Suresh Shetty
-
బంగారు తల్లి..!
సాక్షి ముంబై: తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వస్తోంది. రాష్ట్రంలో భ్రూణహత్యలు తగ్గుముఖం పట్టాయి. ఇన్నాళ్లూ ఆడపిల్లా? అని పెదవి విరిచినవాళ్లే ఇప్పుడు వారిని అక్కున చేర్చుకుంటున్నారు. ఈ రోజుల్లో ఎవరైతే ఏంటి.. బాగా వృద్ధిలోకి వస్తే చాలని భావిస్తున్నారు. నిషిద్ధమే అయినప్పటికీ ఇదివరకు రహస్యంగా లింగ నిర్థారణ పరీక్షలు చేయించి, పుట్టబోయేది ఆడ పిల్ల అని తెలిస్తే నిర్దాక్షిణ్యంగా అబార్షన్ చేయించుకునేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. రెండేళ్లుగా జనాభాలో ఆడపిల్లల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2011లో వెయ్యి మంది పురుషులకు గాను 894 మంది ఆడపిల్లలు ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య ప్రతి వెయ్యికీ 920కి పెరిగింది. ఈ పెరుగుదల మంచి పరిణామమని, ఇది సామాజిక సమతుల్యతకు దోహదపడుతుందని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు సర్కారు గట్టిగానే కృషి చేసింది. గత మూడళ్లుగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం మంచి ఫలితాలనిచ్చిందని ఆరోగ్య శాఖా మంత్రి సురేష్ శెట్టి అన్నారు. నిబంధనలు అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు, గర్భస్రావాలకు పాల్పడిన 66 మంది డాక్టర్లను గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. అయితే జిల్లాల వారీగా పూర్తి వివరాలు రావాల్సి ఉందని అన్నారు. మొత్తానికి ఈ నిష్పత్తి 30 పాయింట్ల పెరుగుదల నమోదైందన్నారు. బీడ్, బుల్దానా, సతారాల్లో ఈ పెరుగుదల మరింత అధికంగా ఉందని సామాజిక కార్యకర్త వర్షాదేశ్ పాండే చెప్పారు. పోలీసు, న్యాయవ్యవస్థతోబాటు ఆరోగ్య శాఖ సైతం చేతులు కలిపి ఈ కార్యక్రమాన్ని, చట్టాలను పక్కాగా అమలు చేయడం వల్లే ఈ పెరుగుదల సాధ్యమయ్యిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన కేసుల విచారణకు సర్కారు ఏకంగా 68 మంది న్యాయవాదులను ఏర్పాటు చేసింది. వాస్తవానికి పట్టణాల్లో ఈ చట్టాలను ఉల్లంఘించిన వారిని పట్టుకోవడం కష్టమని, అయినా సర్కారు పట్టువదలకుండా జోన్ స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి చట్టాన్ని పక్కాగా అమలు చేయడం వల్లే మంచి ఫలితాలు సాధిస్తున్నామని మంత్రి సురేష్ శెట్టి అన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా ‘బ్లడ్ ఆన్ కాల్’ పథకం ప్రారంభం
ముంబై: ఫోన్ చేసిన గంట వ్యవధిలోగానే అవసరమైన వారికి ఇకపై రక్తం అందనుంది. బ్లడ్ ఆన్ కాల్ (జీవన్ అమృత్ సేవ) పథకాన్ని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని గత ఏడాది సాతారా, సింధుదుర్గ్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి విదితమే. ఆ రెండు జిల్లాల్లో ఈ పథకం విజయవంతమైన సంగతి విదితమే. నగరంలోని సర్ జే జే ఆస్పత్రిలో మంగళవార మధ్యాహ్నం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి సురేశ్శెట్టి మాట్లాడుతూ ఏ గ్రూపు రక్తం కావాల్సిన వారికి ఆ గ్రూపు రక్తం సత్వరమే అందుతుందన్నారు. రక్తం కావాల్సినవారు 104 నంబరులో సంప్రదించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రక్తం లభిస్తుందన్నారు. సేకరించిన రక్తానికి పరీక్షలు నిర్వహిస్తామని, ఆ తర్వాత వాటిని ప్యాకింగ్ చేసి అత్యంత భద్రంగా ఉంచుతామని, అవసరమైన వారికి సీల్ వేసిన కంటైనర్లలో ఉంచి సరఫరా చేస్తామని అన్నారు. ప్రస్తుతం పుణేలో 104 కాల్ సెంటర్ను ఏర్పాటు చేశామని, నాలుగు నెలలలోగా రాష్ర్టంలోని పది ప్రధాన నగరాల్లో కాల్ సెంటర్లను ప్రారంభిస్తామని అన్నారు. రవాణాచార్జీలను కొనుగోలుదారుడే భరిం చాల్సి ఉంటుందన్నారు. తొలి పది కిలోమీటర్లకు రూ. 50 చెల్లించాల్సి ఉంటుందన్నారు. కాగా రాష్ర్టంలో అనుమతి పొందిన రక్తనిధి కేంద్రాలు 250 దాకా ఉన్నాయన్నారు. -
‘బ్లడ్ ఆన్ కాల్’ నేటినుంచి అమల్లోకి
ముంబై: జీవన్ అమృత్ యోజన (బ్లడ్ ఆన్ కాల్) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుంది. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సురేశ్శెట్టి వెల్లడించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలోని సాతారా, సింధుదుర్గ్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశామని, ఆ రెండు జిల్లాల్లో చక్కని స్పందన లభిందన్నారు. ఈ పథకం అమల్లో భాగంగా పుణేలో ఓ కాల్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. రక్తం అవసరమైనవారు 104 నంబరుకు ఫోన్ చేయాలన్నారు. రక్తం అందుబాటుకు సంబంధించిన సమాచారాన్ని ఆయా జిల్లాల్లోని బ్లడ్ బ్యాంకులకు ఎప్పటికప్పుడు చేరవేస్తామన్నారు. 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్నట్టయితే అత్యవసరమైనవారికి గంటలోగా వాహనాల్లో చేరవేస్తామన్నారు.