నిలకడైన నిలువెత్తు నటుడు
నిలువెత్తు నటుడు అతడు. నిలకడైన నటన అతడిది. హావభావ విన్యాసాల్లో ఎక్కడా మోతాదు మించడు. ఆహార్యంలో హుందాతనాన్ని వదులుకోడు. పాత్రౌచిత్యాన్ని ఏమాత్రం భంగపరచడు. బాలీవుడ్లో సిసలైన ‘సపోర్టింగ్’ యాక్టర్ అతడు... సురేశ్ ఓబెరాయ్ పక్కా హైదరాబాదీ. దేశ విభజనకు ముందు బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టాలో (ప్రస్తుతం ఇది పాకిస్థాన్‌లో ఉంది) 1946 డిసెంబర్ 17న పుట్టాడు. విభజన సమయంలో జరిగిన గొడవలకు అతడి తల్లిదండ్రులు ఆనంద్సరూప్ ఓబెరాయ్, కర్తార్దేవి భారత్‌కు వచ్చేశారు. ఆనంద్ సరూప్‌కు క్వెట్టా ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండేది.
- సురేశ్ ఓబెరాయ్
దేశ విభజనతో అన్నీ వదులుకుని, ఇక్కడకు వచ్చేశారు. తొలుత అమృత్‌సర్‌లో అడుగుపెట్టారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేశారు. అప్పటికి సురేశ్ ఓబెరాయ్ పసికందు. నిజానికి అతడి అసలు పేరు విశాల్‌కుమార్ ఓబెరాయ్. హైదరాబాద్ వచ్చేసిన కొత్తలో ఓబెరాయ్ కుటుంబం చాలా కష్టాలు పడింది. ఆనంద్ సరూప్ దంపతులకు ఎనిమిది మంది సంతానం. నలుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. తిండికి కూడా ఇక్కట్లు పడ్డారు. పరిస్థితులు చక్కబడ్డాక ఆనంద్సరూప్ ధైర్యం చేసి, పాకిస్థాన్ వెళ్లారు. స్వస్థలంలోని ఆస్తులన్నీ అమ్మేసుకుని, హైదరాబాద్‌కు తిరిగి చేరుకుని, ఇక్కడ మెడికల్ షాపులు ప్రారంభించారు. సురేశ్ ఓబెరాయ్ ఇక్కడి సెయింట్ జార్జి గ్రామర్ స్కూల్లో చదువుకున్నాడు. స్కూల్లో టెన్నిస్, స్విమ్మింగ్‌లో చాంపియన్‌గా రాణించి, బాయ్స్ స్కౌట్లో రాష్ట్రపతి పతకాన్ని అందుకున్నాడు.
డాక్టర్ కావాలనుకుని...
సురేశ్ ఓబెరాయ్ సహజ నటుడు. ఏడేళ్ల పసితనంలోనే తొలిసారిగా ఆడపిల్ల వేషంలో రంగస్థలంపై అడుగుపెట్టాడు. చదువుకునే రోజుల్లో డాక్టర్ కావాలనుకున్నాడు. హైస్కూల్ చదువు పూర్తయ్యే సమయానికి వైష్ణోదేవి యాత్రకు వెళ్లిన తండ్రి ఆకస్మికంగా మరణించడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. సోదరులతో కలసి వ్యాపార బాధ్యతలు మోయాల్సి వచ్చింది. ఓబెరాయ్ సోదరులెవరికీ పెద్దగా అనుభవం లేకపోవడంతో వ్యాపారాన్ని లాభసాటిగా నడపలేకపోయారు. వ్యాపారం తన వల్ల కాదనుకుని పుణేలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నాడు. పూర్తిగా నటనలో పడితే పాడైపోతాడనుకుని, కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం చూశారు. పుణే ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరాల్సిన రోజే.. 1974 ఆగస్టు 1న యశోధరతో పెళ్లి జరిగింది. అయితే, ఆరోగ్యం బాగాలేదని, వారంలోగా వచ్చి చేరతానని పుణే ఇన్స్టిట్యూట్కు రాశాడు. మూడు నెలల డెరైక్షన్ కోర్సు చేసి వచ్చేస్తానని భార్యతో అబద్ధమాడి బయలుదేరాడు. నిజానికి రెండేళ్ల యాక్టింగ్ కోర్సుకు అతడు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రతి వారాంతంలో ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేవాడు. హైదరాబాద్‌లో కాపురం పెట్టిన రెండేళ్లకే వివేక్ పుట్టాడు.
ఏక్‌బార్ ఫిర్...
వివేక్ పుట్టిన ఏడాదికి ముంబైకి కాపురాన్ని తరలించేశాడు. అప్పటికి ఒకటీ అరా రేడియో అసైన్మెంట్లు తప్ప సురేశ్ ఓబెరాయ్ చేతిలో సినిమాలేవీ లేవు. రేడియో కార్యక్రమాల ద్వారా వారానికి యాభై రూపాయలు వచ్చేది. యాడ్ ఏజెన్సీల చుట్టూ తిరిగితే లైఫ్‌బాయ్ సోప్, చార్మినార్ సిగరెట్లకు మోడలింగ్ చేసే అవకాశం దక్కింది. చాలా సినిమా కష్టాల తర్వాత వినోద్ పాండే దర్శకత్వంలోని ‘ఏక్‌బార్ ఫిర్’లో తొలి అవకాశం దక్కింది.
ఆ సినిమాకు పెద్దగా పబ్లిసిటీ లేకపోవడంతో అది పూర్తయ్యాక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ప్రకాశ్ మెహ్రా తన రేడియో కార్యక్రమం ‘ముకద్దర్‌కా సికందర్’లో సురేశ్ ఓబెరాయ్కి ప్రధాన పాత్ర ఇచ్చాడు. అక్కడితో అతడి గొంతుకు గుర్తింపు వచ్చింది. తొలినాళ్లలో దొరికిన పాత్రనల్లా చేసుకుంటూ పోయినా, నటనలో ఎప్పుడూ దారి తప్పలేదు. ‘మిర్చ్ మసాలా’లో ముఖి పాత్రకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ‘ఐత్బార్’, ‘లావారిస్’, ‘ఘర్ ఏక్ మందిర్’ వంటి చిత్రాల్లో విలక్షణ పాత్రలు పోషించాడు. తెలుగులో ‘మరణమృదంగం’లో, కన్నడంలో వీరప్పన్ జీవితం ఆధారంగా రూపొందించిన ‘అట్టహాస’లో రాజ్‌కుమార్ పాత్రలో రాణించడమే కాదు, ఫ్రెంచి, జపనీస్ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించాడు.
- పన్యాల జగన్నాథదాసు