకు చెందిన సాన్య సింగ్‌పై అలవోక విజయం సాధించింది. బాలుర ఫైనల్లో తమిళనాడు ఆటగాడు సురేశ్ 6-2, 5-7, 7-6 (8/6)తో అమిత్ బెనివాల్ (హర్యానా)పై గెలిచి విజేతగా నిలిచాడు. అండర్-16 బాలికల సింగిల్స్ ఫైనల్లో శివాని 7-5, 5-7, 6-7 (5/7)తో ప్రియాంక కలిత (అసోం) చేతిలో పోరాడి ఓడింది. బాలుర ఫైనల్లో ధ్రువ్ సునిశ్ (మహారాష్ట్ర) 6-3, 6-1తో యుగల్ బన్సాల్ (ఢిల్లీ)పై గెలిచి టైటిల్ అందుకున్నాడు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో అసోం రాష్ట్రానికి చెందిన మాజీ టెన్నిస్ ఆటగాడు ప్రశాంత దాస్ విజేతలకు బహుమతులు అందజేశారు.