125 రోజుల్లో పండే పోషకాహార వరి
- భారత వరి పరిశోధనా సంస్థ డెరైక్టర్ రవీంద్రబాబు
- డీఆర్‌ఆర్ ధాన్-45 రకం వంగడాన్ని రూపొందించాం
- త్వరలో తెలంగాణ, ఏపీల్లో విడుదల చేస్తాం
- వరి ఆధారిత చర్మ సౌందర్య ఉత్పత్తులూ తయారు చేశామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : శరీరానికి అత్యవసరమైన పోషకాలను ఇచ్చే సరికొత్త వరి వంగడం డీఆర్‌ఆర్ ధాన్-45 (ఐఇటీ 23832)ను అభివృద్ధి చేసినట్లు భారత వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్‌ఆర్) డెరైక్టర్ వి.రవీంద్రబాబు వెల్లడించారు. 125 రోజుల్లోనే ఇది దిగుబడికి వస్తుందని తెలిపారు. దీనిని రూపొందించడానికి దాదాపు 12 ఏళ్లు కృషి చేశామని... త్వరలోనే తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విడుదల చేస్తామని చెప్పారు. పౌష్టికాహార లోపాన్ని సరిదిద్దే ఈ వరి రకాన్ని.. మెట్ట ప్రాంతాల్లోనూ పండించవచ్చని వివరించారు. తమ కృషిని గుర్తించి భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐకార్) ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉత్తమ సంస్థ అవార్డు ఇచ్చిందన్నారు. రవీంద్రబాబు శనివా రం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
ప్రభుత్వ రంగ సంస్థల నుంచే మంచి విత్తనాలు అందుతాయని, వాటితో అధిక దిగుబడి సాధ్యమని పేర్కొన్నారు. వరి సాగులో రైతుల కష్టనష్టాలను తగ్గించి, అధిక ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టామని తెలిపారు. వరి రైతులు ప్రధానంగా భూమి, శ్రమ, నీటి వసతి, క్రిమిసంహారక మందులు వంటి అంశాల్లో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. రైతులు నారుకు బదులుగా నేరుగా విత్తనాలు విత్తే పద్ధతిని వినియోగించాలని సూచిం చారు. బహుళ పంటల వ్యవస్థను ఆచరించాలన్నారు. సాధారణంతో పోల్చితే ఐదు డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలున్నా తట్టుకుని, అధిక దిగుబడులిచ్చే వంగడాల్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు.
చర్మ సౌందర్య ఉత్పత్తులు కూడా..
వరి ఆధారిత చర్మ సౌందర్య ఉత్పత్తులు మూడింటిని తయారు చేసినట్టు రవీంద్రబాబు తెలిపారు. చర్మం పొడిబారకుండా తేమ ఉండే (మాయిశ్చర్) క్రీమ్, నొప్పి నివారణ మందు(పెయిన్ బామ్), కాళ్ల పగుళ్ల నివారణకు ఉపయోగించే క్రీమ్‌ను తయారు చేశామన్నారు. రైతులు ముందు కు వస్తే ఈ తరహా పరిజ్ఞానాన్ని అందిస్తామని చెప్పారు. ఐకార్ ఆధ్వర్యంలోని అన్ని పరిశోధనా సంస్థల మధ్య సమన్వయం ఉండేలా కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో దొరుకుతున్న సాంబ మసూరి సహా వివిధ రకాల వంగడాల్లో కల్తీని నివారించి రైతులకవసరమైన విత్తనాలను ప్రభుత్వ సంస్థల నుంచే సరఫరా చేసేందుకు వచ్చే సెప్టెంబర్ నుంచి ‘విత్తన మేళాలు’ నిర్వహిస్తున్నామన్నారు. నూనె గింజలు సహా అన్ని రకాల విత్తనాలు ఈ మేళాల్లో దొరుకుతాయని.. ముందుగా బుక్ చేసుకున్న వారికి వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి కావాల్సినన్ని విత్తనాలు సరఫరా చేస్తామ న్నారు. గతంలో మంచి విత్తనాలు సరఫరా చేయడంలో తమ వైఫల్యం ఉందన్నారు. పౌష్టికాహార భద్రతా విధానంలో భాగంగా ఆహారంలో జింక్ ధాతులోపం లేని వంగడాలను రూపొందిస్తున్నామని తెలిపారు.