Supply of seeds
-
సీజన్‌కు ముందే సీడ్స్
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతల ఇంటి ముంగిటకే విత్తనాలు సరఫరా చేయాలన్న ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ప్రయోగం జయప్రదమైంది. గత నెల 18వతేదీన ప్రారంభించిన విత్తనాల పంపిణీ నెల తిరగకముందే పూర్తయింది. విత్తనాలను ఉత్పత్తి, శుద్ధి చేసి, రాష్ట్రంలోని రైతాంగానికి ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తోంది. గతానికి భిన్నంగా ఎక్కడా, ఎలాంటి వివాదాలు, సమస్యలు లేకుండా విత్తనాల పంపిణీ సజావుగా పూర్తి కావడం ఈ ఏడాది ప్రత్యేకతగా వ్యవసాయ రంగ ప్రముఖులు అభివర్ణిస్తున్నారు. నాణ్యమైన విత్తనాన్ని సరసమైన ధరకు రైతులకు సకాలంలో అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా విత్తనాల పంపిణీ పూర్తి చేసినట్లు ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్‌బాబు ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు రాక ముందే వేరుశనగ విత్తనాల పంపిణీ 95 శాతం పూర్తి కాగా బుధవారం నాటికి మొత్తం వంద శాతం పంపిణీ పూర్తైనట్లు తెలిపారు. వరి విత్తనాల పంపిణీ 95.35 శాతం, పచ్చిరొట్ట విత్తనాల సరఫరా 86.21 శాతం పూర్తి అయింది. ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతం కావడం వెనుక అధికారుల సమన్వయం ఒకఎత్తు కాగా రైతులు నూతన ఒరవడికి సంసిద్ధమై ప్రణాళికాబద్ధంగా మెలగడం మరో ఎత్తుగా పేర్కొంటున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ అధికారులు ప్రణాళికాబద్ధంగా నాణ్యమైన విత్తనాల పంపిణీ పూర్తి చేశారు. ఇదెలా సాధ్యమైందంటే... రాయితీపై రైతులకు... ► మే 18వతేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి వేరుశనగ సహా ఇతర విత్తనాల పంపిణీ చేపట్టారు. 4.30 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని 40 శాతం సబ్సిడీతో గ్రామ స్థాయిలోనే పంపిణీ చేశారు. ► 2.28 లక్షల క్వింటాళ్ల వరి విత్తనం (వడ్లు) పంపిణీ చేయాలని నిర్దేశించగా ఇప్పటివరకు 1.47 లక్షల క్వింటాళ్లను కిలోకు రూ.10 రాయితీతో పంపిణీ చేశారు. ఇంకా కావాల్సిన వారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంచారు. ► 83 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను సిద్ధం చేయగా 36,144 క్వింటాళ్లకు రైతుల నుంచి ఆర్డర్లు వచ్చాయి. సుమారు 87 శాతం మందికి విత్తనాన్ని 50 శాతం రాయితీతో పంపిణీ చేశారు. ► 20,288 క్వింటాళ్ళ అపరాల విత్తనాన్ని 30 శాతం రాయితీపై ఇచ్చేందుకు రైతు భరోసా కేంద్రాల వద్ద సిద్ధం చేశారు. ► 3,310 క్వింటాళ్ల చిరుధాన్యాల విత్తనాలను 50 శాతం రాయితీపై పంపిణీకి ఆర్బీకేలలో అందుబాటులో ఉంచారు. 8.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం.. రైతన్నలకు అవసరమైన 8.39 లక్షల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను శుద్ధి చేసి గ్రామస్థాయిలో పంపిణీకి సిద్ధం చేశారు. ఖరీఫ్‌కు ముందే రైతుల నుంచి ఇండెంట్లు స్వీకరించి ఎవరికి ఏ రకం విత్తనాలు కావాలో ఆర్డర్లు తీసుకుని తదను గుణంగా విత్తనాభివృద్ధి సంస్థ సేకరించి గ్రామాలకు పంపింది. పంపిణీలో కొత్త ఒరవడి... ► గ్రామ స్థాయిలో విత్తనాల పంపిణీ రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. సీజన్‌కు ముందే, తొలకరికి ముందే విత్తనాలు పంపిణీకి సిద్ధమయ్యాయి. ► సన్న, చిన్నకారు రైతులు కొనుక్కు నేందుకు వీలుగా వివిధ పరిమాణా ల్లో ప్యాకింగ్ చేశారు. (ఉదాహరణకు 5, 10, 25 కిలోల ప్యాకెట్లలో జీలుగ, పిల్లిపెసర్లు, వడ్లు లాంటివి) ► విత్తనాల రవాణాకు ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకుని నిరాటంకంగా సరఫరా చేపట్టారు. రైతు భరోసా కేంద్రాలు, ఆన్లైన్లో విత్తనాన్ని బుకింగ్ చేసుకుని తీసుకునే సౌకర్యం కల్పించారు. ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా పంపిణీ ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన విత్తనాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేశాం. నాణ్యతపై ఫిర్యాదులు పరిష్కరించాం. వర్షాలు రాక మునుపే విత్తనాలను రైతుల చేతిలో ఉంచాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం. అందుకు అనుగుణంగా పంపిణీ పూర్తి చేశాం. రైతులకు ఇంకా ఎక్కడైనా విత్తనాలు కావాలన్నా ఇస్తాం. రైతు సేవలో ఏపీ సీడ్స్ ఎప్పుడూ ముందుకు సాగుతుంది. నాణ్యత, మొలక శాతంపై అనుమానాలు ఉంటే మా శాఖాధికారుల దృష్టికి తీసుకురావచ్చు. –శేఖర్ బాబు, ఏపీ సీడ్స్ ఎండీ -
125 రోజుల్లో పండే పోషకాహార వరి
- భారత వరి పరిశోధనా సంస్థ డెరైక్టర్ రవీంద్రబాబు - డీఆర్ఆర్ ధాన్-45 రకం వంగడాన్ని రూపొందించాం - త్వరలో తెలంగాణ, ఏపీల్లో విడుదల చేస్తాం - వరి ఆధారిత చర్మ సౌందర్య ఉత్పత్తులూ తయారు చేశామని వెల్లడి సాక్షి, హైదరాబాద్ : శరీరానికి అత్యవసరమైన పోషకాలను ఇచ్చే సరికొత్త వరి వంగడం డీఆర్ఆర్ ధాన్-45 (ఐఇటీ 23832)ను అభివృద్ధి చేసినట్లు భారత వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్ఆర్) డెరైక్టర్ వి.రవీంద్రబాబు వెల్లడించారు. 125 రోజుల్లోనే ఇది దిగుబడికి వస్తుందని తెలిపారు. దీనిని రూపొందించడానికి దాదాపు 12 ఏళ్లు కృషి చేశామని... త్వరలోనే తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విడుదల చేస్తామని చెప్పారు. పౌష్టికాహార లోపాన్ని సరిదిద్దే ఈ వరి రకాన్ని.. మెట్ట ప్రాంతాల్లోనూ పండించవచ్చని వివరించారు. తమ కృషిని గుర్తించి భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐకార్) ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉత్తమ సంస్థ అవార్డు ఇచ్చిందన్నారు. రవీంద్రబాబు శనివా రం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచే మంచి విత్తనాలు అందుతాయని, వాటితో అధిక దిగుబడి సాధ్యమని పేర్కొన్నారు. వరి సాగులో రైతుల కష్టనష్టాలను తగ్గించి, అధిక ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టామని తెలిపారు. వరి రైతులు ప్రధానంగా భూమి, శ్రమ, నీటి వసతి, క్రిమిసంహారక మందులు వంటి అంశాల్లో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. రైతులు నారుకు బదులుగా నేరుగా విత్తనాలు విత్తే పద్ధతిని వినియోగించాలని సూచిం చారు. బహుళ పంటల వ్యవస్థను ఆచరించాలన్నారు. సాధారణంతో పోల్చితే ఐదు డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలున్నా తట్టుకుని, అధిక దిగుబడులిచ్చే వంగడాల్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. చర్మ సౌందర్య ఉత్పత్తులు కూడా.. వరి ఆధారిత చర్మ సౌందర్య ఉత్పత్తులు మూడింటిని తయారు చేసినట్టు రవీంద్రబాబు తెలిపారు. చర్మం పొడిబారకుండా తేమ ఉండే (మాయిశ్చర్) క్రీమ్, నొప్పి నివారణ మందు(పెయిన్ బామ్), కాళ్ల పగుళ్ల నివారణకు ఉపయోగించే క్రీమ్‌ను తయారు చేశామన్నారు. రైతులు ముందు కు వస్తే ఈ తరహా పరిజ్ఞానాన్ని అందిస్తామని చెప్పారు. ఐకార్ ఆధ్వర్యంలోని అన్ని పరిశోధనా సంస్థల మధ్య సమన్వయం ఉండేలా కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న సాంబ మసూరి సహా వివిధ రకాల వంగడాల్లో కల్తీని నివారించి రైతులకవసరమైన విత్తనాలను ప్రభుత్వ సంస్థల నుంచే సరఫరా చేసేందుకు వచ్చే సెప్టెంబర్ నుంచి ‘విత్తన మేళాలు’ నిర్వహిస్తున్నామన్నారు. నూనె గింజలు సహా అన్ని రకాల విత్తనాలు ఈ మేళాల్లో దొరుకుతాయని.. ముందుగా బుక్ చేసుకున్న వారికి వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి కావాల్సినన్ని విత్తనాలు సరఫరా చేస్తామ న్నారు. గతంలో మంచి విత్తనాలు సరఫరా చేయడంలో తమ వైఫల్యం ఉందన్నారు. పౌష్టికాహార భద్రతా విధానంలో భాగంగా ఆహారంలో జింక్ ధాతులోపం లేని వంగడాలను రూపొందిస్తున్నామని తెలిపారు. -
సబ్సిడీకి ‘పాత’ర
♦ పాత వంగడాలకు రాంరాం ♦ కొత్త రకాల విత్తనాలకే రాయితీ ♦ పూర్తి స్థాయిలో విత్తనాలు సరఫరా చేయని వ్యవసాయశాఖ ♦ మళ్లీ పాతవే రైతులకు దిక్కు పదేళ్లుదాటిన వంగడాల సాగుకు స్వస్తి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వాటికి ప్రస్తుతం ఇస్తున్న రాయితీలను ఎత్తివేసింది. కొత్త రకాలకు మాత్రమే సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే విస్తీర్ణానికి తగ్గట్టు విత్తనాలను సరఫరా చేయలేని దుస్థితి జిల్లాలో నెలకొంది. సాక్షి, విశాఖపట్నం : పదేళ్ల క్రితం పరిశోధనల్లో రూపొందించిన వంగడాల విత్తనాలనే నేటికీ జిల్లా రైతులు వినియోగిస్తున్నారు. ఈ కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. ఉద్యాన, వాణిజ్య పంటల కంటే అన్నదాతలు ఎక్కువగా వరి సాగుపైనే ఆసక్తి కనబరుస్తారు. పాతవంగడాలనే విత్తనాలుగా దాచుకుంటున్నారు. వీటితో ప్రస్తుతం ఎకరాకు 15 నుంచి 20 బస్తాలకు మించి దిగుబడి రావడం లేదు. అలాగే ఈ వంగడాలు తెగుళ్లకు గురవుతున్నాయి. మోతాదుకు మించి మందులు, ఎరువుల వినియోగంతో భూసారం తగ్గిపోతోంది. నాలుగు ఐదు ఏళ్లుగా వీటి వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వం ఎంతగా ప్రయత్నిస్తున్నా ఆశించిన ఫలితం కనిపించడంలేదు. దీంతో ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లోనూ పాతవంగడాల వినియోగానికి పుల్‌స్టాప్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలో సోనామసూరి, సాంబమసూరి, స్వర్ణ మసూరి, శ్రీకాకుళం సన్నాలు రకాలు వాడుతున్నారు. ఎకరాకు 30 కిలోల వరకు విత్తనం అవసరం. రకాన్ని బట్టి కిలోకు ఐదు నుంచి పది రూపాయల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది. రానున్న ఖరీఫ్ నుంచి వీటిపై సబ్సిడీని ఎత్తేయడంతోపాటు పాత వంగడాల సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. వీటి స్థానంలో కొత్తగా ఎన్‌ఎల్‌ఆర్-34449 (నెల్లూరు సన్నాలు), ఎంపీయూ-1061(ఇంద్ర), ఎంపీయూ -1075 (పుష్యమి), ఆర్జీఎల్-11414 (వంశధార) రకాలను వ్యవసాయశాఖ ప్రోత్సహిస్తోంది. ఈ వంగడాలన్నీ రెండు మూడేళ్లలో పరిశోధనల ఫలితాలే. కాగా పాత వంగడాలు వద్దని చెబుతున్న ప్రభుత్వం కొత్త వంగడాల వినియోగానికి సంబంధించి విస్తీర్ణానికి తగ్గట్టుగా విత్తనాలను సరఫరా చేసే స్థితిలో మాత్రం లేదు. ప్రస్తుతం కేవలం 30 శాతం విస్తీర్ణానికి మాత్రమే ఈ కొత్త విత్తనాలను అందు బాటులో ఉంచుతోంది. మిగిలిన 70 శాతం విస్తీర్ణానికి రైతులు మళ్లీ పాత వంగడాలపైనే ఆధారపడక తప్పదు. పూర్తిస్థాయిలో విత్తనాలు సరఫరా చేయలేనప్పుడు సబ్సిడీ ఏ విధంగా ఎత్తివేస్తారని ప్రశ్నిస్తే మాత్రం రైతులు ఇంకా ఈ కొత్త వంగడాల సాగు వైపు పూర్తి స్థాయిలో ఆసక్తి చూపడంలేదని, అందువల్లే ఈ ఏడాది 30 శాతం విస్తీర్ణానికి సరపడా విత్తనాలనే సిద్ధం చేశామని అధికారులు చెప్పుకొస్తున్నారు. గతేడాది జిల్లాలో 4,69,894 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. రానున్న ఖరీఫ్‌లో మరో 30వేల ఎకరాలు అదనంగా సాగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో ఈ ఏడాది అన్ని రకాల పంటలు కలిపి సుమారు ఐదు లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశాలున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.8 లక్షల ఎకరాల్లో వరి, లక్ష ఎకరాల్లో చెరకు, 60వేల ఎకరాల్లో రాగి, 4వేల ఎకరాల్లో వేరుశనగ, 20వేల ఎకరాల్లో మొక్కజొన్న, మరో 25 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యే అవకాశాలున్నాయి. ఇక వరి తర్వాత జిల్లాలో ఎక్కువగా సాగు చేసే చెరకు విషయంలో ఇబ్బంది లేకున్నా వేరుశనగలో ఇప్పటి వరకు జేఎల్-24,టిఎంవీ-2 రకాలుసాగు చేస్తున్నారు. వీటి స్థానంలో కే-9, కె-6, ధరణి, నారాయణి రకాలు, మినుములో ఇప్పటి వరకు టి-9 వెరైటీని వాడుతుండగా, ఇక నుంచి ఎల్బీజీ 752, టీబీజీ 104, పీయూ-31, అలాగే పెసరలో ఇప్పటి వరకు ఎంఎల్-267 రకాన్ని వాడుతుండగా, ఇక నుంచి ఎల్జీజీ-462, ఎల్జీజీ-460, అలాగే లోకల్ రకాలకే పరిమితమైన కందుల సాగులో ఇక నుంచి ఎల్‌ఆర్‌జీ-41,ఎల్‌ఆర్‌జీ-42, అలాగే నువ్వులులో వైఎల్‌ఎం-11,వైఎల్‌ఎం-17, రాగుల్లో సింహాద్రి, విజెడ్ఎం వెరైటీ వంగడాలను ఖరీఫ్‌లో ప్రోత్సహిస్తున్నారు. మిగిలిన పంటలకు కొత్తవంగడాలు సరిపడా అందుబాటులో ఉంచినప్పటికీ వరిలో మాత్రం కేవలం 30 శాతం విస్తీర్ణానికి సరిపడా విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. -
సేవ కోసం కలిసి.. రైతన్నకు అండగా నిలిచి..
ఆలూర్(ఆర్మూర్‌రూరల్), న్యూస్‌లైన్ : గ్రామంలో సేవా కార్యక్రమాలు చేపట్టడానికి పదేళ్ల క్రితం ముక్కెర విజయ్, శ్రీనివాస్‌రెడ్డి, మల్లేశ్, ముత్యం, మోహన్, వెల్మ గంగారెడ్డి, సంతోష్, మునిపల్లి భాస్కర్, గంగమల్లు, వినోద్, గుండేటి భాస్కర్, బాల్‌రెడ్డి, విఠల్, తిరుపతి, తోట శ్రీనివాస్‌రెడ్డి, నితిన్‌లు కలిసి కర్షక్ గ్రూప్‌గా ఏర్పడ్డారు. గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కండె రాయుడి ఆలయం వద్ద స్వాగత ద్వారం నిర్మించారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. 2010లో జిల్లాలో ఉత్తమ సంఘంగా కర్షక్ గ్రూప్ ఎంపికైంది. అప్పటి ఎంపీ మధు యాష్కీ గౌడ్ చేతుల మీదుగా నగదు బహుమతితోపాటు అవార్డును అందుకున్నారు. వ్యవ‘సాయం’ చేయాలని.. గ్రామంలో సేవా కార్యక్రమాలు చేస్తూన్న సమయంలోనే రైతులకోసం ఏదైనా చేయాలన్న సంఘం సభ్యులకు వచ్చింది. మార్కెట్లో ఎక్కువ ధరకు విత్తనాలు కొనుగోలు చేసి రైతులు మోసపోతున్నారని గ్రహించిన సభ్యులు.. ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పి తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు అందించాలని నిర్ణయించుకున్నారు. ఏడీఏ రామారావును కలిశారు. సీడ్ విలేజ్ పోగ్రాం(ఎస్వీపీ) గ్రూప్ కింద వరి విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రూ. 4 లక్షల 80 వేల విలువ గల ఈ యూనిట్‌ను ప్రభుత్వం 90 శాతం రాయితీపై రూ. 48 వేలకే అందించింది. గతేడాది ఖరీఫ్‌లో ఈ యంత్రం ద్వారా విత్తనాల ప్రాసెసింగ్‌ను ప్రారంభించారు. ఆ సీజన్లో 130 క్వింటాళ్ల ధాన్యాన్ని శుద్ధి చేశారు. వాటిని 30 కిలోల బస్తాల్లో నింపి రైతులకు విక్రయించారు. ఒక్కో బస్తాను రూ. 600లకే అందించారు. ఇలా 400 బస్తాలను విక్రయించారు. మార్కెట్లో 30 కిలోల వరి విత్తనాల బస్తా ధర రూ. 700 నుంచి రూ. 750 ఉంది. అయితే నాణ్యమైన విత్తనాలను వీరు తక్కువ ధరకే అందించారు. ఖరీఫ్ సీజన్లో 1.82 లక్షల విలువగల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని, వీటిని శుద్ధి చేయడానికి రూ. 18 వేలు ఖర్చయ్యాయని గ్రూప్ సభ్యులు తెలిపారు. విత్తనాలను విక్రయించగా రూ. 40 వేలు లాభం వచ్చిందన్నారు. సోయాలను కూడా శుద్ధి చేసి, రైతులకు తక్కువ ధరకు విత్తనాలను అందించాలన్న ఆలోచన ఉందని పేర్కొన్నారు. మళ్లీ ఖరీఫ్ కోసం విత్తనాలను శుద్ధి చేస్తామని తెలిపారు. ఈ సంఘ సభ్యులను స్ఫూర్తిగా తీసుకొని గ్రామంలోని యువకులు కొందరు ఆంజనేయ గ్రూప్‌గా ఏర్పడి రాయితీపై ప్రాసెసింగ్ యూనిట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.