భీమవరం బుల్లోడు ఆడియో ఫంక్షన్లో అపశ్రుతి
భీమవరం క్రైం, న్యూస్‌లైన్ : భీమవరంలో నిర్వహించిన ‘భీమవరం బుల్లోడు’ ఆడియో ఫంక్షన్లో అపశ్రుతి చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఓ యువకుడు మరణించాడు. స్థానిక డీఎన్నార్ కళాశాల క్రీడామైదానంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఆడియో ఫంక్షన్‌కు వెళ్లిన స్థానిక రైతుబజార్ ప్రాంతానికి చెందిన సంగిరెడ్డి సురేష్ (25) ప్రాణాలు కోల్పోయాడు. సంగిరెడ్డి రాంబాబు రెండో కుమారుడైన సురేష్ ఓ సూపర్బజార్లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య లక్ష్మి, ఏడాది వయసు కుమార్తె ఉన్నారు. లక్ష్మి ప్రస్తుతం ఏడో నెల గర్భిణి. ఆదివారం మధ్యాహ్నం ఆమె పురుటి కోసం పుట్టింటికి వెళ్ళింది.
ఆడియో ఫంక్షన్‌ను చూసేందుకు సురేష్ డీఎన్నార్ కళాశాల క్రీడామైదానంలోకి వెళ్లాడు. వేదిక సమీపంలో జరిగిన తొక్కిసలాటలో అతను స్పృహ కోల్పోయాడు. పోలీసులు అతడిని ఆటోలో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సురేష్ మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోలీసులు అతని ఇంటికి తరలించారు. ఆడియో ఫంక్షన్ నిర్వాహకులు, పోలీసుల వైఫల్యం వల్లే తన తమ్ముడు మృతిచెందాడని అతని అన్న మురళి ఆరోపించాడు. వేడుక ఏర్పాట్లను సక్రమంగా చేయకపోవటం, పోలీసుల ఓవర్ యాక్షన్ సురేష్ మృతికి కారణమని అతని బంధువులు పేర్కొన్నారు.
ఏర్పాట్లలో లోపమే కారణమా!
ఈ వేడుకకు చేసిన ఏర్పాట్లలో లోపమే సురేష్ మృతికి కారణమని స్థానికులు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశంలో వేడుక నిర్వహించేందుకు అవసరమైన పకడ్బందీ ఏర్పాట్లు ఇక్కడ చేయలేదని తెలిపారు. ఈ వేడుక చూడటానికి వచ్చిన ప్రేక్షకులను పోలీసులు పదే పదే తోసివేయటంతో ఒకరి మీద ఒకరు పడగా ఈ దుర్ఘటన జరిగింది. బహిరంగ ప్రదేశంలో నిర్వహిస్తున్న భారీ ఫంక్షన్‌కు చేయాల్సిన ఏర్పాట్లు ఇక్కడ కనిపించలేదు. సీనీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నప్పుడు పోలీసులు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు లేవు. పాస్‌లు చూపించిన వారిని పోలీసులు లోపలకు వెళ్లనీయకుండా మెయిన్ గేటు వద్ద గంటలతరబడి నిలబెట్టడం వల్ల అక్కడ కూడా తోపులాట జరిగింది.