వంగర పోలీసులపై ఎస్పీ కొరడా
వంగర: వంగర పోలీసులపై జిల్లా పోలీస్ సూపరిం టెండెం ట్ ఎ.ఎస్.ఖాన్ కొరడా ఝుళి పించారు. ఇద్దరు కానిస్టేబుల్స్‌ను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఖాకీ రాజీకీయం!’ శీర్షికన జూలై 21వ లేదీన ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ఆయన తీవ్రంగా స్పందించారు. వంగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న అవకతవకలుపై పాలకొండ డీఎస్పీ దేవానంద్ శాంతోతో ప్రత్యేకంగా దర్యాప్తు చేయించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ట్రాక్టర్ల యజమానులు, కర్మాగారాల మేనేజర్లు, గ్రానైట్ క్వారీ సిబ్బంది, వ్యాపారులు, ఇసుక రవాణాదారులు, కలప వ్యాపారులను డీఎస్పీ విచారించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. దాని ఆధారంగా తాజా చర్యలు తీసుకున్నారు. వంగర పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎం.క్రాంతికుమార్, రూపుకుమార్ను శ్రీకాకుళం సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారని పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది.
వంగర పోలీస్ స్టేషన్‌పై ప్రత్యేక దృష్టి
వంగర పోలీస్ స్టేషన్‌పై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించినట్లు సమాచారం. అక్రమవసూళ్లపై ఉన్నతాధికారులు ఇప్పటికే వివిధ కోణాల్లో దర్యాప్తు పూర్తి చేశారు. నివేదికల్లో పొందుపరిచిన అంశాలను పరిశీలించి బాధ్యులుపై చర్యలు తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీస్ స్టేషన్లో కొంతకాలంగా జరుగుతున్న వ్యవహారాలపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు. ఇద్దరు పోలీసులను బదిలీ చేయడంతో తివ్వలాగినట్లైంది. ఈ క్రమంలో డొంక కదులకమానదని, మరికొందరిపై చర్యలుంటాయని పలువురు చెబుతున్నారు. ఈ విషయంపై సమాచారం కోసం వంగర పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేయగా ల్యాండ్‌లైన్ పనిచేయలేదు. ఎస్ఐ జి.వీరాంజనేయులు ఫోన్‌కు అందుబాటులో లేకపోవడంతో సీఐ సిహెచ్.అంబేద్కర్, డీఎస్పీ దేవానంద్‌శాంతో వద్ద ‘సాక్షి’ ఫోన్లో ప్రస్తావించగా తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు.
ఎస్పీ వివరణ
ఎస్పీ ఎ.ఎస్.ఖాన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా వంగర పోలీస్ స్టేషన్లో ఇద్దరు కానిస్టేబుల్స్‌ను బదిలీ చేయడం వాస్తవమని తెలిపారు. అయితే ఇది సాధారణ బదిలీల్లో భాగంగా జరిగిందేనని వివరణ ఇచ్చారు.