Suraksha insurance yojana scheme
-
జీఎస్టీ పరిధిలోని వర్తకులకు బీమా
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం పలు వర్గాలను ఆకట్టుకునే చర్యలను ఒక్కొక్కటిగా ముందుకు తీసుకొస్తోంది. జీఎస్టీ పరిధిలోని చిన్న వ్యాపారుల కోసం ఓ బీమా పథకాన్ని ప్రవేశపెట్టే ప్రతిపాదనను తాజాగా పరిశీలిస్తోంది. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన తరహాలోనే, ప్రమాద బీమా కవరేజీని ఈ పథకం కింద వర్తకులకు అందించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వర్తకుల కోసం అమలు చేస్తున్న పథకం దీనికి ఆధారమని ఆ వర్గాలు తెలియజేశాయి. ఈ పథకం కింద చిన్న వర్తకులకు రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా లభించవచ్చని తెలిపాయి. ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఈ నెలాఖరులో బడ్జెట్ సమావేశాలకు ముందు దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రధానమంత్రి సురక్షా బీమా పథకం కింద ప్రస్తుతం రూ.2 లక్షల ప్రమాద బీమాను ఏడాదికి రూ.12 ప్రీమియానికే కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తోంది. 18– 70 ఏళ్ల వయసు వారికి, సేవింగ్స్ బ్యాంకు ఖాతాలుం టే ఈ బీమా కవరేజీని పొందే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఇక తమ వ్యాపారాన్ని అప్‌గ్రేడ్ చేసుకునేందుకు, కంప్యూటరైజేషన్ చేసుకునేందుకు ముందుకు వచ్చే వ్యాపారులకు రాయితీతో రుణాలివ్వాలన్న ప్రతిపాదన ను కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. మహిళా వ్యాపారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకురావచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఈ వర్గాలకు అధిక వడ్డీ రాయితీలు కూడా ఇవ్వొచ్చని పేర్కొన్నాయి. ప్రభుత్వం కొనుగోళ్లలో కొంత శాతాన్ని మహి ళా వ్యాపారుల నుంచే తీసుకునేలా రిజర్వ్ చేసే అవకాశం కూడా ఉందని తెలిపాయి. -
రవాణా కార్మికులకు రూ.5 లక్షల బీమా
హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల ఉప కార్మిక కమిషనర్లు సాక్షి, హైదరాబాద్: రవాణా రంగ కార్మికులు, డ్రైవర్లు తమ బ్యాంక్ ఖాతా ద్వారా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి 12 రూపాయలు చెల్లిస్తే ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల కార్మికశాఖ ఉప కమిషనర్లు పి.శ్రీనివాస్, ఇ.హనుమంతరావు, ఎస్.నరేశ్ కుమార్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని టి.అంజయ్య కార్మిక సంక్షేమ భవన్లో విలేకరులతో వారు మాట్లాడారు. ఈ మేడే రోజు నుంచి ఈ బీమా పథకం అమల్లోకి వచ్చిందన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందితే ఐదు లక్షల రూపాయలు వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. దీనికి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు గల ట్రాన్స్‌పోర్టు కార్మికులు, డ్రైవర్లు అర్హులని అన్నారు. ఈ పథకంపై కార్మికులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 16వ తేదీన సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ట్రేడ్ యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకు కార్మికులు టోల్‌ఫ్రీ నంబర్ 180030708787కు ఫోన్ చేయవచ్చని సూచించారు.