ఆలూర్(ఆర్మూర్‌రూరల్), న్యూస్‌లైన్ : గ్రామంలో సేవా కార్యక్రమాలు చేపట్టడానికి పదేళ్ల క్రితం ముక్కెర విజయ్, శ్రీనివాస్‌రెడ్డి, మల్లేశ్, ముత్యం, మోహన్, వెల్మ గంగారెడ్డి, సంతోష్, మునిపల్లి భాస్కర్, గంగమల్లు, వినోద్, గుండేటి భాస్కర్, బాల్‌రెడ్డి, విఠల్, తిరుపతి, తోట శ్రీనివాస్‌రెడ్డి, నితిన్‌లు కలిసి కర్షక్ గ్రూప్‌గా ఏర్పడ్డారు. గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కండె రాయుడి ఆలయం వద్ద స్వాగత ద్వారం నిర్మించారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. 2010లో జిల్లాలో ఉత్తమ సంఘంగా కర్షక్ గ్రూప్ ఎంపికైంది. అప్పటి ఎంపీ మధు యాష్కీ గౌడ్ చేతుల మీదుగా నగదు బహుమతితోపాటు అవార్డును అందుకున్నారు.
వ్యవ‘సాయం’ చేయాలని..
గ్రామంలో సేవా కార్యక్రమాలు చేస్తూన్న సమయంలోనే రైతులకోసం ఏదైనా చేయాలన్న సంఘం సభ్యులకు వచ్చింది. మార్కెట్‌లో ఎక్కువ ధరకు విత్తనాలు కొనుగోలు చేసి రైతులు మోసపోతున్నారని గ్రహించిన సభ్యులు.. ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పి తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు అందించాలని నిర్ణయించుకున్నారు. ఏడీఏ రామారావును కలిశారు. సీడ్ విలేజ్ పోగ్రాం(ఎస్‌వీపీ) గ్రూప్ కింద వరి విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రూ. 4 లక్షల 80 వేల విలువ గల ఈ యూనిట్‌ను ప్రభుత్వం 90 శాతం రాయితీపై రూ. 48 వేలకే అందించింది. గతేడాది ఖరీఫ్‌లో ఈ యంత్రం ద్వారా విత్తనాల ప్రాసెసింగ్‌ను ప్రారంభించారు.
ఆ సీజన్‌లో 130 క్వింటాళ్ల ధాన్యాన్ని శుద్ధి చేశారు. వాటిని 30 కిలోల బస్తాల్లో నింపి రైతులకు విక్రయించారు. ఒక్కో బస్తాను రూ. 600లకే అందించారు. ఇలా 400 బస్తాలను విక్రయించారు. మార్కెట్‌లో 30 కిలోల వరి విత్తనాల బస్తా ధర రూ. 700 నుంచి రూ. 750 ఉంది. అయితే నాణ్యమైన విత్తనాలను వీరు తక్కువ ధరకే అందించారు. ఖరీఫ్ సీజన్‌లో 1.82 లక్షల విలువగల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని, వీటిని శుద్ధి చేయడానికి రూ. 18 వేలు ఖర్చయ్యాయని గ్రూప్ సభ్యులు తెలిపారు. విత్తనాలను విక్రయించగా రూ. 40 వేలు లాభం వచ్చిందన్నారు. సోయాలను కూడా శుద్ధి చేసి, రైతులకు తక్కువ ధరకు విత్తనాలను అందించాలన్న ఆలోచన ఉందని పేర్కొన్నారు. మళ్లీ ఖరీఫ్ కోసం విత్తనాలను శుద్ధి చేస్తామని తెలిపారు. ఈ సంఘ సభ్యులను స్ఫూర్తిగా తీసుకొని గ్రామంలోని యువకులు కొందరు ఆంజనేయ గ్రూప్‌గా ఏర్పడి రాయితీపై ప్రాసెసింగ్ యూనిట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
సేవ కోసం కలిసి.. రైతన్నకు అండగా నిలిచి..
Published Tue, May 20 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM
Advertisement